fuel stations
-
పెట్రోల్ బంకుల వద్ద క్యూ.. ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు
బారెడు బారెడు ‘క్యూ’లు అంటే భయం లేనిది ఎవరికి?ఎందుకంటే బోలెడు టైమ్ వృథా అవుతుంది. అసహనం పెట్రోల్ ధరలా పెరుగుతుంది. ఫ్యూయల్ స్టేషన్ల దగ్గర పెద్ద పెద్ద ‘క్యూ’లను చూసిన, వాహనదారుల అసహనాన్ని విన్న అనుభవంతో వైభవ్ కౌశిక్ తన స్నేహితులు ఆలాప్ నాయర్, ఆర్యన్లతో కలిసి స్టార్ట్ చేసిన ‘నవ్గతీ’ స్టార్టప్ విజయపథంలో దూసుకుపోతోంది. కొన్ని సంవత్సరాల క్రితం గ్రేటర్ నోయిడాకు చెందిన వైభవ్ కౌశిక్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు క్యాబ్ ఒక ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆగింది. అక్కడ పెద్ద క్యూ ఉంది. చాలా టైమ్ తరువాత బండి రోడ్డు పైకి వచ్చింది.‘ఇలా అయితే కష్టం కదా’ అని డ్రైవర్‌తో మాటలు కలిపాడు వైభవ్.‘ఎప్పుడూ ఇదే కష్టం. టైమ్ వృథా అవుతుంది. బేరాలు పోతున్నాయి’ అసంతృప్తిగా అన్నాడు డ్రైవర్. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా’ అని ఆలోచించడం మొదలు పెట్టాడు వైభవ్. కొద్దిసేపటి తరువాత అతనిలో ఒక ఐడియా మెరిసింది. అదే నవ్గతీ. తన కాలేజీ ఫ్రెండ్స్ ఆలాప్ నాయర్, ఆర్యన్లతో కలిసి వైభవ్ కౌశిక్ స్టార్ట్ చేసిన నవ్గతీ (మార్గదర్శనం) స్టార్టప్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇంధన స్టేషన్ల దగ్గర రద్దీ వల్ల వాహనదారుల టైమ్ వృథా కాకుండా, ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వన్–స్టాప్ ఫ్యూయల్ అగ్రిగేటర్ ΄ప్లాట్‌ఫామ్ రియల్–టైమ్ అప్డేట్స్ను అందిస్తుంది. రెండు సంవత్సరాల క్రితం దిల్లీలోని ఇంద్రప్రస్థ గ్యాస్‌స్టేషన్‌లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. డాటా–బ్యాక్డ్ ప్లాట్‌ఫామ్ ఆవెగ్, ఫ్యూయలింగ్ యాప్ అనే రెండు సర్వీసులను ఆఫర్ చేస్తోంది నవ్గతీ. బీ2సీ ఫ్యూయల్ డిస్కవరీ యాప్ ఫ్యూయల్ రేటు, అందుబాటు, సర్వ్ టైమ్...మొదలైన సమాచారాన్ని అందిస్తుంది. ఫ్యూయల్ స్టేషన్‌కు సంబంధించి రివ్యూకు అవకాశం కల్పిస్తుంది. ఇక ‘ఆవేగ్’ ద్వారా ఫ్యూయల్ స్టేషన్లకు సంబంధించి రవాణా సమయం, వెయిటింగ్ టైమ్, సర్వింగ్ టైమ్, వనరుల వినియోగం తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా... సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఫ్యూయల్ స్టేషన్లు తమ సర్వీసులను మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. ‘గతంలో ఫ్యూయల్ స్టేషన్లు కాంప్లయెన్స్ డిటైల్స్, లావాదేవీలు, అటెండెన్స్... వాటికి సంబంధించి డే–టు–డే డాటాను మాన్యువల్‌గా రికార్డ్ చేసేవి. ఇప్పుడు మాత్రం ‘ఆవేగ్’ రూపంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని యాక్టివిటీలను ఆటోమేట్ చేయవచ్చు. దీనివల్ల ఫ్యూయల్ స్టేషన్లు తమ సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ఖర్చులు తగ్గించుకోవచ్చు’ అంటున్నాడు వైభవ్ కౌశిక్. ఇంద్రప్రస్థా గ్యాస్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్–దిల్లీ, మహానగర్ గ్యాస్ లిమిటెడ్–ముంబైకి సంబంధించిన 150 ఫ్యూయల్ స్టేషన్లలో ఈ స్టార్టప్ తమ ఎడ్జ్ కంట్రోలర్లను ఇన్స్టాల్ చేసింది. దేశంలోని పెద్ద పట్ణణాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంది.మొదట్లో సూపర్ యూజర్లతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. కొత్త ఫీచర్లను పరీక్షించడానికి, మెరుగు పరచడానికి ఈ గ్రూప్ బీటా టెస్టింగ్ గ్రూప్‌గా ఉపయోగపడింది. ఏకాంత ఆలోచనల్లో నుంచే కాదు చూసే సమస్యల్లో నుంచి కూడా స్టార్టప్ ఐడియాలు పుడతాయని, గట్టి కృషి చేస్తే సార్టప్ కలలు సాకారం అవుతాయని చెప్పడానికి ‘నవ్గతీ’ స్టార్టప్ ఒక ఉదాహరణ. View this post on Instagram A post shared by Vaibhav Kaushik (@_vaibhavkaushik) తెలియక పోయినా పట్టుదలతో... ఇరవై సంవత్సరాల వయసులో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. స్టార్టప్ ప్రపంచం ముఖ్యంగా ఫ్యూయల్–టెక్ గురించి పెద్దగా తెలియకపోయినా ఎప్పుడూ అధైర్యపడలేదు. వెనక్కి తగ్గలేదు. ఆసక్తి, పట్టుదలతో నేర్చుకున్నాం. సవాలుకు సక్సెస్‌తోనే జవాబు ఇవ్వాలనుకున్నాం. ‘ఐడియా బాగానే ఉందిగానీ వర్కవుట్ అవుతుందా?’ అని సందేహించిన వారికి కూడా మా సక్సెస్‌తో సమాధానం చెప్పాం. – వైభవ్ కౌశిక్, కో–ఫౌండర్, సీయివో నవ్గతీ స్టార్టప్ -
షాకింగ్: క్యాన్‌లో పెట్రోల్ పోయించుకుంటూ ఉండగా ఒక్కసారిగా మంటలు
తుమకూరు (కర్ణాటక): తల్లీకూతురు పెట్రోల్ బంకులో క్యాన్‌లో పెట్రోల్ పోయించుకుంటూ ఉండగా మంటలు చెలరేగి గాయపడ్డారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని దొడ్డెరి దగ్గర బడవనహళ్ళి చెక్‌పోస్ట్ వద్ద పెట్రోల్ బంక్‌లో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాన్‌లో పెట్రోల్ నింపుతూ ఉండగా.. మహిళ రత్నమ్మ (46), ఆమె కుమార్తె భవ్య (18) తమ ఇంటి వద్ద చిల్లరగా పెట్రోల్‌ను అమ్ముతూ ఉంటారు. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో పెట్రోల్ కొనడానికి క్యాన్ తీసుకుని మోపెడ్ మీద బుధవారం మధ్యాహ్నం పెట్రోల్ బంక్‌కి వచ్చారు. పెట్రోల్ పోస్తూ ఉండగా మోపెడ్ మీద కొంత ఒలికింది, ఎండ వేడిమికి వెంటనే మంటలు చెలరేగడంతో తల్లీకూతురు మంటల్లో చిక్కారు. బంకు సిబ్బంది మంటలను ఆర్పివేసి ఇద్దరినీ శిర ఆస్పత్రికి తరలించగా కూతురు భవ్య శుక్రవారం మృతి చెందింది. తల్లి రత్నమ్మను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు విక్టోరియ ఆస్పత్రికి తరలించారు. బడవనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలకు చిక్కడంతో ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. కాగా, పెట్రోల్ పోస్తూ ఉండగా మొబైల్‌ఫోన్ ఉపయోగించడం వల్ల మంటలు చెలరేగాయని మరో వాదన ఉంది. -
హైదరాబాద్ లో వెలుగు చూస్తున్న పెట్రోల్ బంక్ మోసాలు
-
పెట్రోల్‌పై డిస్కౌంట్! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు
అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఫోనిక్స్‌లో నివసించే జస్విందర్ సింగ్ నిన్నా మొన్నటి వరకు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడతను అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఎంతో మంది అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏం పని చేయడం ద్వారా అతని ఖ్యాతి ఎల్లలు దాటిందనే సందేహం వస్తోందా.... గడిచిన ఆరు నెలలుగా పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా వార్ మొదలైన తర్వాత అయితే ఆకాశమే హద్దుగా పెట్రోలు/డీజిల్ రేట్లు పెరిగాయ్. ప్రభుత్వాలు సైతం సబ్సిడీలు భరించలేక ప్రజల నెత్తినే భారం మోపాయి. కరోనా కష్టకాలం ఆ తర్వాత ఫ్యూయల్ రేట్ల దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం రెక్కలు విప్పింది. ఉప్పు పప్పు మొదలు అన్నింటి ధరలు పెరిగాయ్. డిస్కౌంట్లో పెట్రోల్ అరిజోనాలోని ఫోనిక్స్ దగ్గర జస్విందర్ సింగ్ ఓ పెట్రోల్‌పంప్ (గ్యాస్ స్టేషన్) నిర్వహిస్తున్నాడు. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో అన్ని వస్తువుల ధరలు పెరిగితే... జస్విందర్ బంకులో మాత్రం ప్యూయల్‌పై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనాలో బ్యారెల్ ఫ్యూయల్ ధర 5.66 డాలర్లు ఉండగా జస్విందర్ ప్రతీ గ్యాలన్పై 47 సెంట్ల డిస్కౌంట్ ప్రకటించాడు. నష్టాలు వచ్చినా జస్విందర్ బంకులో ప్రతీరోజు సగటున వెయ్యి గ్యాలన్ల ఫ్యూయల్ అమ్ముడవుతోంది. ఈ లెక్కన ప్రతీరోజు బంకుకి 500 డాలర్ల (రూ.39 వేలు) వరకు నష్టం వస్తోంది. మార్చి నుంచి జస్విందర్ ఈ డిస్కౌంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఫ్యూయల్ రేట్లు పెరిగినా.. తన డిస్కౌంట్ ఆఫర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. మొదట్లో ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. కానీ ఫ్యూయల్ రేట్లు భగ్గుమంటున్నా నెలల తరబడి జస్విందర్ ఇచ్చిన మాట మీద నిలబడటంతో క్రమంగా అందరికీ జస్విందర్ నిజాయితీపై నమ్మకం పెరిగింది. అది అభిమానంగా మారింది. అమ్మనాన్నల స్ఫూర్తితో నష్టాలతో బంకును నిర్వహించడంపై ఎవరైనా జస్వంత్‌ని ప్రశ్నిస్తే... ‘ ఉన్నదాంట్లో పక్కవారికి సాయపడమంటూ మా అమ్మానాన్నలు నాకు నేర్పారు. నేను ఈ గ్యాస్ స్టేషన్ కారణంగానే జీవితంలో స్థిరపడ్డాను. పక్కవారికి సాయపడే స్థితిలో ఉన్నాను. అందుకే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న వారికి సాయంగా ఉండాలని ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను కొనసాగిస్తున్నాను’ అని తెలిపాడు జస్వంత్. సాహో జస్వంత్ మధ్యలో నష్టాలు అధికంగా వచ్చినప్పుడు గ్యాస్ స్టేషన్‌కి అనుబంధంగా ఉన్న స్టోరులో జస్వంత్ సింగ్ అతని భార్య ఎక్కువ గంటలు పని చేయడం ద్వారా ఆ నష్టాన్ని భరించగలుగుతున్నట్టు జస్విందర్ తెలిపారు. వ్యాపారం అంటే లెక్కలు లాభాలే చూసుకునే రోజుల్లో తోటి వారికి సాయం చేసే తలంపుతో ముందుకు సాగుతున్న జస్విందర్ గురించి తెలుసుకున్న అమెరికన్లకే కాదు యావత్ లోకం హ్యాట్సాఫ్ చెబుతోంది. చదవండి: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్ చేసిన బైడెన్ -
అంతా తల్లకిందులు.. అగ్గువ ఏడ దొరుకుతది?
సాక్షి, హన్మకొండ: డీజిల్ టోకు లెక్కన కొనే ఆర్టీసీకి కొత్త చిక్కొచ్చిపడ్డది. ఆయిల్ కంపెనీలు బల్క్ విక్రయాల రేట్లు పెంచాయి. దీంతో తక్కువ ధరకు డీజిల్ అందించే ప్రైవేట్ బంకుల కోసం ఆర్టీసీ వేట ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కో డిపోలో వందకు పైగా బస్సులున్నాయి. టీఎస్ ఆర్టీసీ డిపోలోనే సొంతంగా డీజిల్ బంక్‌లు ఏర్పాటు చేసుకుంది. బయటి మార్కెట్లో బంకులకు సరఫరా చేసినట్లుగానే హోల్‌సేల్ ధరలకు ఆయిల్ కంపెనీలు ఆర్టీసీకి డీజిల్ అందించేవి. కానీ.. ఉన్నట్లుండి ఒక్కసారిగా బల్క్ డీజిల్ కొనుగోలు చేస్తున్న సంస్థలకు ఆయిల్ కంపెనీలు ధరలు అమాంతం పెంచాయి. బల్క్ ధర లీటర్‌కు రూ.96.50కి పెంచినట్లు సమాచారం. బయటి బంకుల్లో రిటైల్ ధర లీటర్‌కు రూ.94.14 ఉంది. మన దగ్గర ఇలా.. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 9 డిపోలున్నాయి. హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ డిపోల ఆధ్వర్యంలో రిటైల్ డీజిల్ బంకులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూడు డిపోల బస్సులు ఆర్టీసీ నిర్వహిస్తున్న రిటైల్ డీజిల్ బంకుల్లో ఇంధనాన్ని నింపుకుంటున్నాయి. మిగతా వరంగల్–1, వరంగల్–2, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, తొర్రూరు డిపోల బస్సుల్లో ఇంధనాన్ని నింపేందుకు ఈ డిపోల పరిధిలో బంకులను గుర్తించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆలస్యమైతే ఆర్టీసీపై భారం పడనుండడంతో వీలైనంత త్వరగా ప్రైవేట్ బంకులను ఎంపిక చేసే పనిలో కమిటీ ముందుకు సాగుతోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డివిజనల్ మేనేజర్ల ఆధ్వర్యంలో కమిటీ ప్రైవేటు బంకులను గుర్తించే పనిలో ఉంది. వరంగల్ రీజియన్‌లో 952 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఇందులో సంస్థ సొంత బస్సులు 584, అద్దె బస్సులు 368 ఉన్నాయి. (చదవండి: డబ్బు ఇవ్వలేదని.. జబ్బు అంటగట్టింది) 952 బస్సులకు ఆయా డిపోల్లోని సంస్థ సొంత బంకుల్లోనే డీజిల్ నింపేవారు. వరంగల్ రీజియన్‌లో దాదాపు రోజుకు 67,500 లీటర్ల డీజిల్ అవసరం. లీటర్‌కు రూ.2.36 మిగిలితే. 67,500 లీటర్లకు రూ.1,59,300 సంస్థకు ఆదా కానుంది. బల్క్ కొనుగోలుదారులకు ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో సంస్థ సొంత బస్సులతోపాటు అద్దె బస్సులకు కూడా ప్రైవేట్ బంకులే దిక్కయ్యాయి. గతంలోనూ ఇదే పద్ధతి.. 2011–12 ఆర్థిక సంవత్సరం చివర్లో ఆయిల్ కంపెనీలు బల్క్ డీజిల్ ధరలు పెంచాయి. దీంతో ఆరు నెలలపాటు ప్రైవేటు డీజిల్ బంకుల్లో ఆర్టీసీ ఇంధనాన్ని నింపుకుంది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేట్ బంకుల వైపు ఆర్టీసీ చూస్తోంది. రిటైల్ ధరలోనూ కాస్త తగ్గించి ఆర్టీసీకి డీజిల్ అందించే బంకుల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రైవేటు బంకుల యజమానులను కలిసి మాట్లాడుతున్నారు. డివిజనల్ మేనేజర్, రీజినల్ అకౌంట్స్ ఆఫీసర్, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఎస్ఎస్ఐ, సంబంధిత డిపో మేనేజర్‌తో కూడిన కమిటీ ప్రైవేట్ డీజిల్ బంకులను ఎంపిక చేయనుంది. ఈ కమిటీ ఆయా డిపోల పరిధిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తుంది. వారం రోజుల్లోపు ప్రైవేట్ బంకులను ఖరారు చేసే పనిలో కమిటీ నిమగ్నమైంది. (చదవండి: ఇబ్రహీంపట్నంలో కాల్పుల ఘటన: ఇద్దరి మృతి) -
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే పెట్రోల్ పోయరంట!
వాయు కాలుష్యం ప్రపంచమంతటా పెరిగిపోతుంది. నిన్నా మొన్నటి వరకు ఎయిర్ ఇండెక్స్‌లో ఎంతో మెరుగ్గా ఉన్న హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు ఇప్పుడు రెడ్ జోన్లోకి వెళ్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతోంది ఢిల్లీ. దీంతో అక్కడి సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉంది ఢిల్లీ సర్కారు. అందులో భాగంగా పొల్యుషన్ అండర్ చెక్ సర్టిఫికేట్ (పీయూసీసీ) ఉన్న వాహనాలకే ఫ్యూయల్ బంకుల్లో పెట్రోలు , డీజిల్ పోయాలనే చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్టు ఆ రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్ తెలిపారు. ఫ్యూయల్ కోసం బంకుల్లోకి వచ్చే వాహనదారులు తప్పని సరిగా పొల్యుషన్ సర్టిఫికేట్ తమతో పాటు తెచ్చుకోవాలి. లేదంటే బంకుల్లో ఉండే పొల్యుషన్ టెస్టింగ్ కేంద్రాల దగ్గరు వెళ్లి ఈ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పెట్రోలు లేదా డీజిల్‌ను కొనేందుకు అనుమతి ఇస్తారు. ఈ విధానం అమలులో ఉండే లోటపాట్లు, ఇతర మార్పులు చేర్పులపై నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తోంది ఢిల్లీ సర్కార్. ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం పెరిగిపోయింది, ముఖ్యంగా చలి కాలంలో అయితే దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే సామాజిక సంస్థలకు తోడు సుప్రీం కోర్టు సైతం ఢిల్లీలో కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో గాలి నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి ఢిల్లీ సర్కారు తంటాలు పడుతోంది. -
అంతరిక్షంలో పెట్రోల్ బంకులు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాసా
పెట్రోల్ బంకులు భూమి మీదే కాదు ఇకపై అంతరిక్షంలో ఏర్పాటు కానున్నాయి. భూమి మీద వాహనదారులు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని ప్రయాణం చేస్తుంటే.. అదే మానవుడు (ఆస్ట్రోనాట్స్) అంతరిక్షంలో ఇంధనంతో స్పేస్‌లో ప్రయాణించనున్నాడు. గత కొంత కాలంగా స్పేస్‌లో దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రష్యా అంతరిక్షంలో బాధతారాహిత్యంగా ప్రవర్తించింది. యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షలో భాగంగా తన సొంత శాటిలైట్‌ను పేల్చేసింది. దీంతో శాటిలైట్‌కు చెందిన 1,500కు పైగా ఉపగ్రహ శకలాలు 2000 కి.మీ ఎత్తు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండే భూ కక్ష్య లో (ఎల్ఈఓ)లో తిరుగుతున్నాయి. రష్యా తీరుపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా మతిలేని చర్యల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని సిబ్బంది ప్రాణ భయంతో ఐఎస్ఎస్ క్యాప్సూల్స్‌లో దాక్కోవాల్సి వచ్చినట్లు ద్వజమెత్తింది. అయితే ఇలా శాటిలైట్లను పేల్చడంతో పాటు ఇతర శకలాల వల్ల ఉపగ్రహాలకు నష్టం వాటిల్లనుంది. అందుకే పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు..ఆ శకలాలు ఉపగ్రహాలపై నిలిపేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన న్యూమన్ స్పేస్ సంస్థ 'ఇన్ స్పేస్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్' పేరుతో కాలం చెల్లిన ఉగప్రహాల శకలాలు, రాకెట్ల విడిబాగాలతో అంతరిక్షంలో థ్రస్ట్ పుట్టుకొచ్చేలా ప్రయోగాలు ప్రారంభించింది. అంటే అంతరిక్షంలో రాకెట్లు ముందుకు ప్రయాణించడానికి ఈ థ్రస్ట్ ఉపయోగపడుతుంది. థ్రస్ట్ రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. అలా థస్ట్ రావాలంటే ఇంధనం అవసరం. అందుకే థస్ట్ల కోసం స్పేస్‌లోనే శకలాలతో ఇంధనం తయారు చేయనున్నారు. ఒకరకంగా దీన్ని అంతరిక్షంలో పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయడం అన్నమాటే. భవిష్యత్ అవసరాలకోసం నాసా ప్రయోగాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో న్యూమన్ స్పేస్ సంస్థ ప్రయోగాలు చేస్తుంది. ప్రయోగాలు పూర్తయితే అక్కడ కూడా ఇంధనం దొరకనుంది. -
అప్పుడు జియో నెట్వర్క్.. ఇప్పుడు పెట్రోలు బంకులు.. రిలయన్స్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: రిలయన్స్ సంస్థ రాకతో ఒక్కసారిగా మొబైల్ నెట్వర్క్ రూపు రేఖలే మారిపోయాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం ఆకాశాన్ని తాకింది. అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ అందిస్తూ మార్కెట్లో గట్టి పాగా వేసింది రిలయన్స్. తాజాగా పెట్రోలు బంకులు వ్యాపారంలోకి వస్తోంది. గతంలో రిలయన్స్ ఆధ్వర్యంలో బంకులు ఉన్నా.. ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉండేది. కానీ ఈసారి విదేశీ కంపెనీతో జట్టుకట్టి గోదాలోకి దూకుతోంది రిలయన్స్. పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ సంస్థ బీపీ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ రిలయన్స్ బీపీ మొబిలిటీ (ఆర్‌బీఎంఎల్) తొలి పెట్రోల్ బంకును ఆవిష్కరించింది. జియో–బీపీ బ్రాండ్ కింద నవీ ముంబైలోని నావ్డేలో దీన్ని ప్రారంభించింది. ‘కస్టమరు అవసరాలకు అనుగుణంగా జియో–బీపీ మొబిలిటీ స్టేషన్లను తీర్చిదిద్దాం. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, అడిటివైజ్డ్ ఇంధనాలు, రిఫ్రెష్మెంట్లు, ఆహారం మొదలైన వివిధ సర్వీసులన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయి‘ అని ఆర్‌బీఎంఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర సాధారణ ఇంధనాలు కాకుండా మరింత శక్తిమంతమైన ఇంధనాలను, ఎటువంటి అదనపు ధర విధించకుండా, వీటిలో అందిస్తామని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయి ’యాక్టివ్’ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఇంధనం.. కీలకమైన ఇంజిన్ భాగాలకు రక్షణ కల్పిస్తుందని, ఇంజిన్లను శుభ్రంగా ఉంచుతుందని ఆర్‌బీఎంఎల్ వివరించింది. చాయ్.. సమోసా.. ఉప్మా.. తమ మొబిలిటీ స్టేషన్లలోను, ఇతర ప్రాంతాల్లోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ మార్పిడి స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఎంఎల్ తెలిపింది. ‘బీపీకి చెందిన వైల్డ్ బీన్ కెఫే బ్రాండ్ కాఫీతో పాటు మసాలా చాయ్, సమోసా, ఉప్మా, పనీర్ టిక్కా రోల్ వంటి ప్రాంతీయ, స్థానిక ఆహారం కూడా అందిస్తాం. ఇక పేరొందిన అమెరికన్ సంస్థ 24 గీ7 షాప్ ద్వారా నిత్యావసరాలు, స్నాక్స్, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను రిలయన్స్ రిటైల్ అందుబాటులో ఉంచుతుంది‘ అని వివరించింది. ఇక మొబిలిటీ స్టేషన్లలో క్యాస్ట్రాల్ భాగస్వామ్యంతో ఎక్స్‌ప్రెస్ ఆయిల్ చేంజ్ అవుట్‌లెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వీటిలో వాహనాల చెకప్, ఆయిల్ చేంజ్ సర్వీసు వంటి సర్వీసులు ఉచితంగా అందిస్తామని వివరించింది. తక్ష ణ డిస్కౌంట్లు, హ్యాపీ అవర్ స్కీములు, సరళతరమైన డిజిటల్ చెల్లింపుల విధానాలు మొదలైనవి కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఎంఎల్ తెలిపింది. 2025 నాటికి 5,500 మొబిలిటీ స్టేషన్లు.. 2019లో జాయింట్ వెంచర్‌గా (జేవీ) ఏర్పాటైన ఆర్‌బీఎంఎల్‌లో బీపీకి 49 శాతం, రిలయన్స్‌కు 51 శాతం వాటాలు ఉన్నాయి. రిలయన్స్‌కి చెందిన 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 విమాన ఇంధన (ఏటీఎఫ్) స్టేషన్లను దీనికి బదలాయించారు. ఈ బంకుల సంఖ్యను 2025 నాటికి 5,500కి పెంచుకోవాలని జేవీ నిర్దేశించుకుంది. ప్రస్తుతం దేశీయంగా దాదాపు 78,751 పెట్రోల్ బంకులు ఉండగా.. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలదే ఉంది. ఆర్‌బీఎంఎల్‌కు 1,427 అవుట్‌లెట్స్, రష్యన్ దిగ్గజం రాస్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీకి 6,250 బంకులు, షెల్‌కు 285 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రస్తుతమున్న 1,400 రిలయన్స్ బంకులను జియో–బీపీ కింద రీబ్రాండింగ్ చేయనున్నట్లు ఆర్బీఎన్ఎల్ తెలిపింది. చదవండి: శ్రీలంకపై కన్నేసిన అదానీ..! -
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఇథనాల్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగంలో ఉన్న ఆయిల్, గ్యాస్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ప్రత్యామ్నాయ ఇంధనం కోసం భారీ ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఒక్కో ఫెసిలిటీకి రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్ ఎస్ఎస్వీ రామకుమార్ తెలిపారు. కంపెనీ ఈడీ, తెలంగాణ, ఏపీ హెడ్ ఆర్ఎస్ఎస్ రావుతో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒక్కో కేంద్రం రోజుకు 5 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రెండు స్థలాలను ప్రతిపాదించింది. ఏపీ సైతం ఇదే స్థాయిలో స్పందిస్తుందన్న ధీమా ఉంది. స్థలం చేతిలోకి రాగానే 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం’ అని చెప్పారు. బ్యాటరీ ప్లాంటు.. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల తయారీ కోసం ఇజ్రాయెల్ కంపెనీ ఫినెర్జీతో ఇండియన్ ఆయిల్ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక గిగావాట్ వార్షిక సామర్థ్యంతో రానున్న ప్రతిపాదిత ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేసేది త్వరలో ప్రకటించనున్నారు. అల్యూమినియం ఆధారిత బ్యాటరీలను ఇక్కడ తయారు చేస్తారు. ఒకసారి చార్జీ చేస్తే ఈ బ్యాటరీతో 400 కిలోమీటర్ల వరకు వాహనం ప్రయాణిస్తుంది. బ్యాటరీలకు కావాల్సిన ముడి పదార్థాలన్నీ దేశీయంగా లభించేవే. రెండవ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఇండియన్ ఆయిల్ నోయిడాలో నెలకొల్పనుంది. 2023 జూలై నాటికి ఇది సిద్ధం కానుంది. ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,300 కోట్లు వెచ్చించనుంది. సుపీరియర్ డీజిల్ త్వరలో.. ఇండియన్ ఆయిల్ త్వరలో సుపీరియర్ డీజిల్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, చట్టబద్ధమైన అనుమతులు సైతం పొందామని రామకుమార్ తెలిపారు. ధర ఎక్కువ ఉన్నప్పటికీ కస్టమర్లకు ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పారు. ఇంజన్ శుభ్రంగా ఉండడం, తక్కువ ఉద్గారాలు, అధిక మైలేజీ ఇస్తుందని వివరించారు. ఎనర్జీ స్టేషన్స్‌గా అవతరణ.. సంస్థ ఫ్యూయల్ స్టేషన్స్ రూపురేఖలు మారనున్నాయి. 5–10 ఏళ్లలో ఇండియన్ ఆయిల్ పంపుల్లో మిథనాల్, ఇథనాల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ సైతం విక్రయించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పాయింట్లూ రానున్నాయి. సాధారణ ఫ్యూయల్ స్టేషన్స్ కాస్తా ఇండియన్ ఆయిల్ ఎనర్జీ స్టేషన్స్‌గా రూపొందనున్నాయి. అలాగే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 5,000 కంప్రెస్డ్ బయోగ్యాస్ కేంద్రాలు రానున్నాయి. ఇప్పటికే 600 కేంద్రాలకు అనుమతులు ఇచ్చారు. ఒక ఎకరం స్థలం, రూ.3–5 కోట్ల పెట్టుబడి పెట్టగలిగే ఔత్సాహికులు ముందుకు రావొచ్చు. రుణమూ దొరుకుతుంది. కేజీకి సంస్థ రూ.46 చెల్లిస్తుంది. -
చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్
మాస్కో: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఆగస్టు నెలలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా రష్యాలోని ఓ పెట్రోల్ బంక్‌లో భారీ పేలుడు సంభవించింది.. సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వోల్గోగ్రాడ్ పెట్రోల్ స్టేషన్లో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళం అక్కడకు చేరుకుంది. మంటల ధాటికి అంతలోనే భారీ పేలుడు చోటుచేసుకోవడంతో పెట్రోల్ బంక్ నామరూపాల్లేకుండా పోయింది. పెట్రోల్ స్టేషన్‌కు సంబంధించిన పైప్లైన్లు కూడా పేలి పోవడంతో సుమారు 200 మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగిన భారీ పేలుడు ఘటనతో 160 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. (నిరసనలు: లెబనాన్ ప్రధాని రాజీనామా) -
చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్
-
ఇక రిలయన్స్, బీపీ బంకులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు, విమాన ఇంధనాన్ని కూడా విక్రయిచేందుకు దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీ తాజాగా జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. పెట్టుబడులు తదితర అంశాలతో కూడిన ఒప్పందం కూడా త్వరలోనే ఖరారు కాగలదని పేర్కొన్నాయి. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2020 ప్రథమార్ధం నాటికి పూర్తి ఒప్పందం కుదరవచ్చని వివరించాయి. డీల్ ప్రకారం కొత్త వెంచర్లో బీపీకి 49 శాతం, రిలయన్స్‌కు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన సుమారు 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 పైచిలుకు విమాన ఇంధన స్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యే జేవీకి బదలాయిస్తారు. రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ, బీపీ గ్రూప్ సీఈవో బాబ్ డడ్లీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ‘ఇంధన రిటైలింగ్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన బీపీతో మా పటిష్టమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం. ఇప్పటికే గ్యాస్ వనరుల అభివృద్ధిలో ఉన్న మా భాగస్వామ్యం ఇక ఇంధన రిటైలింగ్, ఏవియేషన్ ఇంధనాలకు కూడా విస్తరిస్తుంది. ప్రపంచ స్థాయి సేవలు అందించేందుకు ఇది తోడ్పడనుంది‘ అని ముకేశ్ అంబానీ తెలిపారు. ‘రిలయన్స్‌తో కలిసి వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సేవలు, అత్యంత నాణ్యమైన ఇంధనాలు అందిస్తాం‘ అని బాబ్ డడ్లీ పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో ఇంధనాల రిటైల్ నెట్‌వర్క్‌ను 5,500 పెట్రోల్ బంకులకు విస్తరించనున్నామని రెండు సంస్థలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘భారత్‌లో విమాన ఇంధన విక్రయ వ్యాపారానికి, రిటైల్ సర్వీస్ స్టేషన్ నెట్వర్క్ ఏర్పాటు కోసం మా రెండు సంస్థలు కొత్తగా జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రిలయన్స్‌కు ఉన్న ఇంధన రిటైలింగ్ నెట్వర్క్, విమాన ఇంధన వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నాం‘ అని వివరించాయి. అయితే, 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 విమానాశ్రయాల్లో ఉన్న విమాన ఇంధన స్టేషన్లలో కూడా వాటాలు దక్కించుకుంటున్నందుకు గాను రిలయన్స్‌కు బీపీ ఎంత మొత్తం చెల్లించనున్నది మాత్రం వెల్లడించలేదు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న జంట చమురు రిఫైనరీల్లో వాటాలు విక్రయించేందుకు సౌదీ ఆరామ్కోతో రిలయన్స్ చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ జాయింట్ వెంచర్ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరామ్కో కూడా భారత్‌లో ఇంధనాల రిటైలింగ్ కార్యకలాపాల వెంచర్‌పై దృష్టి పెట్టింది. మూడో జేవీ.. 2011 నుంచి రిలయన్స్, బీపీకి ఇది మూడో జాయింట్ వెంచర్ కానుంది. 2011లో రిలయన్స్‌కి చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో బీపీ 30 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 7.2 బిలియన్ డాలర్లు. ఇప్పటిదాకా రెండు సంస్థలు చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కోసం 2 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇక అప్పట్లోనే గ్యాస్ సోర్సింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల కోసం ఇండియా గ్యాస్ సొల్యూషన్స్ (ఐజీఎస్‌పీఎల్) పేరిట రెండు సంస్థలు ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఇందులో రెండింటికీ చెరి 50 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చమురు, గ్యాస్ బ్లాకుల్లో కొన్నింటిని రిలయన్స్–బీపీ వదిలేసుకున్నాయి. ఐజీఎస్‌పీఎల్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇంధన రిటైలింగ్‌లో పీఎస్‌యూల హవా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 65,000 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) చమురు మార్కెటింగ్ కంపెనీలకే ఉంది. వీటికి ఏకంగా 58.174 బంకులు ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించి రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ సారథ్యంలోని నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్ ఆయిల్)కు 5,244 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వచ్చే 2–3 ఏళ్లలో వీటిని 7,000కు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. రాయల్ డచ్ షెల్‌కు ప్రస్తుతం 151 అవుట్‌లెట్స్ ఉండగా, కొత్తగా మరో 150–200 దాకా బంకులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. భారత్‌లో 3,500 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు బీపీ 2016లోనే లైసెన్సు పొందింది. -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ...
న్యూఢిల్లీః పెట్రోల్ బంకుల్లో జన్ ఔషధి మెడికల్ స్టోర్స్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రాణ రక్షక ఔషధాలను చవక ధరలకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పెట్రోలియం, చమురు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో ఎల్ఈడీ బల్బుల విక్రయానికి ఆయిల్ రిటైలర్లతో ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో త్వరలో జనరిక్ దుకాణాలనూ అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జనరిక్ స్టోర్స్ నిర్వహణకు క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అవసరం ఉన్నందున ఫార్మసిస్ట్‌ల కొరతను అధిగమించి ఈ దుకాణాలను ముందుకు తీసుకువెళ్లడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు అధికారులు చెబుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ఈ తరహా ఔట్లెట్లను అనుమతించడంతో యువతకు ఉపాధి అవకాశాలూ మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
ఈ బ్యాంకింగ్ సేవలు..పెట్రోల్ బంకుల్లో కూడా
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారుల సౌలభ్యం కోసం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తమ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేందుకు గాను దేశ వ్యాప్తంగా హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల సుమారు 14 వేల పాయింట్లను ఏర్పాటు చేయనుంది. తద్వారా ఎయిర్టెల్ బ్యాంక్ ఖాతాదారులకు కొత్త ఖాతాలను తెరిచేందుకు, నగదు ఉపసంహరణ నిమిత్తం ఈ పాయింట్లను వినియోగించుకోవచ్చని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్ సౌలభ్యంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపులను పెంపొందించే వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యమనీ, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కోసం అన్ని 14,000 హెచ్‌పిసిఎల్ ఇంధన స్టేషన్లు బ్యాంకింగ్ పాయింట్లుగా పనిచేస్తాయని ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ తెలిపింది. తమ వినియోగదారులు ఈ పాయింట్ల ద్వారా కొత్త ఖాతాలు తెరవడానికి, నగదు డిపాజిట్లు , ఉపసంహరణ, బదిలీ లాంటి సేవలను అందించనున్నామని పేర్కొంది. దీంతోపాటు కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ ఇంధన స్టేషన్లలో ఇంధన కొనుగోళ్లకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపులను ఎంచుకోవచ్చని ఎయిర్టెల్ పే మెంట్స్ బ్యాంక్ వెల్లడించింది. తద్వారా ప్రస్తుతం 300,000 ఎయిర్టెల్ రిటైల్ అవుట్లెట్ల తో ఉన్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రీటైల్-ఆధారిత నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనుంది.