terminates
-
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం?
నేపాల్ రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తును తెగతెంపులు చేసుకున్నారు. ఇరు పార్టీల్లో నెలకొన్న విభేదాల కారణంగా నేపాలీ కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి ప్రచండ స్వస్తి పలికారు. మాజీ ప్రధాని కెపీ ఓలీ పార్టీతో కొత్త కూటమి ఏర్పాటు చేయాలని ప్రచండ నిర్ణయించారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) నాయకుడు ఒకరు మాట్లాడుతూ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్), షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ మధ్య పొత్తు ముగిసిందని, ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెప్పారు. సీసీఎన్ (మావోయిస్ట్ సెంటర్) కార్యదర్శి గణేష్ షా మాట్లాడుతూ నేపాలీ కాంగ్రెస్ ప్రధానమంత్రికి సహకరించలేదు. అందుకే తాము కొత్త కూటమి కోసం చూడవలసి వచ్చిందన్నారు. కాగా నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో 2022, డిసెంబర్ 25న ప్రచండ నేపాల్ ప్రధాని అయ్యారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తును తెంచుకున్న తర్వాత, ప్రచండ.. ఓలీ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. -
సీఈఎల్ విక్రయానికి స్వస్తి
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్) వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. సీఈఎల్ కొనుగోలుకి బిడ్‌ను గెలుపొందిన కంపెనీ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) వద్ద అపరిష్కృతంగా ఉన్న న్యాయ వివాద విషయాన్ని వెల్లడించకపోవడంతో ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాఖ(డీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే కంపెనీ కొనుగోలుకి ఢిల్లీకి చెందిన నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ రూ. 210 కోట్ల విలువైన బిడ్‌ను దాఖలు చేయడం ద్వారా గెలుపొందింది. దీంతో గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం సీఈఎల్ విక్రయానికి అనుమతించింది. అయితే ఈ ఏడాది జనవరిలో బిడ్డర్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన పలు ఆరోపణల మధ్య ప్రభుత్వం ఎల్వోఐ జారీని పక్కనపెట్టింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ఎన్సీఎల్టీ వద్ద పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాన్ని బిడ్డర్ వెల్లడించకపోవడంతో సీఈఎల్ విక్రయాన్ని రద్దు చేసేందుకు నిర్ణయించింది. చదవండి: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి! -
ప్రైవేట్ ట్రైన్స్, రూ.30వేల కోట్ల టెండర్లను రిజెక్ట్ చేసిన కేంద్రం
ఇండియన్ రైల్వే ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రైళ్ల నిర్వహణపై రూ.30వేల కోట్ల టెండర్లు నిర్వహించి.. వాటిని కేంద్ర రైల్వే శాఖ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ నిర్వహించిన టెండర్లలో ప్రైవేట్ రైలు సర్వీసుల్ని అందించేందుకు జీఎంఆర్‌హైవే లిమిటెడ్, ఐఆర్ సీటీసీ, ఐఆర్బీ ఇన్ఫ్రా, క్యూబ్ ఐవే, సీఏఎఫ్ ఇండియా, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పలు కంపెనీలు పోటీ పడ్డాయి. వీటిలో ఐఆర్సీటీసీ, మేఘా ఇంజనీరింగ్ టెండర్లపై చర్చలు జరుపుతున్నట్లు,మిగిలిన కంపెనీల టెండర్లను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. మళ్లీ కొత్త కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించగా.. టెండర్లను కేంద్రం ఎందుకు రిజెక్ట్ చేసిందనే అంశంపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిపుణుడు మనీష్ అగర్వాల్ స్పందించారు. సామాన్యుడిపై భారం తగ్గించేందుకు కేంద్రం టెండర్లను తక్కువ ధరకే పాడేలా ప్రైవేట్ సంస్థలపై ఒత్తిడి తెస్తుందని అన్నారు. రైల్వేశాఖ న్యాయమైన నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించడానికి ఒప్పంద నిబద్ధత ఉండాలి' అని అగర్వాల్ తెలిపారు. కాగా, గతేడాది జులైలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇండియన్ రైల్వే ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉందని, మొదటి దశలో 2023 నాటికి 12 ప్రైవేట్ రైళ్ల సర్వీసుల్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 151 ప్రైవేట్ రైలు సర్వీసులు 2027 నాటికి మొత్తం దశలవారీగా దేశంలోని 109 రూట్లల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తాయన్నారు. ఇందుకోసం మొత్తం రూ.30,000 కోట్ల ప్రైవేట్ సంస్థల్ని టెండర్ల కోసం ఆహ్వనించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. -
వెయ్యిమంది రిటైలర్స్‌పై వేటు!
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాల్లో ఇరుక్కున్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు సైన్ అప్ చేస్తున్నప్పుడు సరైన ప్రక్రియను అనుసరించని రిటైలర్స్‌పై భారీ వేటు వేసింది. ఇ-కెవైసి లైసెన్స్ సస్పెండ్ కు దారితీసిన లోపాలను గుర్తించేందుకు చేపట్టిన విచారణ అనంతరం ఈ చర్య వెలుగులోకి వచ్చింది. తాజా నివేదికల ప్రకారం దాదాపు వెయ్యిమందికిపైగా రిటైలర్స్‌తో సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. ‘ఎకనామిక్స్ టైమ్స్’ అందించిన నివేదిక ప్రకారం నిర్వహించిన అంతర్గత విచారణ అనంతరం టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పలు రిటైలర్ల భారీ జరిమానా కూడా విధించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి సారి తప్పు చేసిన వారికి తాము చెల్లించిన కమీషన్‌పై 50 రెట్లు ఎక్కువ జరిమానా విధించింది. అలాగే రిపీట్ నేరస్థులను తమ నెట్వర్క్నుంచి తొలగించడంతోపాటు వాటిపై జరిమానా కూడా విధించింది. అయితే ఈ పరిణామాలపై ఎయిర్టెల్ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా, కస్టమర్ల అనుమతి లేకుండానే వంట గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుకు మళ్లించిన వ్యవహారంలో భారతి ఎయిర్టెల్ చిక్కుల్లో పడింది. ఈ నేపథ్యంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఆధార్ బేస్డ్ ఈకేవైసీ లైసెన్సును రద్దు చేసింది. మరోవైపు ఈ వివాదం కారణంగా ఎయిర్టెల్ పేమెంట్‌బ్యాంక్ ఎండీ, సీఈవో శశి అరోరా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
లాలూ కుమారుడికి మరో ఝలక్
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కి మరో సారి ఎదురు దెబ్బ తగిలింది. లాలూ కుమారుడు, బిహార్ ఆరోగ్య శాఖామంత్రి తేజ్ ప్రతాప్‌యాదవ్‌కు ప్రభుత్వం రంగ ఆయిల్ సంస్థ ఝలక్ ఇచ్చింది. ఆయన పెట్రోల్ పంపు లైసెన్సును బీపీసీఎల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31న కంపెనీ పంపించిన నోటీసులకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కేటాయించిన పెట్రోల్ పంపు లైసెన్సును భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) రద్దు చేసింది. దీనికి సంబంధించి ఆయనకు కేటాయించిన పెట్రోల్ పంప్ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని కోరుతూ ఒక షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. 15 రోజులలోపు సమాధానం ఇవ్వాల్సింది కోరింది. బిపిసిఎల్ టెరిటరీ మేనేజర్ (రిటైల్), పాట్నా, మనీష్ కుమార్ పేరుతో ఈ నోటీసులు అందాయి. దీని ప్రకారం, అసిసాబాడ్ బైపాస్ రహదారిలో ఉన్న పెట్రోల్ పంప్‌ను యాదవ్ అక్రమంగా లీజుకు తీసుకున్నట్టు ఫిర్యాదు చేసింది. 2012 లో పెట్రోల్ పంప్ కోసం యాదవ్ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరి 27న మంత్రి పేరుతో రిజిస్టర్ అయింది. M / S లారా ఆటోమొబైల్స్‌కు రిటైల్ అవుట్ లెటకు దీన్ని అప్పగించారు. అయితే ఇది M / S చెల్లదని ఇన్ఫోసిస్టెమ్స్ ఫిర్యాదు చేసిందని బీపీసీఎల్ ఆ నోటీసులో పేర్కొంది. బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి, తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, త్వరలోనే వివరాలు తెలియజేస్తామన్నారు. ఏక పక్షంగా వ్యవహిరిస్తున్నారనీ, త్వరలోనే వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. కాగా యూపీఏ పాలనలో తేజ్ ప్రతాప్‌కు పెట్రోల్ పంప్ ను అక్రమంటా కేటాయించారనీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే -
ఐపీఎల్ -9లో మరో వివాదం
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు, రెండు దిగ్గజ జట్లపై వేటు, లలిత్ గేట్.. ఇలా అనేక అవరోధాలను దాటుకుంటూ ప్రారంభమైన ఐపీఎల్ 9వ సీజన్ లో మరో వివాదం చెలరేగింది. ఇప్పటికే మహారాష్ట్రలో మ్యాచ్ లు నిర్వహించే అంశం కోర్టుదాకా వెళ్లింది. తాజాగా ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేపై బీసీసీఐ అనూహ్యరీతిలో వేటువేసింది. హర్షా భోగ్లే కామెంటేటింగ్ కాంట్రాక్టును బోర్డు ఉన్నపళంగా రద్దుచేసింది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కామెంటేటర్లపై.. ప్రధానంగా హర్షా భోగ్లేను ఉద్దేశిస్తూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కామెంట్లుకూడా వేటుకు బలమైన కారణమని తెలుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా కామెంటేటర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలను సేకరిస్తోన్న బీసీసీఐ.. అదే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న కారణంగా హర్షా భోగ్లేపై వేటు వేసినట్లు ఓ అధికారి చెప్పారు. కామెంట్రీపై ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 9వ సీజన్ ప్రారంభమైన రోజే హర్షాను కామెంటేటర్ల ప్యానెల్ నుంచి తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. హర్షా కూడా తాను ఇకపై ఐపీఎల్ కు అందుబాటులో ఉండబోనంటూ ట్వీట్ చేశారు. వరల్డ్ కప్ లో ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇండియన్ కామెంటేటర్లు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మాట్లాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లు తాను చేసినవే కావడంతో మ్యాచ్ అనంతరం హర్షా భోగ్లే తనను తాను సమర్థించుకున్నారు. ఇదేకాకుండా న్యూజిలాండ్ తో నాగపూర్ లో జరిగిన ప్రారంభమ్యాచ్ లోనూ విదర్భ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో గొడవపడ్డారట హర్షా భోగ్లే. రెండు భాషల్లో (ఇంగ్లీష్, హిందీల్లో) కామెంట్రీ చెప్పేందుకు అస్తమానం అటూఇటూ తిరుగుతోన్న హర్షాను 'ఇది వీఐపీ లాంజ్ మీరు నిమిషానికోసారి అలా తిరిగితే కుదరదు'అని చెప్పారట. దీనికి హర్షా సదరు అధికారులపై చిందులేశారట. అన్ని కారణాలను బేరిజు వేసుకున్న తర్వాత హర్షాకు షాక్ ఇవ్వాల్సిందేనని ఫిక్సైన బీసీసీఐ ఆయనపై వేటు వేసింది. ఐపీఎల్ ప్రసార హక్కులు సోని-ఈఎస్ పీఎన్ చానెల్ వి కాబట్టి వారు పట్టుబట్టి హర్షాభోగ్లేను కొనసాగిస్తారా, లేక బీసీసీఐ నిర్ణయానికి సరేనంటారా చూడాలి. శని, ఆదివారాలనాటి మ్యాచ్ లకైతే భోగ్లే అందుబాటులోలేరు. 90వ దశకం నుంచి క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగుతున్న హర్షా భోగ్లే ఐపీఎల్ ప్రారంభం(2008) నుంచి ఆ టోర్నీకి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.