ఈ బ్యాంకింగ్ సేవలు..పెట్రోల్ బంకుల్లో కూడా
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారుల సౌలభ్యం కోసం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తమ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేందుకు గాను దేశ వ్యాప్తంగా హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల సుమారు 14 వేల పాయింట్లను ఏర్పాటు చేయనుంది. తద్వారా ఎయిర్‌టెల్ బ్యాంక్ ఖాతాదారులకు కొత్త ఖాతాలను తెరిచేందుకు, నగదు ఉపసంహరణ నిమిత్తం ఈ పాయింట్లను వినియోగించుకోవచ్చని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
కస్టమర్ సౌలభ్యంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపులను పెంపొందించే వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యమనీ, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కోసం అన్ని 14,000 హెచ్పిసిఎల్ ఇంధన స్టేషన్లు బ్యాంకింగ్ పాయింట్లుగా పనిచేస్తాయని ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ తెలిపింది. తమ వినియోగదారులు ఈ పాయింట్ల ద్వారా కొత్త ఖాతాలు తెరవడానికి, నగదు డిపాజిట్లు , ఉపసంహరణ, బదిలీ లాంటి సేవలను అందించనున్నామని పేర్కొంది. దీంతోపాటు కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ ఇంధన స్టేషన్లలో ఇంధన కొనుగోళ్లకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపులను ఎంచుకోవచ్చని ఎయిర్‌టెల్ పే మెంట్స్ బ్యాంక్ వెల్లడించింది. తద్వారా ప్రస్తుతం 300,000 ఎయిర్టెల్ రిటైల్ అవుట్లెట్ల తో ఉన్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రీటైల్-ఆధారిత నెట్‌వర్క్ను భారీగా విస్తరించనుంది.