![Privatisation Of Bpcl Delayed, May Happen Next Fiscal - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/8/bpcl_lic.jpg.webp?itok=f2b_Pwl6)
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర సర్కారు పెట్టుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ప్రధానంగా రెండు లావాదేవీలు ప్రభుత్వ లక్ష్యానికి కీలకం కానున్నాయి. అందులో బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న వాటాను పూర్తిగా ప్రైవేటు సంస్థకు విక్రయించడం. ఈ రూపంలోనే కేంద్రానికి రూ.50వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. ఎల్‌ఐసీలో కొంత వాటాను ఐపీవో రూపంలో విక్రయించాలన్నది మరో ముఖ్యమైన లక్ష్యం. ఈ రెండు లావాదేవీల రూపంలోనే కేంద్ర సర్కారుకు రమారమి రూ.1.5 లక్షల కోట్లు సమకూరుతుంది. కానీ, చూస్తుంటే బీపీసీఎల్ ప్రైవేటీకరణ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు.
2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.1.75 లక్షల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకోవాలన్నది కేంద్ర సర్కారు బడ్జెట్ లక్ష్యం. ఎల్‌ఐసీ ఐపీవో మార్చిలోపు పూర్తి చేయగలమన్న విశ్వాసంతో కేంద్రం ఉంది. ఒకవేళ ఎల్‌ఐసీ ఐపీవోను పట్టాలెక్కించినా, బీపీసీఎల్ లావాదేవీ పూర్తికాకపోతే రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం దిగువకు సవరించుకోవాల్సి వస్తుంది. కేంద్ర సర్కారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ వాటాల విక్రయం రూపంలో సమకూర్చుకున్న మొత్తం రూ.9,330 కోట్లుగానే ఉంది. ఎన్‌ఎండీసీ, హడ్కోలో మైనారిటీ వాటాలను విక్రయించడం రూపంలో ఈ మొత్తం లభించింది.
అనుకున్నట్టుగానే ఎల్‌ఐసీ ఐపీవో..
దేశంలోనే అతిపెద్ద ఐపీవో (సుమారు రూ.లక్ష కోట్లు)గా భావిస్తున్న ఎల్‌ఐసీ వాటాల విక్రయం ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం మార్చిలోపు పూర్తవుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్ వాటాల విక్రయం తదుపరి ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంలో 2021–22 ఆర్థిక సంవత్సరం వాటాల విక్రయ లక్ష్యాన్ని రూ.50,000కోట్లు తక్కువకు సవరించొచ్చని ఆ వర్గాలు తెలిపాయి.
‘‘ఎల్‌ఐసీ ఐపీవో ఈ ఏడాది పూర్తవుతుందన్న విశ్వాసం మాకుంది. చాలా వరకు పని (విలువ మదింపు) వేగంగా పూర్తయింది. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగానికి (దీపమ్) ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించే విషయంలో చక్కని ట్రాక్ రికార్డు ఉంది’’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘‘ప్రైవేటీకరణ అన్నది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎయిర్ ఇండియా ప్రక్రియ ముగిసిందని..ఇతర పెద్ద ప్రైవేటీకరణ ప్రణాళికలు కూడా అంతే వేగంగా పూర్తవుతాయని అనుకోవద్దు’’ అంటూ సదరు అధికారి పేర్కొన్నారు.
ఎల్‌ఐసీ, బీపీసీఎల్ లావాదేవీల్లో జాప్యం నెలకొనడంతో వాస్తవ లక్ష్యంలో ఇప్పటి వరకు సమకూర్చుకున్నది చాలా స్వల్ప మొత్తంగానే కనిపిస్తోంది. ఒక్క ఎయిర్ ఇండియాను ప్రభుత్వం పూర్తి చేసుకోగలిగింది. ఇంకా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, పవన్ హన్స్ తదితర కంపెనీల్లో వాటాల విక్రయం కూడా ముగియాల్సి ఉంది.
నత్తనడకనే..
బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి సంబంధించి పెద్దగా పురోగతి లేదని అధికార వర్గాలు అంటున్నాయి.చాలా వరకు బిడ్డర్లు ఈ డీల్‌కు సరిపడా నిధులను సమకూర్చుకునేందుకు తగిన భాగస్వాములను ఎంపిక చేసుకోలేకపోయినట్టు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత వాతావరణానికి తోడు.. ఇంధన మార్కెట్లలోని ఆటుపోట్లను కారణంగా పేర్కొంటున్నాయి. పైగా విక్రయానికి సంబంధించి ఎన్నో అంశాలపై సందేహాల నివృత్తికి సమయం పట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆసక్తి కలిగిన బిడ్డర్లు బీపీసీఎల్‌కు సంబంధించి ఆర్థిక డేటాను గతేడాది ఏప్రిల్‌లనే పొందినట్టు వెల్లడించాయి. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఆయా అంశాలపై చర్చలకు చాలా సమయం పట్టినట్టు వివరించాయి.
కరోనా రాక ముందు వరకు అంటే 2020 ఫిబ్రవరి నాటికి బీపీసీఎల్‌ను ఎయిర్ ఇండియా కంటే ముందే విక్రయించగలమన్న నమ్మకంతో ప్రభుత్వం ఉంది. ఎయిర్‌ఇండియా తీవ్ర నష్టాల్లో నడుస్తుంటే.. బీపీసీఎల్ లాభాల వర్షం కురిపిస్తున్న కంపెనీ కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయగా దిగ్గజ ఇంధనరంగ కంపెనీలకు అదిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుకూల మార్గం అవుతుందని అభిప్రాయపడింది. కానీ కరోనా రాకతో అవన్నీ తారుమారయ్యాయి. అధిక వ్యయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున.. ఒకవైపు పన్నుల రూపంలో ఆదాయం పెరిగినా కానీ, పెట్టుబడుల ఉపంసంహరణ రూపంలో ఆదాయానికి తొర్ర పడితే జీడీపీలో ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం 6.8 శాతాన్ని ఎలా అధిగమించగలదో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment