ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 6వ తేదీ వరకూ ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–2020) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్‌బీఐ పాలసీ సమావేశం ఇది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగమనం, ద్రవ్యోల్బణం కట్టుతప్పడం వంటి ప్రతికూలతల నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. ధరలూ సామాన్యునిపై భారాన్ని మోపుతున్నాయి. మొత్తంగా గణాంకాలు దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తుండగా, నిత్యావసరాల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి.
కట్టుతప్పిన ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయిని దాటేసి.. ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. ఇది అయిదున్నరేళ్ల గరిష్ట స్థాయి. 2018 డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.11 శాతంగా ఉండగా, 2019 నవంబర్‌లో 5.54 శాతంగాను, డిసెంబర్‌లో 7.35 శాతంగాను నమోదైంది. చివరిసారిగా 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్‌లో తాకడం ఇదే ప్రథమం. ఆర్‌బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. ఇక దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ, డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 2.59 శాతంగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం ఏమిటన్నది వేచిచూడాల్సి ఉంది.
ఆరు సార్లలో ఐదు సార్లు తగ్గింపు...
ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని డిసెంబర్ 5 మధ్య జరిగిన ఆరు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్‌బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి సమావేశంలో ఈ దిశలో నిర్ణయం తీసుకోలేకపోయింది.
ఆర్‌బీఐ వైపు అందరి చూపు..!
Published Tue, Feb 4 2020 5:02 AM | Last Updated on Tue, Feb 4 2020 7:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment