
అమరజవాన్ల మరణంపై రాష్ట్రపతి ప్రగాఢ సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : చైనా సేనలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది సైనికులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం సంతాపం తెలిపారు. అమరవీరుల సమున్నత త్యాగాలను ఆయన కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు అత్యున్నత త్యాగం చేసిన సైనికుల ధైర్యానికి సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నానని రాష్ట్రపతి కోవింద్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. లడఖ్‌లోని గాల్వన్ లోయలో నేలకొరిగిన సైనికులందరూ భారత సాయుధ దళాలు నెలకొల్పిన సంప్రదాయాలను సమున్నతంగా నిలబెట్టారని కొనియాడారు. వారి కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు.