సాక్షి, న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల ఘర్షణలతో పెచ్చుమీరిన సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య సోమవారం జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని సైన్యం ప్రకటించింది.పూర్తి సామరస్య, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, ఇరు పక్షాల సేనలు వెనక్కితగ్గాలనే అంశంపై పరస్పర అంగీకారానికి వచ్చాయని పేర్కొంది. తూర్పు లడఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సైన్యం వెనక్కిమళ్లేందుకు అంగీకారం కుదిరిందని, ఇరు పక్షాలు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళతాయని సైన్యం పేర్కొంది.
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఉద్రిక్తతలను నివారించే ఉద్దేశంతో తూర్పు లడఖ్‌లో చైనా భూభాగంలోని మోల్దో ప్రాంతంలో సోమవారం ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్ధాయి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న చివరిసారిగా జరిగిన ఈ చర్చల్లో సరిహద్దు ప్రాంతాల నుంచి సేనల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకరించాయి. తొలి భేటీ అనంతరం కొద్దిరోజులకే భారత్, చైనా సేనల మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment