పెట్రోల్ నింపుతుండగా మంటలు వస్తున్న దృశ్యం, ఆ తరువాత ఇద్దరికీ అంటుకున్నాయి
తుమకూరు (కర్ణాటక): తల్లీకూతురు పెట్రోల్ బంకులో క్యాన్‌లో పెట్రోల్ పోయించుకుంటూ ఉండగా మంటలు చెలరేగి గాయపడ్డారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని దొడ్డెరి దగ్గర బడవనహళ్ళి చెక్‌పోస్ట్ వద్ద పెట్రోల్ బంక్‌లో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
క్యాన్‌లో పెట్రోల్ నింపుతూ ఉండగా..
మహిళ రత్నమ్మ (46), ఆమె కుమార్తె భవ్య (18) తమ ఇంటి వద్ద చిల్లరగా పెట్రోల్‌ను అమ్ముతూ ఉంటారు. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో పెట్రోల్ కొనడానికి క్యాన్ తీసుకుని మోపెడ్ మీద బుధవారం మధ్యాహ్నం పెట్రోల్ బంక్‌కి వచ్చారు. పెట్రోల్ పోస్తూ ఉండగా మోపెడ్ మీద కొంత ఒలికింది, ఎండ వేడిమికి వెంటనే మంటలు చెలరేగడంతో తల్లీకూతురు మంటల్లో చిక్కారు.
బంకు సిబ్బంది మంటలను ఆర్పివేసి ఇద్దరినీ శిర ఆస్పత్రికి తరలించగా కూతురు భవ్య శుక్రవారం మృతి చెందింది. తల్లి రత్నమ్మను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు విక్టోరియ ఆస్పత్రికి తరలించారు. బడవనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలకు చిక్కడంతో ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. కాగా, పెట్రోల్ పోస్తూ ఉండగా మొబైల్‌ఫోన్ ఉపయోగించడం వల్ల మంటలు చెలరేగాయని మరో వాదన ఉంది.
Comments
Please login to add a commentAdd a comment