ఇక రిలయన్స్, బీపీ బంకులు | 5500 Reliance and BP Petrol Bunks across the country in next five years | Sakshi
Sakshi News home page

ఇక రిలయన్స్, బీపీ బంకులు

Published Wed, Aug 7 2019 4:58 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

5500 Reliance and BP Petrol Bunks across the country in next five years - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసేందుకు, విమాన ఇంధనాన్ని కూడా విక్రయిచేందుకు దిగ్గజ సంస్థలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీ తాజాగా జాయింట్‌ వెంచర్‌ (జేవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. పెట్టుబడులు తదితర అంశాలతో కూడిన ఒప్పందం కూడా త్వరలోనే ఖరారు కాగలదని పేర్కొన్నాయి. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2020 ప్రథమార్ధం నాటికి పూర్తి ఒప్పందం కుదరవచ్చని వివరించాయి. డీల్‌ ప్రకారం కొత్త వెంచర్‌లో బీపీకి 49 శాతం, రిలయన్స్‌కు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన సుమారు 1,400 పైచిలుకు పెట్రోల్‌ బంకులు, 31 పైచిలుకు విమాన ఇంధన స్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యే జేవీకి బదలాయిస్తారు. రిలయన్స్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ, బీపీ గ్రూప్‌ సీఈవో బాబ్‌ డడ్లీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ‘ఇంధన రిటైలింగ్‌ రంగంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన బీపీతో మా పటిష్టమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం. ఇప్పటికే గ్యాస్‌ వనరుల అభివృద్ధిలో ఉన్న మా భాగస్వామ్యం ఇక ఇంధన రిటైలింగ్, ఏవియేషన్‌ ఇంధనాలకు కూడా విస్తరిస్తుంది. ప్రపంచ స్థాయి సేవలు అందించేందుకు ఇది తోడ్పడనుంది‘ అని ముకేశ్‌ అంబానీ తెలిపారు. ‘రిలయన్స్‌తో కలిసి వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సేవలు, అత్యంత నాణ్యమైన ఇంధనాలు అందిస్తాం‘ అని బాబ్‌ డడ్లీ పేర్కొన్నారు. 

వచ్చే అయిదేళ్లలో ఇంధనాల రిటైల్‌ నెట్‌వర్క్‌ను 5,500 పెట్రోల్‌ బంకులకు విస్తరించనున్నామని రెండు సంస్థలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘భారత్‌లో విమాన ఇంధన విక్రయ వ్యాపారానికి, రిటైల్‌ సర్వీస్‌ స్టేషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం మా రెండు సంస్థలు కొత్తగా జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రిలయన్స్‌కు ఉన్న ఇంధన రిటైలింగ్‌ నెట్‌వర్క్, విమాన ఇంధన వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నాం‘ అని వివరించాయి. అయితే, 1,400 పైచిలుకు పెట్రోల్‌ బంకులు, 31 విమానాశ్రయాల్లో ఉన్న విమాన ఇంధన స్టేషన్లలో కూడా వాటాలు దక్కించుకుంటున్నందుకు గాను రిలయన్స్‌కు బీపీ ఎంత మొత్తం చెల్లించనున్నది మాత్రం వెల్లడించలేదు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న జంట చమురు రిఫైనరీల్లో వాటాలు విక్రయించేందుకు సౌదీ  ఆరామ్‌కోతో రిలయన్స్‌ చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ జాయింట్‌ వెంచర్‌ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరామ్‌కో కూడా భారత్‌లో ఇంధనాల రిటైలింగ్‌ కార్యకలాపాల వెంచర్‌పై  దృష్టి పెట్టింది.  

మూడో జేవీ.. 
2011 నుంచి రిలయన్స్, బీపీకి ఇది మూడో జాయింట్‌ వెంచర్‌ కానుంది. 2011లో రిలయన్స్‌కి చెందిన 21 చమురు, గ్యాస్‌ బ్లాకుల్లో బీపీ 30 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ 7.2 బిలియన్‌ డాలర్లు. ఇప్పటిదాకా రెండు సంస్థలు చమురు, గ్యాస్‌ అన్వేషణ, ఉత్పత్తి కోసం 2 బిలియన్‌ డాలర్ల దాకా ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక అప్పట్లోనే గ్యాస్‌ సోర్సింగ్, మార్కెటింగ్‌ కార్యకలాపాల కోసం ఇండియా గ్యాస్‌ సొల్యూషన్స్‌ (ఐజీఎస్‌పీఎల్‌) పేరిట రెండు సంస్థలు ఒక జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేశాయి. ఇందులో రెండింటికీ చెరి 50 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చమురు, గ్యాస్‌ బ్లాకుల్లో కొన్నింటిని రిలయన్స్‌–బీపీ వదిలేసుకున్నాయి. ఐజీఎస్‌పీఎల్‌ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది.  

ఇంధన రిటైలింగ్‌లో పీఎస్‌యూల హవా.. 
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 65,000 పైగా పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) చమురు మార్కెటింగ్‌ కంపెనీలకే ఉంది. వీటికి ఏకంగా 58.174 బంకులు ఉన్నాయి. ఇక ప్రైవేట్‌ రంగానికి సంబంధించి రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌ సారథ్యంలోని నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్‌ ఆయిల్‌)కు 5,244 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వచ్చే 2–3 ఏళ్లలో వీటిని 7,000కు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. రాయల్‌ డచ్‌ షెల్‌కు ప్రస్తుతం 151 అవుట్‌లెట్స్‌ ఉండగా, కొత్తగా మరో 150–200 దాకా బంకులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. భారత్‌లో 3,500 పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసేందుకు బీపీ 2016లోనే లైసెన్సు పొందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement