హనుమకొండ డిపో ఎదురుగా పెట్రోల్ బంకు వద్ద ఆర్టీసీ బస్సులు
సాక్షి, హన్మకొండ: డీజిల్ టోకు లెక్కన కొనే ఆర్టీసీకి కొత్త చిక్కొచ్చిపడ్డది. ఆయిల్ కంపెనీలు బల్క్ విక్రయాల రేట్లు పెంచాయి. దీంతో తక్కువ ధరకు డీజిల్ అందించే ప్రైవేట్ బంకుల కోసం ఆర్టీసీ వేట ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కో డిపోలో వందకు పైగా బస్సులున్నాయి. టీఎస్ ఆర్టీసీ డిపోలోనే సొంతంగా డీజిల్ బంక్‌లు ఏర్పాటు చేసుకుంది. బయటి మార్కెట్లో బంకులకు సరఫరా చేసినట్లుగానే హోల్‌సేల్ ధరలకు ఆయిల్ కంపెనీలు ఆర్టీసీకి డీజిల్ అందించేవి. కానీ.. ఉన్నట్లుండి ఒక్కసారిగా బల్క్ డీజిల్ కొనుగోలు చేస్తున్న సంస్థలకు ఆయిల్ కంపెనీలు ధరలు అమాంతం పెంచాయి. బల్క్ ధర లీటర్‌కు రూ.96.50కి పెంచినట్లు సమాచారం. బయటి బంకుల్లో రిటైల్ ధర లీటర్‌కు రూ.94.14 ఉంది.
మన దగ్గర ఇలా..
ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 9 డిపోలున్నాయి. హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ డిపోల ఆధ్వర్యంలో రిటైల్ డీజిల్ బంకులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూడు డిపోల బస్సులు ఆర్టీసీ నిర్వహిస్తున్న రిటైల్ డీజిల్ బంకుల్లో ఇంధనాన్ని నింపుకుంటున్నాయి. మిగతా వరంగల్–1, వరంగల్–2, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, తొర్రూరు డిపోల బస్సుల్లో ఇంధనాన్ని నింపేందుకు ఈ డిపోల పరిధిలో బంకులను గుర్తించే ప్రక్రియ వేగంగా సాగుతోంది.
ఆలస్యమైతే ఆర్టీసీపై భారం పడనుండడంతో వీలైనంత త్వరగా ప్రైవేట్ బంకులను ఎంపిక చేసే పనిలో కమిటీ ముందుకు సాగుతోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డివిజనల్ మేనేజర్ల ఆధ్వర్యంలో కమిటీ ప్రైవేటు బంకులను గుర్తించే పనిలో ఉంది. వరంగల్ రీజియన్‌లో 952 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఇందులో సంస్థ సొంత బస్సులు 584, అద్దె బస్సులు 368 ఉన్నాయి.
(చదవండి: డబ్బు ఇవ్వలేదని.. జబ్బు అంటగట్టింది)
952 బస్సులకు ఆయా డిపోల్లోని సంస్థ సొంత బంకుల్లోనే డీజిల్ నింపేవారు. వరంగల్ రీజియన్‌లో దాదాపు రోజుకు 67,500 లీటర్ల డీజిల్ అవసరం. లీటర్‌కు రూ.2.36 మిగిలితే. 67,500 లీటర్లకు రూ.1,59,300 సంస్థకు ఆదా కానుంది. బల్క్ కొనుగోలుదారులకు ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో సంస్థ సొంత బస్సులతోపాటు అద్దె బస్సులకు కూడా ప్రైవేట్ బంకులే దిక్కయ్యాయి.
గతంలోనూ ఇదే పద్ధతి..
2011–12 ఆర్థిక సంవత్సరం చివర్లో ఆయిల్ కంపెనీలు బల్క్ డీజిల్ ధరలు పెంచాయి. దీంతో ఆరు నెలలపాటు ప్రైవేటు డీజిల్ బంకుల్లో ఆర్టీసీ ఇంధనాన్ని నింపుకుంది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేట్ బంకుల వైపు ఆర్టీసీ చూస్తోంది. రిటైల్ ధరలోనూ కాస్త తగ్గించి ఆర్టీసీకి డీజిల్ అందించే బంకుల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రైవేటు బంకుల యజమానులను కలిసి మాట్లాడుతున్నారు.
డివిజనల్ మేనేజర్, రీజినల్ అకౌంట్స్ ఆఫీసర్, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఎస్‌ఎస్‌ఐ, సంబంధిత డిపో మేనేజర్‌తో కూడిన కమిటీ ప్రైవేట్ డీజిల్ బంకులను ఎంపిక చేయనుంది. ఈ కమిటీ ఆయా డిపోల పరిధిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తుంది. వారం రోజుల్లోపు ప్రైవేట్ బంకులను ఖరారు చేసే పనిలో కమిటీ నిమగ్నమైంది.
(చదవండి: ఇబ్రహీంపట్నంలో కాల్పుల ఘటన: ఇద్దరి మృతి)
Comments
Please login to add a commentAdd a comment