Sino-India ties
-
భారత్‌పై చైనా కొత్త పల్లవి!
బీజింగ్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి సర్వశక్తులొడ్డి మోకాలడ్డిన చైనా.. తాజాగా మన దేశంతో సంబంధాలపై కొత్త పల్లవి అందుకుంది. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతోపాటు కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు పెద్ద సవాలుగా మారుతున్నాయని ఆ దేశం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ‘పొరుగుదేశాలైన భారత్-చైనా సంబంధాల అభివృద్ధికి చరిత్రాత్మకమైన అంశమైన సరిహద్దు వివాదంతోపాటు కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు అడ్డుగా ఉన్నాయి. ఈ అంశాలను ఎలా ఎదుర్కోవాలని అనేది ఇరుదేశాలకు పెద్ద సవాలుగా మారింది’ అని చైనా విదేశాంగ సహాయమంత్రి లీ హుయిలై చెప్పారు. పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన లీ కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు ఏమిటన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తాజాగా చైనాలో పర్యటించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సరిహద్దు వివాదం, ఇతర వివాదాలు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై కనీస ప్రభావాన్ని మాత్రమే చూపే అవకాశముందని పేర్కొనగా.. చైనా మాత్రం ఈ కొత్త రాగాన్ని తెరపైకి తెచ్చింది. -
భారత్ పై మాట మార్చిన చైనా!
అంతర్జాతీయ అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్ జీ)లో భారత్ చేరికపై గత కొన్ని రోజులుగా కొర్రిలు పెడుతూ వస్తున్న చైనా తాజాగా స్వరం మార్చింది. ఎన్ఎస్ జీలో భారత్ చేరికకు తాము మద్దతు ఇస్తామని అమెరికా విస్పష్టంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాను వ్యతిరేకం కాదంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించింది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధ ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేయని దేశాలు సైతం ఎన్ఎస్ జీలో చేరే విషయమై సభ్యదేశాలు చర్చలు జరుపవచ్చునని, నాన్ ఎన్పీటీ దేశాలు సైతం ఎన్ఎస్ జీలో చేరేందుకు ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయని చైనా మంగళవారం స్పష్టం చేసింది. పైకి మిత్రదేశంగా నటిస్తూ కడుపునిండా కపట బుద్ధితో భారత్ కు అడుగడుగునా అడ్డుపడుతున్న చైనా.. ఎన్ఎస్ జీలో మన దేశం చేరికను బాహాటంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23-24 తేదీల్లో జరిగే ఎన్ఎస్ జీ సభ్యదేశాల సమావేశం ఎజెండాలో భారత్ చేరిక లేదని ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్ కు అమెరికా గట్టిగా మద్దతిస్తుండటంతో చైనా తాజాగా మాట మార్చింది. తాము భారత్, పాకిస్తాన్ సహా ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదని, ఎన్ఎస్ జీలో చేరిక కోసం చర్చలకు అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు.