
చైనాతో ఉద్రిక్తతలపై జరిగిన అఖిలపక్ష భేటీకి పిలవకపోవడంపై అసదుద్దీన్ కినుక
సాక్షి, హైదరాబాద్ : చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీకి ఏఐఎంఐఎంను ఆహ్వానించకపోవడం పట్ల ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీని పిలవకపోవడం నిరాశకు గురిచేసిందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. కీలక భేటీకి తమను ఆహ్వానించకపోవడంపై ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జాతీయ ఏకాభిప్రాయం, సమిష్టి స్పందన అవసరం కాగా ఈ సమావేశానికి ఏఐఎంఐఎంను పిలవకపోవడం దురదృష్టకరమని లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ చిన్న రాజకీయ పార్టీయే అయినా ఆ పార్టీ అధ్యక్షుడిగా తాను భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడంపై మాట్లాడిన తొలి కొద్ది మంది ఎంపీల్లో తాను ఒకడినని గుర్తు చేశారు. విదేశీ సైన్యం సరిహద్దులు దాటి దేశ భూభాగాన్ని ఆక్రమించడం జాతీయ సవాల్ అని, అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకుంటేనే ఈ సవాల్‌ను అధిగమించగలమని ఓవైసీ అన్నారు.