
నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖంలో ట్రాక్టర్లతో దున్నకం
- నిజాంసాగర్ శిఖంలో సాగుకు రైతుల పోటీ
- గొడవలకు కేంద్ర బిందువైన సరిహద్దు వివాదం
- ఏటా తప్పని పరస్పర దాడులు
- పట్టించుకోని అధికారులు
కల్హేర్: నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం భూముల్లో పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాగు విషయంలో పోటీ నెలకొనడంతో నువ్వా నేనా.. అన్నట్టుగా మారింది వ్యవహారం. రెండు జిల్లాల పరిధిలో శిఖం ఉండడంతో సరిహద్దు వివాదం నెలకొంది. ఏటా శిఖం సాగు విషయంలో రెండు జిల్లాల రైతులు పరస్పరం దాడులకు దిగుతున్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం క్యాచ్‌మెంట్ ఏరియా 38 వేల ఎకరాలకుపైగా ఉంది. కల్హేర్ మండలంలోని రాంరెడ్డిపేట, ఖానాపూర్(బి), దామర్‌చెరువు, పెద్దశంకరంపేట మండలం జుక్కల్, వీరోజీపల్లి, నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్, ఎల్లారెడ్డి మండలాల పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖంలో పంటలు వేసేందుకు రైతులు ట్రాక్టర్లతో దున్నుతున్నారు.
30 నుంచి 40 మంది రైతులు ఒక్కో గ్రూప్‌గా ఏర్పడి సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు. సాగర్ పరీవాహకంలో వేలాది ట్రాక్టర్లతో నిత్యం దున్నుతున్నాయి. ఫలితంగా సరిహద్దు విషయంలో రైతుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైతులు పరస్పర దాడులకు దిగుతున్నారు. శిఖంలో పంటలు వేసేందుకు తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
సరిహద్దు జిల్లాల మధ్య..
నిజామాబాద్ జిల్లా ఆరేడు, ఆరేపల్లి, బ్రహ్మణ్‌పల్లి గ్రామాలకు చెందిన రైతులు, కల్హేర్ మండలం మహదేవుపల్లికి చెందిన రైతులు ఇటీవల ఘర్షణకు దిగి పరస్పరం దాడులు చేసుకున్న విషయం విదితమే. గొడవల కారణంగా పోలీసు కేసులు నమోదయ్యాయి. రాంరెడ్డిపేట, దామర్‌చెరువు గ్రామాలు, పెద్దశంకరంపేట, నిజాంసాగర్, ఎల్లారెడ్డి మండలాల్లో ఏదో ఒక చోట రైతులు గొడవలు, దాడులకు పాల్పడడం ఆనవాయితీగా మారింది.
లాభదాయకం కావడంతో పెరిగిన పోటీ..
గత రెండేళ్లుగా ప్రాజెక్టులో నీరులేకపోవడంతో రైతులు శనగ, మొక్కజొన్న తదితర పంటలు వేసి సిరులు పండించారు. దీంతో సాగర్ శిఖంలో పంటలు సాగు చేసేందుకు రైతులు పోటీపడడంతో ఈ భూమి కోసం డిమాండు పెరిగింది. సరిహద్దులు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు గొడవలు, దాడులకు దిగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. శిఖంలో గొడవలు జరగకుండా నియంత్రించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.