సాక్షి, అమరావతి: సూయజ్ కాలువలో తలెత్తిన సమస్య ప్రభావం రాష్ట్ర పోర్టులపై పెద్దగా లేదని.. ఇతర దేశాలకు మన రాష్ట్రం నుంచి నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రకటించింది. విశాఖ, కృష్ణపట్నం కంటైనర్ పోర్టులపై సూయజ్ ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్ ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ నుంచి ఆఫ్రికా, చైనా, ఇండోనేషియా వంటి దేశాలకు నౌకా వాణిజ్యం ఎక్కువని, యూరప్ దేశాలతో లావాదేవీలు తక్కువగా ఉండటంతో ‘సూయజ్’ సమస్య అంతగా ప్రభావం చూపదని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. మధ్యధరా, హిందూ మహా సముద్రాలను కలుపుతూ ఈజిప్టు వద్ద నిర్మించిన సూయజ్ కాలువలో జపాన్‌కు చెందిన అతిపెద్ద కార్గో నౌక ‘ఎవర్ గివెన్’ పెనుగాలులకు అడ్డం తిరిగి నిలిచిపోవడంతో ప్రపంచ సముద్ర వాణిజ్యం ఒక్కసారిగా నిలిచిపోయింది.
ఈ కాలువ ద్వారా ఆసియా దేశాల నుంచి యూరప్ అమెరికా దేశాలకు నిత్యం 35కు పైగా నౌకలు ప్రయాణిస్తాయి. ఎవర్ గివెన్ నౌక అడ్డంగా నిలిచిపోవడంతో ఇప్పటివరకు 300 నౌకలు వరకు నిలిచిపోయాయి. దీని ప్రభావం భారత సముద్ర వాణిజ్యంపై తీవ్రంగానే ఉంది. సూయజ్ కాలువ ద్వారా మన దేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు రూ.14,80,000 కోట్ల వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నట్టు కేంద్ర నౌకాయాన శాఖ అంచనా వేసింది. తాజా సమస్య చమురు ఉత్పత్తులు, రసాయనాలు, ఆటోమొబైల్, ఉక్కు, టెక్స్‌టైల్స్ వంటి ఉత్పత్తుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది.
అత్యవసర సరకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సూచించింది. దీంతో రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఇక్కడి పోర్టుల్లో పరిస్థితిని సమీక్షించింది. విశాఖ మేజర్ పోర్టుతో పాటు 4 రాష్ట్ర పోర్టుల ద్వారా ఏటా సుమారు 200 మిలియన్ టన్నుల సరకు రవాణా అవుతోంది. ఒక్క విశాఖ పోర్టు ద్వారానే 100 మిలియన్ టన్నుల సరకు రవాణా అవుతుండగా, గంగవరం, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కృష్ణపట్నం ద్వారా 100 మిలియన్ టన్నులకు పైగా సరకు రవాణా అవుతోంది. వీటిలో బియ్యం, జొన్నలతోపాటు గ్రానైట్, బొగ్గు, ముడి ఇనుము, బెరైటిస్ వంటి ఖనిజాలే ఎక్కువ. ఈ పోర్టుల నుంచి యూరప్‌కు వెళ్లే నౌకలు లేకపోవడంతో సూయజ్ ప్రభావం ఏపీ మారిటైమ్‌పై పెద్దగా ఉండదని అధికారులు అంచనాకు వచ్చారు.
మన పోర్టులపై సూయజ్ ప్రభావం అంతంతే
Published Mon, Mar 29 2021 3:32 AM | Last Updated on Mon, Mar 29 2021 10:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment