Merchant bankers
-
ఐడీబీఐ బ్యాంక్ అమ్మకం, ప్రక్రియకు గడువు కోరిన మర్చంట్ బ్యాంకర్లు
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకు విక్రయ ప్రక్రియకు మర్చంట్ బ్యాంకర్లు 52 వారాల గడువును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు యాజమాన్య నియంత్రణతోపాటు.. డిజిన్వెస్ట్మెంట్కు మే నెలలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆపై వాటా విక్రయ వ్యవహారాన్ని నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి జులై 13కల్లా బిడ్స్ దాఖలైనట్లు దీపమ్ పేర్కొంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఏడు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు రేసులో నిలిచాయి. అయితే వీటిలో అధిక శాతం సంస్థలు విక్రయ ప్రాసెస్‌కు 52 వారాల గడువును కోరుతున్నట్లు తెలుస్తోంది. పలు దశలలో బ్యాంకు ప్రయివేటైజేషన్ ప్రక్రియను చేపట్టవలసి ఉన్నట్లు ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఐడీబీఐ బ్యాంక్ డిజిన్వెస్ట్‌మెంట్‌ను పూర్తిచేయాలని భావిస్తోంది. వెరసి మర్చంట్ బ్యాంకర్లు 26 వారాలు లేదా ఆరు నెలల్లోగా కొనుగోలుదారుడిని వెదకవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ విక్రయాన్ని చేపట్టేందుకు డెలాయిట్ టచ్ టోమత్సు ఇండియా, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, కేపీఎంజీ, ఎస్బీఐ క్యాపిటల్, ఆర్బీఎస్ఏ క్యాపిటల్ అడ్వయిజర్స్ బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంకు వాటా విక్రయాన్ని నిర్వహించేందుకు కేపీఎంజీ రూ. 1కే బిడ్ దాఖలు చేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకులో ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. ఇతరులు 5.29 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2021–22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాదిలోగా ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్‌ను పూర్తిచేయనున్నట్లు ప్రతిపాదించిన విషయం విదితమే. చదవండి: నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ!! -
ఎల్ఐసీ ఐపీవోకు సలహాదారులు కావలెను
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు సంబంధించి మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గరిష్టంగా పది వరకు మర్చంట్ బ్యాంకర్లు, ఒక న్యాయ సలహా సేవల సంస్థను ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్) ఎంపిక చేయనుంది. బిడ్ల దాఖలుకు ఆగస్ట్ 6 వరకు గడువు ఇచ్చింది. గత వారమే ఎల్ఐసీ ఐపీవోకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. 2022 జనవరి–మార్చి మధ్యలో ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. ఇప్పటివరకు కేవలం రూ.7,500 కోట్ల మేరకే సమీకరించింది. ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం, ఎల్ఐసీ ఐపీవో రూపంలో గణనీయమైన మొత్తం సమకూరనుంది. -
ఎన్ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లు
న్యూఢిల్లీ: ఎన్ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఆర్థిక సంస్థల నుంచి బిడ్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆహ్వానించింది. ఎన్ఎండీసీలో 10 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,900 కోట్లు వస్తాయని అంచనా. ఈ 10 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. ఈ వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి నాలుగు సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేయనున్నది. ఆర్థిక సంస్థలు వచ్చే నెల 16లోగా తమ బిడ్లను సమర్పించాలని దీపం పేర్కొంది. -
ఎస్బీఐ 15,000 కోట్ల ఇష్యూకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.15,000 కోట్ల విలువైన వాటా విక్రయ ప్రయత్నాల జోరును పెంచింది. ఈ వాటా విక్రయం కోసం 9 మంది మర్చంట్ బ్యాంకర్లను ఎస్బీఐ ఎంపిక చేసిందని సమాచారం. గోల్డ్‌మన్ శాక్స్, బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ, ఎస్బీఐ క్యాప్స్, యాక్సిస్ బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లను మర్చంట్ బ్యాంకర్లుగా ఎస్బీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వ్యాపార విస్తరణ కోసం, అంతర్జాతీయంగా బ్యాంకింగ్ మూలధన నిధులు అందుకోవడం కోసం ఎస్బీఐ ఈ భారీ స్థాయి వాటా విక్రయాన్ని చేపడుతోంది. ఈ వాటా విక్రయం- రైట్స్ ఇష్యూ, ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్, అమెరికన్ డిపాజిటరీ రిసీప్ట్‌ల ద్వారా కానీ సమించరించనున్నది. వీటన్నింటి ద్వారా గానీ, లేదా వీటిలో ఏదో ఒక మార్గంలో రూ.15,000 కోట్ల నిధులు సమీకరించాలని ఎస్బీఐ యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో క్విప్ విధానంలో ఎస్బీఐ రూ.8,032 కోట్లను సమీకరించింది.