పీఎస్‌యూ ఆయిల్ సంస్థలకు కొత్త అన్వేషణా క్షేత్రాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, సన్ ఫార్మా డైరెక్టర్లు ఏర్పాటు చేసిన కొత్త కంపెనీ సన్ పెట్రోకెమికల్స్ ప్రైవేటు లిమిటెడ్ తదితర కంపెనీలకు ప్రభుత తాజా వేలంలో చిన్న స్థాయి ఆయిల్, గ్యాస్ అన్వేషణా క్షేత్రాలు దక్కాయి. మొత్తం 46 క్షేత్రాలకుగాను ప్రభుత్వం గతేడాది వేలం నిర్వహించింది.
34 క్షేత్రాలకు బిడ్లు రాగా.... ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ వీటిలో 31 క్షేత్రాల బిడ్లను ఖరారు చేసి కాంట్రాక్టులకు కట్టబెట్టింది. బీపీసీఎల్‌కు చెందిన భారత్ పెట్రో రీసోర్సెస్ లిమిటెడ్‌కు 4, హెచ్‌పీసీఎల్ సబ్సిడరీ ప్రైజ్ పెట్రోలియంకు 3, ఐవోసీకి 3, సన్ పెట్రోకెమికల్స్‌కు ఒకటి దక్కాయి. నిప్పన్ పవర్, హార్డీ ఎక్స్‌ప్లోరేషన్, అదానీ వెల్‌స్పన్ తదితర కంపెనీలకు మిగిలినవి లభించాయి.