హద్దులు దాటిన వ్యవహారం | Sakshi Editorial On Assam Mizoram Border Dispute | Sakshi
Sakshi News home page

హద్దులు దాటిన వ్యవహారం

Published Wed, Jul 28 2021 12:16 AM | Last Updated on Wed, Jul 28 2021 12:36 AM

Sakshi Editorial On Assam Mizoram Border Dispute

ఒక రాష్ట్ర పోలీసులు, మరో రాష్ట్ర పోలీసులపై కాల్పులు... ట్విట్టర్‌లో పొరుగు రాష్ట్రాల సీఎంల పరస్పర ఆరోపణలు... ఇది అంతర్‌ రాష్ట్ర వివాదమా? అంతర్జాతీయ యుద్ధమా? ఈశాన్య భారతావనిలో అస్సామ్, మిజోరమ్‌ల సరిహద్దులో సోమవారం రేగిన ఘర్షణలు... మిజోరమ్‌ కాల్పుల్లో అయిదుగురు అస్సామీ పోలీసులు అమరులవడం... 60 మంది గాయపడడం... ఇవన్నీ చూశాక ఎవరైనా అనే మాట – అనూహ్యం... అసాధారణం. రాష్ట్రాల హద్దులపై దశాబ్దాలుగా సాగుతున్న వివాదం చివరకు ఈ స్థాయిలో ఇరువైపులా భద్రతాదళాలకూ, పౌరులకూ మధ్య హింసాకాండగా మారడం మునుపెన్నడూ ఎరుగని విషయం. కేంద్ర హోమ్‌ మంత్రి రంగంలోకి దిగి, ఇరు రాష్ట్రాల సీఎంలకూ ఫోన్‌ చేసి, హితవు పలకాల్సి వచ్చిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాలు ఈనాటివి కావు. కాకపోతే, ఈసారి ఇలా అంతర్జాతీయ సరిహద్దు యుద్ధాల లాగా పోలీసుల పరస్పర కాల్పులకు విస్తరించడమే విషాదం. ఈశాన్య ప్రాంత సీఎంలతో కేంద్ర హోమ్‌ మంత్రి షిల్లాంగ్‌లో సమావేశమై, హద్దుల వివాదాలపై చర్చించి వెళ్ళిన రెండు రోజులకే ఇలా జరగడం మరీ విచిత్రం. మిజోరమ్‌ భూభాగాన్ని అస్సామ్‌ ఆక్రమించిందని ఆ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రిజర్వు అటవీ భూమిని మిజోరమ్‌ గ్రామీణులు కబ్జా చేస్తున్నారని అస్సామ్‌ ప్రత్యారోపణ చేస్తోంది. అస్సామ్‌ గడ్డపై మిజోలు తరతరాలుగా స్థిరపడి, సాగు చేస్తున్నంత మాత్రాన ఆ ప్రాంతం మిజోలది అయిపోదన్నది అస్సామీల వాదన. తాజా ఘటనలో అస్సామ్‌ పోలీసులే అత్యుత్సాహంతో సరిహద్దు గస్తీ కేంద్రాన్ని ఆక్రమించి, సామాన్యులపై జులుం చేశారని మిజోరమ్‌ నేరారోపణ. ఇది ఇంతటితో ఆగేలా లేదు. అటవీ భూమిలో అంగుళం కూడా ఆక్రమించుకోనివ్వకుండా సుప్రీమ్‌ కోర్టులో పిటిషన్‌ వేస్తామని అస్సామ్‌ సీఎం గర్జిస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోస్తూ, 4 వేల మంది కమెండోలను హద్దుల్లో మోహరిస్తామని విస్మయకర ప్రకటన చేశారు.

గమ్మత్తేమిటంటే, మూడున్నర కోట్ల పైగా జనాభా ఉన్న అస్సామ్‌ను పాలిస్తున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేవలం 11 లక్షల పైచిలుకు జనసంఖ్య ఉన్న మిజోరమ్‌ ముఖ్యమంత్రి జొరామ్‌థాంగా – ఇద్దరూ కేంద్రంలోని పాలక బీజేపీ తానుగుడ్డలే! అస్సామ్‌ సాక్షాత్తూ బీజేపీ ఏలుబడిలో ఉంటే, మిజోరమ్‌లోని పాలక ‘మిజో నేషనల్‌ ఫ్రంట్‌’ (ఎంఎన్‌ఎఫ్‌) సైతం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో భాగం. చరిత్రలోకి వెళితే – 1972 వరకు మిజోరమ్‌ సైతం అస్సామ్‌లో భాగమే. ఆదిలో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మిజోరమ్, 1987లో రాష్ట్ర హోదా పొందింది. మిజోరమ్‌తో దాదాపు 164 కిలోమీటర్ల సరిహద్దున్న అస్సామ్‌ పెద్దన్న పాత్ర పోషిస్తుండడం మిజోరమ్‌కు మొదటి నుంచి ఇబ్బందిగా మారింది. 1875లో తమ నేతలను సంప్రతించి, బ్రిటీషు కాలంలో చేసిన హద్దులనే అనుసరించాలని మిజోలు కోరుతున్నారు. కానీ, ఆ తరువాత 1933లో చేసిన హద్దులదే తుది మాట అని అస్సామ్‌ వాదన. ఇదీ ఎంతకీ తెగని పీటముడిగా మారింది. దీనికి సమర్థమైన రాజకీయ పరిష్కారం అవసరం. కానీ, సాయుధ పోలీసు పరిష్కారం కనుక్కోవాలని తాజాగా ప్రయత్నించి స్థానిక పాలకులు ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. 

నిజానికి, సహజసిద్ధమైన వనరులతో, అడవులు, పర్వతాలు, లోయలతో సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతం ఈశాన్య భారతం. ఫలితంగా అక్కడి 7 రాష్ట్రాల మధ్య కచ్చితమైన సరిహద్దుల నిర్ణయం మరింత క్లిష్టమైనది. అందుకే అక్కడి భూములు, హద్దులపై ఇన్ని వివాదాలు! దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచీ, వచ్చిన తరువాతా అక్కడ వివిధ జాతుల మధ్య సంఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. కానీ, తాజా కాల్పుల లాంటివి మాత్రం అరుదు. ఒకే దేశంలో అంతర్భాగమైన రెండు రాష్ట్రాలు కాల్పులు జరుపుకొనే పరిస్థితికి రావడం ఇన్నేళ్ళుగా సమస్యలను మురగబెట్టి, ద్వేషాన్ని పెంచిపోషించిన స్థానిక, కేంద్ర పాలకుల వైఫల్యమే! అందుకే ఇప్పుడు ఆమోదయోగ్యమైన హద్దుల నిర్ణయంతో ఘర్షణలకు ముగింపు పలకడంపై పాలకులు దృష్టి పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది.

సున్నితమైన అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో అంతర్‌ రాష్ట్ర సంఘర్షణ ఎలా చూసినా అవాంఛనీయం. ఆందోళనకరం. 1995 నుంచి అస్సామ్, మిజోరమ్‌ల చర్చల్లో కేంద్రం పాలుపంచుకున్నా, ఫలితం రాలేదు. అయితే, వచ్చే 2024 కల్లా ఈశాన్యంలో హద్దుల వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెడతామని పాలకుల మాట. అది నిజం చేయాలంటే, కేవలం స్థానిక ఓటుబ్యాంకు రాజకీయాలతో కాక, సువిశాలమైన దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, దౌత్యనైపుణ్యం చూపే నేతలు ఇప్పుడు అవసరం. వారికి కావాల్సిందల్లా సమస్యల సమగ్ర అవగాహన, చిత్తశుద్ధి! ఆ యా ప్రాంతీయుల్ని భాగస్వాములను చేసి, స్థానిక సెంటిమెంట్లనూ, ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకొంటే దీర్ఘకాలిక పరిష్కారం, ప్రజల మధ్య శాశ్వత సామరస్యం సాధించడం అసాధ్యమేమీ కాదు. రాష్ట్ర పాలకులతో అది సాధ్యం కాకపోతే, కేంద్రమే పెద్దమనిషి పాత్ర పోషించాలి. అయితే అంతకన్నా ముందుగా తమను పరాయివారిగా చూస్తున్నారని భావిస్తున్న ఈశాన్యంలోని స్థానిక జాతులకూ, అభివృద్ధికి నోచుకోని సుదూర ప్రాంతాలకూ వారూ ఈ దేశంలో అంతర్భాగమనే నమ్మకం కలిగించాలి. పరస్పర సోదరభావం పెంపొందించాలి. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా, పడమటి చివరి నుంచి ఈశాన్యం కొస వరకు దేశాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకోవాలని కోరుకొనే పాలకుల నుంచి ఆ మాత్రం ఆశిస్తే అది తప్పు కాదేమో! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement