న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రభుత్వరంగ రిఫైనరీ కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని (ఎఫ్‌డీఐ) 100 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ప్రభుత్వరంగ చమురు కంపెనీల్లో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతంగానే అమలవుతోంది. తాజా నిర్ణయంతో బీపీసీఎల్‌కు విదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు బిడ్లు వేసేందుకు మార్గం సుగమం అవుతుంది.
బీపీసీఎల్‌లో కేంద్ర సర్కారుకు 52.98 శాతం వాటా ఉండగా.. ఇందుకోసం రెండు విదేశీ కంపెనీలు ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేశాయి. ప్రభుత్వ వాటాను పూర్తిగా కొనుగోలు చేసిన సంస్థ.. అదనంగా 26 శాతం వాటా కొనుగోలుకు వీలుగా ప్రస్తుత వాటాదారులకు ఆఫర్‌ను ఇవ్వాల్సి వస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ కోణంలోనే ఎఫ్‌డీఐ పరిమితి పెంచినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీపీసీఎల్ మినహా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఒక్కటే నేరుగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంది. హెచ్‌పీసీఎల్‌ను మరో ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్‌జీసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బీపీసీఎల్ కోసం వేదాంత, అమెరికాకు చెందిన పీఈ సంస్థ అపోలో గ్లోబల్, ఐ స్కేర్డ్ క్యాపిటల్‌కు చెందిన థింక్ గ్యాస్ ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేశాయి.
వృద్ధికి ఊతం...
ప్రభుత్వ నిర్ణయం దేశీయంగా తయారీ కేంద్రాల ఏర్పాటుకు, పెట్టుబడులు, పరిశోధన, అభివృద్ధి, టెక్నాలజీలకు మద్దతునిస్తుందని పరిశ్రమల మండళ్లు అభిప్రాయపడ్డాయి. లిస్టెడ్ స్పెషాలిటీ స్టీల్ కంపెనీలకు భారీ అవకాశాలకు వీలు కల్పిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్‌కు దారి చూపుతుందని పీహెచ్‌డీసీసీఐ చైర్మన్ (మినరల్స్, మెటల్స్ కమిటీ) అనిల్‌కుమార్‌చౌదరి అభిప్రాయపడ్డారు.
స్పెషాలిటీ స్టీల్‌కు మద్దతు
ఆత్మ నిర్భర్ భారత్, భారత్‌లో తయారీ లక్ష్యాలతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద స్పెషాలిటీ స్టీల్ రంగాన్ని కూడా చేరుస్తూ కేంద్ర కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. స్పెషాలిటీ స్టీల్‌ను తయారు చేసే కంపెనీలకు ఐదేళ్ల కాల వ్యవధిలో రూ.6,322 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీనివల్ల 5.25 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం దేశీయంగా తయారీని పెంచి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని పేర్కొంది.
కోటెడ్, ప్లేటెడ్ స్టీల్ ఉత్పత్తులు, హై స్ట్రెంత్/వేర్ రెసిస్టెంట్ స్టీల్, స్పెషాలిటీ రేల్స్, అలాయ్ స్టీల్, స్టీల్‌వైర్స్, ఎలక్ట్రికల్ స్టీల్ ఉత్పత్తులు పీఎల్‌ఐ పథకం కిందకు వస్తాయి. ఈ స్టీల్ ఉత్పత్తులను ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఆయిల్, గ్యాస్ రవాణా పైపులు, రక్షణ రంగ ఉత్పత్తులు, అధిక వేగంతో కూడిన రైల్వే మార్గాలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో వినియోగిస్తారు. ఒక కంపెనీకి గరిష్ట రాయితీల పరిమితిని రూ.200 కోట్లుగా నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయంతో స్టీల్ రంగంలోకి రూ.40,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, అదనంగా 25 మిలియన్ టన్నుల తయారీ సామర్థ్యం పెరుగుతుందంటూ కేంద్ర ఉక్కు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment