రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని కృష్ణపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గతిశక్తి మల్టిమోడల్ కార్గో టెర్మినల్ నుంచి మొదటి సారిగా పీఓఎల్ (పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్) రేక్‌ను ప్రారంభించారు. 50 ట్యాంక్ వ్యాగన్‌లలో 2,693 టన్నుల పీఓఎల్‌ను రవాణా చేయడం ద్వారా డివిజన్ రూ.35.36 లక్షల ఆదాయం ఆర్జించింది.
ఏప్రిల్ 26న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించగా సోమవారం తెల్లవారుజామున మొదటి రేక్‌ను చర్లపల్లిలోని బీపీసీఎల్‌కు పంపించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం షివేంద్రమోహన్ మాట్లాడుతూ సాంప్రదాయ సరుకు రవాణాతో పాటు వినూత్న ఆలోచనలతో సరుకు రవాణాను పెంచేందుకు గతిశక్తి మల్టిమోడల్ కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇది విజయవాడ డివిజన్‌కే మరో మణిహారం అని కొనియాడారు. గతిశక్తి టెర్మినల్ నిర్వహణను ప్రారంభించడంలో కృషి చేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీఓఎమ్ డి.నరేంద్రవర్మను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment