
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ల విక్రయ ప్రక్రియను మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు చాలా ఆసక్తిగా ఉన్నారని అన్నారు. కంపెనీల విక్రయాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఇటీవల పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి క్యాబినెట్లో పలు సంస్కరణలను ఆమోదించిన విషయం తెలిసిందే.
ఎయిర్ ఇండియా పలు ఆర్థిక సమస్యలను ఇదుర్కొంటొంది. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను సమకూర్చే చమురు కంపెనీలకు రూ 4500 కోట్ల మేర చెల్లింపులు బకాయి ఉండటంతో ఆయా సంస్థలు ఇంధన సరఫరాను నిలిపివేశాయి. బకాయిల చెల్లింపులలో ఎయిర్ ఇండియా విఫలమవడంతో ఇంధన సరఫరాలను చమురు సంస్థలు నిలిపివేశాయి. నిధుల సమీకరణ సంక్లిష్టంగా మారడంతో చెల్లింపులు, రుణాల క్లియరెన్స్‌లో ఎయిర్ ఇండియా ఇబ్బందులను ఎదుర్కొంటొందని ఆర్థిక నిపుణులు అభిప్రామపడుతున్నారు. మరోవైపు భారత పెట్రోలియం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 1.02 లక్షల కోట్లు ఉండగా, ప్రభుత్వం 65,000 కోట్లు విక్రయానికి పెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.