న్యూఢిల్లీ: బలహీనమైన గ్లోబల్ డిమాండ్, పెద్ద ఆర్థిక వ్యవస్థలలో మాంద్యం కారణంగా 2023లో భారత ఆర్థిక వ్యవస్థ అలాగే ఎగుమతులు మధ్యస్తంగా ప్రభావితమవుతాయని ఎకానమీ విశ్లేషణా సంస్థ– గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) అంచనావేసింది. ఆయా అంశాల నేపథ్యంలో దేశం కరెంట్ ఖాతాను మెరుగుపరుచుకోవడం, ఇంధన దిగుమతి బిల్లును తగ్గించుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలని కూడా సూచించింది. జీటీఆర్‌ఐ నివేదికలో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే..
►2022లో భారత్ ముడి చమురు, బొగ్గు దిగుమతుల బిల్లు 270 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం వస్తు దిగుమతుల బిల్లులో ఇది 40 శాతం.
►ప్రస్తుత పరిస్థితుల్లో దేశం స్థానిక చమురు క్షేత్రాల అన్వేషణను తిరిగి శక్తివంతం చేయాలి. అలాగే బొగ్గు గనుల ద్వారా ఉత్పత్తిని పెంచాలి. ఆయా అంశాల్లో పురోగతి ఇంధన దిగుమతి బిల్లును గణనీయంగా తగ్గిస్తుంది. దీనితోపాటు కరెంట్ ఖాతాను మెరుగుపరుస్తుంది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు.
►చైనాను మినహాయించి ప్రత్యామ్నాయ సరఫరా గొలుసులను సృష్టించే అమెరికా ప్రయత్నం క్రమంగా ప్రపంచ సరఫరా గొలుసుల పునర్నిర్మాణానికి దారితీస్తోంది. కొన్ని పెద్ద ఉత్పాదక సంస్థల స్థాన మార్పిడికీ దారితీస్తోంది. ఆయా పరిణామాలు, ధోరణి నుండి ప్రయోజనం పొందేందుకు భారతదేశం తగిన మంచి స్థితిలో ఉందని పరిస్థితులు సూచిస్తున్నాయి.
►భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై రాజీ పడకుండా స్వయం సంమృద్ధికి కృషి చేయాలి. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు(ఎఫ్‌టీఏ) సంబంధించి దేశీయ విధానాలపై కొత్త నిబంధనల ప్రభావాన్ని జాగ్రత్తగా భారత్ అంచనావేసి, ముందడుగు వేయాలి.
►అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)సహా అభివృద్ధి చెందిన దేశాలు భాగస్వామ్య దేశాల నుండి ఎగుమతుల విషయంలో టారిఫ్‌యేతర అడ్డంకులను సృష్టించేందుకు కొన్ని నిబంధనలను ప్రయోగించే అవకాశం ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఆయా అంశాల్లో అప్రమత్తత అవసరం.
►వాణిజ్య గణాంకాలను పరిశీలిస్తే, 2021లో భారత్ వస్తు ఎగుమతుల విలువ 395 బిలియన్ డాలర్లు. ప్రపంచం అనిశ్చితి ఉన్నప్పటికీ 2022లో దేశ ఎగుమతులు 440–450 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఈ స్థాయి ఎగుమతులు భారత్ విజయంగానే చెప్పుకోవచ్చు.
►వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022 జనవరి నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 405 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 2021లో 573 బిలియన్ డాలర్లు ఉంటే, 2022లో 725 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు.
►ఇక సేవల రంగానికి వస్తే ఈ విభాగం నుంచి 2021లో ఎగుమతులు 254 బిలియన్ డాలర్లు ఉంటే, 2022లో 300 డాలర్ల వరకూ పెరుగుతాయని భావిస్తున్నాం.
►మాజీ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారి అజయ్ శ్రీవాస్తవ జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకులు. ఆయన 2022 తన బాధ్యతల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వాణిజ్య విధాన రూపకల్పన, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) , స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) అంశాలకు సంబంధించి శ్రీ వాస్తవకు విశేష అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment