సాక్షి, ముంబై: రోజురోజుకు ముదురుతున్న మహారాష్ట్ర–కర్నాటక సరిహద్దు వివాదంపై చర్చించేందుకు శివసేన త్వరలో ప్రధాని నరేంద్రమోదీ నుంచి అపాయింట్‌మెంట్ తీసుకోవాలని భావిస్తోంది. అదేవిధంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సాయంతో నరేంద్రమోదీతో భేటీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు శివసేన ఎంపీ వినాయక్ రావుతే స్పష్టంచేశారు. స్వాతంత్య్రం, ఆ తరువాత ప్రత్యేక మహారాష్ట్ర ఏర్పడిన తరువాత మొదలైన మహారాష్ట్ర–కర్నాటక సరిహద్దు వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఇటీవల కాలంలో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరంగా ఘాటు వ్యాఖ్యలు చేసుకునే వరకు దారితీసింది. మూడు రోజుల కిందట కర్నాటకకు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం తమదేనని, కర్నాటకలో భాగమని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా మారాయి.
దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు పూర్తికాగానే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రధాని మోదీతో శివసేన ఎంపీలు భేటీ కానున్నారు. వీరితోపాటు శరద్ పవార్ కూడా భేటీ అవుతారు. అంతకుముందు సరిహద్దు వివాదం అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు శివసేన ఎంపీలందరూ శరద్ పవార్‌తో భేటీ అవుతారు. ఈ భేటీలోనే ప్ర«ధాని మోదీతో భేటీ అయ్యేందుకు శరద్ పవార్ మధ్యవర్తిగా వ్యవహరించాలని శివసేన ఎంపీలు విజ్ఞప్తి చేయనున్నారు. ఒకవేళ ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ లభిస్తే శరద్ పవార్‌తో కలిసి శివసేన ఎంపీలందరు మోదీతో చర్చించనున్నట్లు రావుతే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment