భారత్–చైనా సంబంధాలు చిత్రమైనవి. అనేక అంశాల్లో విభేదాలుంటాయి. సరిహద్దుల్లో అప్పు డప్పుడు చిన్నపాటి ఘర్షణలు సాగుతుంటాయి. కానీ వీటికి సమాంతరంగా ద్వైపాక్షిక సంబంధాలు యధావిధిగా కొనసాగడమే కాదు... అవి విస్తృతమవుతుంటాయి. ఇరు దేశాధినేతల మధ్య ఏటా శిఖ రాగ్ర స్థాయి చర్చలుంటాయి. అధినేతలిద్దరి దేహభాష చూసిన వారికి ఇకపై రెండు దేశాలూ సమష్టిగా సాగుతాయన్న అభిప్రాయం కలుగుతుంది. మళ్లీ కొన్ని రోజులకే సరిహద్దుల్లో ఎక్కడో ఒకచోట సమస్యలు తలెత్తుతాయి. ఆ వెనకే మిగిలినవన్నీ చోటుచేసుకుంటాయి. ఇప్పుడు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) పొడవునా లద్దాఖ్ ప్రాంతంలో మూడుచోట్ల భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. వాస్తవానికి గత రెండు వారాలుగా చైనా సైన్యం గల్వాన్ లోయ వద్ద దాదాపు వంద శిబిరాలు ఏర్పాటు చేసి బంకర్ల నిర్మాణం కోసం భారీ యంత్రాలను తెచ్చింది. తూర్పు లద్దాఖ్‌లో ఈ నెల మొదటివారంలో ఇరుపక్షాల సైనికులూ తలపడ్డారు. రాళ్లు రువ్వుకున్నారు. రెండువైపులా వంద మందికి గాయాలయ్యాయి. కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాక ఇది పరిష్కారమైంది. ఆ తర్వాత ఈనెల 9న ఉత్తర సిక్కింలోని నకులా సెక్టార్ వద్ద కూడా ఆ మాదిరి ఘటనే జరిగింది. తూర్పు లద్దాక్‌లో గత వారం రోజుల్లో పలుమార్లు చైనా సైనికులు సరిహద్దులు అతిక్రమించినట్టు వార్త లొచ్చాయి. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినప్పటినుంచీ చైనా గుర్రుగానే వుంది. జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా వున్న ఆ ప్రాంతానికి ఏ ప్రతిపత్తి ఇవ్వాలో నిర్ణయించుకునే హక్కు మన దేశానికుంటుంది. దాంతో చైనాకు పేచీ వుండటం అర్ధరహితం.
మూడేళ్లక్రితం డోక్లామ్ ట్రై జంక్షన్ వద్ద 73 రోజులపాటు రెండు దేశాల సైన్యాల మధ్యా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో ఈ పరిణామాలు యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళన చోటుచేసుకుంది. ఒకపక్క ఇరు దేశాల అధినేతలూ వుహాన్ నగరంలో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతుండగా చైనా ఎందుకిలా ప్రవర్తిస్తున్నదన్న సందేహాలు ఏర్పడ్డాయి. తీరా శిఖరాగ్ర సదస్సు సమయానికల్లా ఉద్రిక్తతలు సడలి, అంతా సర్దుకుంది. రెండు దేశాల సైన్యాల మధ్యా కమ్యూనికేషన్ల వ్యవస్థను పటిష్టం చేయడానికి అవసరమైన ‘వ్యూహాత్మక మార్గనిర్దేశం’ చేద్దామని, అలా చేయడం వల్ల పరస్పర విశ్వాసమూ, అవ గాహన ఏర్పడతాయని వుహాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నిర్ణయించారు. అది ఎంతవరకూ ఆచరణకొచ్చిందో ఎవరికీ తెలియదు. తిరిగి రెండు దేశాల సైన్యాల మధ్యా ఇప్పుడు అగ్గి రాజుకుంది.
భారత, చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ పొడవునా పలుచోట్ల సమస్యలు న్నాయి. ఈ సరిహద్దును పశ్చిమ, మధ్య, తూర్పు సెక్టార్లుగా విభజించారు. ఈ రేఖ ఏ ప్రాంతంలో ఎలా వుందన్న అంశంలో ఇరు దేశాలకూ భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు ఎల్‌ఏసీ 2,000 కిలోమీటర్లు మించదని చైనా వాదిస్తోంది. ఎల్‌ఏసీ పొడవునా తమ భూభాగమని భావించినచోట సైన్యాలు గస్తీ తిరుగుతున్నప్పుడు ఘర్షణలు జరుగుతుంటాయి. తాము గస్తీ తిరిగే చోటు తమదేనని ఒక పక్షం, కాదు తమదని మరో పక్షం వాదించుకున్నప్పుడు చివరికి అవి ఘర్షణలుగా పరిణమిస్తున్నాయి. ఎక్కువగా ఉత్తర లద్దాఖ్‌లోవున్న పాంగాంగ్ సో సరస్సు వద్ద ఈ ఘర్షణలు పరిపాటి. ఆ సరస్సులోని జలాల్లో భారత్ సరిహద్దు ముగిసేచోటు, చైనా సరిహద్దు ప్రారం భమయ్యేచోటు ఎక్కడన్నది వివాదాస్పదం.
ఈ సరస్సు పశ్చిమ ప్రాంతం మన దేశం అధీనంలో వుంది. 1962 యుద్ధ సమయంలో ఈ సరస్సున్న ప్రాంతంనుంచే చైనా మొదటిసారిగా సాయుధ దాడులు మొదలు పెట్టింది గనుక ఈ ప్రాంతంలో అత్యంత జాగురూకతతో వ్యవహరించి దాన్ని పరిరక్షించుకోవాలని మన దేశం నిర్ణయించింది. పోంగాంగ్ సో సరస్సు తీరం పొడవునా గత కొన్నే ళ్లుగా చైనా రహదార్ల నిర్మాణం పనులు చురుగ్గా సాగిస్తోంది. అవసరమైన పక్షంలో సులభంగా ట్రక్కుల ద్వారా సైన్యాన్ని, ఇతర సామగ్రిని తరలించడానికే ఇదంతా. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్‌లో తలపడవలసి వచ్చిన ప్పుడు సరస్సు ప్రాంతంలోవున్న సైన్యాన్ని మన దేశం కార్గిల్‌కు తర లించవలసి వచ్చింది. అదే అదునుగా చైనా మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించింది. నేరుగా కారకోరం రహదారికి అనుసంధానించే వివిధ రహదారుల్లో ఇది కూడా భాగమైంది. మరోపక్క అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమ దక్షిణ టిబెట్‌లో అంతర్భాగమని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది.
సమస్యలెన్నివున్నా ఇరు దేశాల మధ్యా వాణిజ్య, వ్యాపార సంబంధాలను పెంపొందించుకోవాలని... ఈ రంగాల్లో బంధం బలపడితే సరిహద్దు సమస్యలు సులభంగా సమసిపోతాయని రెండు దేశాలూ ఒక అంగీకారానికొచ్చాయి. చెప్పాలంటే ఆ సంబంధాలు పెంపొందుతూనే వచ్చాయి. అవి 2017–18నాటికే 7,600 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అయితే 2018–19కల్లా అది కొంత తగ్గి 7,000 కోట్ల డాలర్ల వద్ద ఆగింది. దాన్ని 10,000 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని నిరుడు భారత్, చైనాలు రెండూ అనుకున్నా అది సాధ్యపడలేదు. ఇందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యమే తప్ప ఇరు దేశాల మధ్యా వచ్చిన పొరపొచ్చాలు కాదు. ఐటీ, ఫార్మా రంగాల్లో కూడా తమ ఎగుమతులకు చోటు కల్పించాలని మన దేశం కొన్నేళ్లుగా చెబుతూ వచ్చినా, ఆ అంశంపై చర్చిద్దామంటూ చైనా దాటవేస్తూ వచ్చింది. ఈలోగా కరోనా వైరస్ మహమ్మారి కాటేయడంతో వ్యాపార, వాణిజ్య బంధంలో మరింత స్తబ్దత చోటు చేసుకుంది. ప్రపంచ పరిణామాలు వేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలూ పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్క రించుకోవడానికి ప్రయత్నించాలి. ఆ చర్చలకు ముందు వాస్తవాధీన రేఖ వద్ద యధాపూర్వ స్థితి నెలకొనేలా చూడాలి. ఘర్షణలు పెరిగితే అది రెండు దేశాలకూ మంచిది కాదు.
Comments
Please login to add a commentAdd a comment