ఆయిల్ షేర్లు డీలా
రెండో రోజూ నష్టాలే
- 44 పాయింట్లు డౌన్
- 25,202 వద్దకు సెన్సెక్స్
- పలుమార్లు హెచ్చుతగ్గులు
ఇరాక్ అంతర్యుద్ధ పరిస్థితులు చల్లబడకపోవడంతో వరుసగా రెండో రోజు మార్కెట్లు నీరసించాయి. రోజు మొత్తం లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 44 పాయింట్లు క్షీణించి 25,202కు చేరగా, నిఫ్టీ 17 పాయింట్లు తగ్గి 7,541 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 25,426-25,070 పాయింట్ల మధ్య పలుమార్లు ఒడిదుడుకులకు లోనైంది. ఇరాక్ యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 114 డాలర్లను మించడంతో ఆయిల్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఆయిల్ ఇండియా, ఓన్‌జీసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, ఆర్‌ఐఎల్, గెయిల్ 6-2% మధ్య పతనమయ్యాయి. అయితే ఐటీ ఇండెక్స్ దాదాపు 2% లాభపడింది. ప్రధానంగా మైండ్‌ట్రీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో 4-1% మధ్య పుంజుకున్నాయి.
ప్యాకేజీ ఉపసంహరణ
అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగుతున్నదని, వెరసి సహాయక ప్యాకేజీలో కోతను కొనసాగిస్తామని ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడంతో యూఎస్, యూరప్ మార్కెట్లు లాభపడ్డాయి. ఇప్పటికే నెలకు 10 బిలియన్ డాలర్ల చొప్పున విధించిన కోత కారణంగా ప్యాకేజీ 35 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. పాలసీ సమీక్షలో భాగంగా రెండు రోజులపాటు ఫెడ్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇక దేశీయంగా చూస్తే సెన్సెక్స్ దిగ్గజాలలో మారుతీ, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.5-1% మధ్య నీరసించాయి. మరోవైపు ఎంఅండ్‌ఎం, సన్ ఫార్మా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, ఐటీసీ 1%పైగా పురోగమించాయి. కాగా, డియాజియో ప్రకటించిన ఓపెన్ ఆఫర్ ముగియడంతో యునెటైడ్ స్పిరిట్స్ 8% దిగజారింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1,586 నష్టపోగా, 1,406 లాభపడ్డాయి.