ఢిల్లీ: వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డీజిల్ డోర్ డెలవరీ స్కీంని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అమల్లోకి తెచ్చింది. ఢిల్లీకి చెందిన స్టార్టప్ సంస్థతో కలిసి సేఫ్20 పేరుతో డీజిల్ డోర్ డెలివరీ చేస్తోంది.
20 లీటర్ల క్యాన్
ఢిల్లీ కేంద్రంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 20 లీటర్ల జెర్రీ క్యాన్లను ఢోర్ డెలివరీగా బీపీసీఎల్ అందిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న హమ్ సఫర్ సంస్థతో బీపీసీఎల్ టై అప్ అయ్యింది. 20 లీటర్ల సామర్థ్యం కల జెర్రీ క్యాన్లలో డీజిల్‌ని డోర్ డెలివరీ చేస్తోంది. డోర్ డెలివరీ కావాలంటే కనీసం 20 లీటర్లు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.
ఉపయోగకరం
డోర్ డెలివరీ పథకం వల్ల అపార్ట్‌మెంట్లు, సెల్‌ఫోన్ టవర్లు, షాపింగ్ కాంప్లెక్సులు, హాస్పటిల్స్, బ్యాంకులు, కన్‌స్ట్రక‌్షన్ సైట్లు, హోటళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీపీసీఎల్ అంటోంది. గతంలో డీజిల్ కావాలంటే పెట్రోల్ పంప్‌కు రాక తప్పని పరిస్థితి నెలకొని ఉండేది. పైగా ఫ్యూయల్ స్టేషన్ నుంచి డీజిల్ రవాణా చేయడం ప్రయాసతో కూడిన వ్యవహరం. మార్గమధ్యంలో డీజిల్ ఒలకడం సర్వ సాధారణంగా జరిగేది. అయితే తాజా డోర్ డెలివరీతో ఈ కష్టాలు తీరనున్నాయి. ఇంటి వద్దకే డీజిల్ తెప్పించుకుని జనరేటర్, లిఫ్టు, క్రేన్లు, భారీ యంత్రాలు తదితర అవసరాలకు సులభంగా ఉపయోగించవచ్చు.
మొదట అక్కడే
గతంలో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేవ్, ఉత్తరఖండ్ ప్రాంతాల్లో ఈ డోర్ డెలివరీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టగా మంచి ఫలితాలు వచ్చాయి. ఊరికి దూరంగా కొండ ప్రాంతాల్లో ఉండే హోటళ్లు, రిసార్టులకు ఈ స్కీం చాలా ప్రయోజనకారిగా మారింది. ఆ తర్వాత వ్యవసాయ అవసరాలు ఎక్కువగా ఉండే పంజాబ్, హర్యానాల్లోనూ అమలు చేశారు.
దేశమంతటా
డీజిల్ డోర్ డెలివరీని మొదటగా అమలు చేసిన నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని ఈ సారి డిమాండ్ ఎక్కువగా ఉండే ఢిల్లీలో డీజిల్ డోర్ డెలివరీని అమల్లోకి తెచ్చారు. ఇక్కడ సానుకూల ఫలితాలు వస్తే క్రమంగా దేశమంతటా విస్తరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment