లాలూ కుమారుడికి మరో ఝలక్
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కి మరో సారి ఎదురు దెబ్బ తగిలింది. లాలూ కుమారుడు, బిహార్ ఆరోగ్య శాఖామంత్రి తేజ్ ప్రతాప్‌యాదవ్‌కు ప్రభుత్వం రంగ ఆయిల్ సంస్థ ఝలక్ ఇచ్చింది. ఆయన పెట్రోల్ పంపు లైసెన్సును బీపీసీఎల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31న కంపెనీ పంపించిన నోటీసులకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కేటాయించిన పెట్రోల్ పంపు లైసెన్సును భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) రద్దు చేసింది. దీనికి సంబంధించి ఆయనకు కేటాయించిన పెట్రోల్ పంప్ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని కోరుతూ ఒక షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. 15 రోజులలోపు సమాధానం ఇవ్వాల్సింది కోరింది. బిపిసిఎల్ టెరిటరీ మేనేజర్ (రిటైల్), పాట్నా, మనీష్ కుమార్ పేరుతో ఈ నోటీసులు అందాయి. దీని ప్రకారం, అసిసాబాడ్ బైపాస్ రహదారిలో ఉన్న పెట్రోల్ పంప్‌ను యాదవ్ అక్రమంగా లీజుకు తీసుకున్నట్టు ఫిర్యాదు చేసింది. 2012 లో పెట్రోల్ పంప్ కోసం యాదవ్ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరి 27న మంత్రి పేరుతో రిజిస్టర్ అయింది. M / S లారా ఆటోమొబైల్స్కు రిటైల్ అవుట్ లెటకు దీన్ని అప్పగించారు. అయితే ఇది M / S చెల్లదని ఇన్ఫోసిస్టెమ్స్ ఫిర్యాదు చేసిందని బీపీసీఎల్ ఆ నోటీసులో పేర్కొంది.
బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి, తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, త్వరలోనే వివరాలు తెలియజేస్తామన్నారు. ఏక పక్షంగా వ్యవహిరిస్తున్నారనీ, త్వరలోనే వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. కాగా యూపీఏ పాలనలో తేజ్ ప్రతాప్‌కు పెట్రోల్ పంప్ ను అక్రమంటా కేటాయించారనీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే