ఎగుమతి, దిగుమతులపై డేగ కన్ను! | Customs Focus on Export And Imports | Sakshi
Sakshi News home page

ఎగుమతి, దిగుమతులపై డేగ కన్ను!

Published Mon, Apr 6 2020 10:02 AM | Last Updated on Mon, Apr 6 2020 10:02 AM

Customs Focus on Export And Imports - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌–19 విజృంభిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా కస్టమ్స్‌ విభాగం తన పని తీరును మార్చుకుంటోంది. సంప్రదాయ విధానాలకు భిన్నంగా తాజా పరిగణామాలను బట్టి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఐటీసీ) ఆదేశాలు, సూచనల్ని పరిగణలోకి తీసుకుని విధులు నిర్వర్తిస్తోంది. గతానికి భిన్నంగా నిర్విరామంగా విధులు నిర్వర్తించడానికి కస్టమ్స్‌ విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. కరోనా ప్రభావంతో భారత ప్రభుత్వం కొన్ని రకాల ఎగుమతుల్ని నిషేధించింది. ఓ పక్క దీనిని అమలు చేస్తూ నే మరోపక్క డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా సప్లై చైన్‌ ఆగకూడదనే అంశానికి ప్రాధాన్యమిస్తున్న కస్టమ్స్‌ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నగరానికి సంబంధించిన ఎగుమతి, దిగుమతుల్లో కస్టమ్స్‌ విభాగమే కీలకపాత్ర వహిస్తోంది. దీనికి సంబంధించి శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఎయిర్‌ కార్గొ యూని ట్, సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో(ఐసీడీ) అధికారులు ఎప్పటిప్పుడు వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌ తర్వాత నగరానికి వెంటిలేటర్ల దిగుమతి జరుగుతోందని కస్టమ్స్‌ అధికారులు చెప్తున్నారు. వీటి అవసరం భారీ సంఖ్యలో ఉండగా ప్రస్తుతం అమెరికా నుంచి రోజుకు 100 నుంచి 150 వరకు మాత్రమే వస్తున్నాయని, ఈ సంఖ్య పెంచడానికి కేంద్రం కృషి చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

నగరానికి దిగుమతి అయ్యే వస్తువుల్లో అత్యధికం చైనా నుంచే వస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ అమలులో ఉన్న లాక్‌డౌన్‌తో దిగుమతులు తగ్గాయి. లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో నగరంలో ఐసీడీకి వచ్చిన 900 కంటైనర్లు క్లియర్‌ కాకుండా ఆగిపోయాయని ఆయన వివరించారు. చైనాలో లాక్‌డౌన్‌ ముగియడంతో అక్కడ ఉత్పత్తి ప్రారంభమైందని, మరో పది రోజుల్లో భారీగా కంటైనర్లు వచ్చే ఆస్కారం ఉండటంతో ప్రస్తుతం ఉన్న వాటికి క్లియర్‌ చేసుకునేలా వర్తకుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సరుకు రవాణాను అడ్డుకోకుండా పోలీసు విభాగం సైతం ఆదేశాలు ఇచ్చిందని, వ్యాపారుల కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉన్నత స్థాయి సమన్వయ కమిటీ ఏర్పడింది. ఉమ్మడి కంట్రోల్‌ రూమ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ టీమ్‌ సయన్వయం కోసం పని చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న పరిస్థితులను ఆసరాగా చేసుకుని నకిలీ వస్తువుల, మందుల తయారీ మాఫియా విజృంభించే ప్రమాదముందని ప్రపంచ కస్టమ్స్‌ ఆర్గనైజేషన్‌ అలెర్ట్‌ జారీ చేసింది. కరోనా మందులు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్యూప్‌మెంట్‌ పేరుతో నకిలీ వస్తువుల్ని మార్కెట్‌లోని విరజిమ్మే ఆస్కా రం ఉందని స్పష్టం చేసింది.

దీనిని దృష్టిలో పెట్టుకున్న కస్టమ్స్‌ విభాగం తమ విధి నిర్వహణలో మార్పుచేర్పులు చేసుకుంటోంది. అలాగే తాజా పరిణామాల దృష్ట్యా కొన్ని రకాలైన మందులు తయారు చేయడానికి ఉపకరించే రసాయనాలు, ఔషధాల ఎగుమతుల్ని కేంద్రం నిషేధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రాథమికంగా 26 రకాల ఔషధాలు, రసాయనాల ఎగుమతులపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రధానంగా పారాసిటమాల్, టినిడజోల్, మెట్రోనిడజోల్, విటమిన్‌–బి, ఎరిత్రోమైసిన్, నియోమైసిన్, ఒరినిడజోల్‌ తదితరాలపై ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి విదేశీ వాణిజ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ నుంచి కస్టమ్స్‌ విభాగానికి సూచనలు అందాయి. వీటిని పక్కాగా అమలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న సరుకులు క్లియరెన్స్‌ చేయడానికి, రానున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి అనువుగా 24 గంటలు క్లియరెన్స్‌ విధులు నిర్వర్తించడానికి అటు ఎయిర్‌ కార్గొ, ఇటు ఐసీడీల్లోని కస్టమ్స్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోపక్క విదేశాల నుంచి వచ్చే ప్రతి కంటైనర్, పార్సల్‌ తదితరాలను పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేసిన తర్వాతే బయటకు అనుమతిస్తున్నామని కస్టమ్స్‌ అధికారులు చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement