న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్కో లీటర్ పెట్రోల్ విక్రయంపై రూ.10 చొప్పున లాభాన్ని చూస్తున్నాయి. మరోవైపు లీటర్ డీజిల్ విక్రయంతో అవి రూ.6.5 నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లాభం వస్తున్నా కానీ అవి విక్రయ రేట్లను తగ్గించడం లేదు. ఎందుకంటే అంతకుమందు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగిపోయిన సమయంలో అవి రేట్లను ఒక దశ వరకు పెంచి, ఆ తర్వాత నుంచి నష్టాలను సర్దుబాటు చేసుకున్నాయి. పైగా ఇప్పుడు డీజిల్‌పైనా నష్టపోతున్నాయి. దీంతో పెట్రోల్ రేటు దిగి రావడం లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) గత 15 నెలల నుంచి రేట్లను సవరించడం లేదు.
‘‘2022 జూన్ 24తో ముగిసిన వారంలో లీటర్ పెట్రోల్‌పై 17.4 నష్టపోగా, లీటర్ డీజిల్‌పై రూ.27.70 చొప్పున నష్టాన్ని ఎదుర్కొన్నాయి. అక్టోబర్–డిసెంబర్ కాలానికి వచ్చే సరికి అవి లీటర్ పెట్రోల్‌పై రూ.10 లాభం, లీటర్ డీజిల్‌పై నష్టం రూ.6.5కు తగ్గింది’’అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన నివేదికలో తెలిపింది. 2022 ఏప్రిల్ 6 నుంచి ఈ మూడు ప్రభుత్వరంగ ఆయిల్ విక్రయ సంస్థలు రేట్లను సవరించడం నిలిపివేశాయి. చమురు బ్యారెల్ ధర 103 డాలర్ల నుంచి 116 డాలర్లకు పెరిగినప్పటికీ అవి రేట్లను యథాతథంగా కొనసాగించాయి. ఫలితంగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు సంస్థలు కలసి ఉమ్మడిగా రూ.21,201 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. కానీ, ఈ నెల చమురు ధర 78 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో అవి ఇక మీదట డీజిల్‌పైనా లాభాలను ఆర్జించనున్నట్టు తెలుస్తోంది.
ఆపరేటింగ్ లాభాలు
స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 10.5–12.4 డాలర్లుగా ఉండడంతో మూడు కంపెనీలు తిరిగి ఆపరేటింగ్ లాభాల్లోకి ప్రవేశిస్తాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌కు ఐవోసీ రూ.2,400 కోట్ల ఎబిట్డా (వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు), బీపీసీఎల్‌కు రూ.1,800 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు రూ.800 కోట్ల ఎబిట్డా నమోదు చేస్తాయని పేర్కొంది. కాకపోతే నికరంగా నష్టాలను నమోదు చేస్తాయని అంచనా వేసింది. ఐవోసీ రూ.1,300 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ.600 కోట్లు చొప్పున నష్టాలను నమోదు చేయవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు కరోనా ఆరంభంలో 2020లో మైనస్‌కు పడిపోవడం గమనార్హం.
అక్కడి నుంచి రెండేళ్లలోనే 2022 మార్చి నాటికి బ్యారెల్ ధర 140 డాలర్లకు చేరి, 14 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం చమురు ధరలకు ఆజ్యం పోసిందని చెప్పుకోవాలి. అమెరికా, యూరప్‌లో మాంద్యం, చైనాలో వృద్ధి మందగమనం పరిస్థితులతో డిమాండ్ తగ్గి తిరిగి ధరలు దిగొస్తున్నాయి. ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలు కలిపి పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో 90 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఇవి ఇంతకాలం పాటు రేట్లను సవరించకుండా ఉండడం గత రెండు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment