న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకు విక్రయ ప్రక్రియకు మర్చంట్ బ్యాంకర్లు 52 వారాల గడువును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు యాజమాన్య నియంత్రణతోపాటు.. డిజిన్వెస్ట్‌మెంట్‌కు మే నెలలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆపై వాటా విక్రయ వ్యవహారాన్ని నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి జులై 13కల్లా బిడ్స్ దాఖలైనట్లు దీపమ్ పేర్కొంది.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఏడు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు రేసులో నిలిచాయి. అయితే వీటిలో అధిక శాతం సంస్థలు విక్రయ ప్రాసెస్‌కు 52 వారాల గడువును కోరుతున్నట్లు తెలుస్తోంది. పలు దశలలో బ్యాంకు ప్రయివేటైజేషన్ ప్రక్రియను చేపట్టవలసి ఉన్నట్లు ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఐడీబీఐ బ్యాంక్ డిజిన్వెస్ట్‌మెంట్‌ను పూర్తిచేయాలని భావిస్తోంది. వెరసి మర్చంట్ బ్యాంకర్లు 26 వారాలు లేదా ఆరు నెలల్లోగా కొనుగోలుదారుడిని వెదకవలసి ఉంటుంది.
ఐడీబీఐ బ్యాంక్ విక్రయాన్ని చేపట్టేందుకు డెలాయిట్ టచ్ టోమత్సు ఇండియా, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్‌ఎల్‌పీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, కేపీఎంజీ, ఎస్‌బీఐ క్యాపిటల్, ఆర్‌బీఎస్‌ఏ క్యాపిటల్ అడ్వయిజర్స్ బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంకు వాటా విక్రయాన్ని నిర్వహించేందుకు కేపీఎంజీ రూ. 1కే బిడ్ దాఖలు చేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకులో ఎల్‌ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. ఇతరులు 5.29 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2021–22 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాదిలోగా ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్‌ను పూర్తిచేయనున్నట్లు ప్రతిపాదించిన విషయం విదితమే.
చదవండి: నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ!!
Comments
Please login to add a commentAdd a comment