కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో గ్రామపంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి. వీటిని ఆర్‌డబ్ల్యుఎస్‌కు మళ్లించాలని గత కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం వివాదస్పదమైంది. ఇది పంచాయతీలకు ఉన్న హక్కులను కాలరాయడమేనని సర్పంచులు విమర్శిస్తున్నారు. జిల్లాలోని 889 గ్రామపంచాయతీలకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 13వ ఆర్థిక కమిషన్ నిధులు రూ.25కోట్లకు పైగా విడుదలయ్యాయి.
వీటితో గ్రామంలోని తాగునీటి పథకాల నిర్వహణ, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధిలైట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, గ్రామపంచాయతీ భవనాల నిర్వహణ, ఈ-పంచాయతీ, అంగన్‌వాడీ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలల నిర్వహణకు వినియోగించాల్సి ఉంది. ఇదే క్రమంలో జిల్లా పరిషత్‌కు వచ్చే 13వ ఆర్థిక కమిషన్ నిధుల ద్వారా సమగ్ర రక్షిత మంచినీటి పథకం(సీపీడబ్ల్యు)ను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సీపీడబ్ల్యు స్కీమ్ నిర్వహణకు గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను ఇవ్వాలని గత జూన్ 4వ తేదీన అప్పటి కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
సీపీడబ్ల్యు స్కీమ్‌లు ఉన్న 405 గ్రామ పంచాయతీల నుంచి కర్నూలు డివిజన్‌లో 122 గ్రామపంచాయతీల నుంచి రూ.1,33,33,632లు, నంద్యాల డివిజన్‌లో 111 గ్రామపంచాయతీల నుంచి రూ.96,82,937లు, ఆదోని డివిజన్‌లో 172 గ్రామపంచాయతీల నుంచి రూ.1,74,68,598లు కలిపి మొత్తం రూ.4,48,51,167లను ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇకి డీడీ ద్వారా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సీపీడబ్ల్యు నిధులేమయ్యాయి...!
సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా పరిషత్‌లదే. ఈ మేరకు 13వ ఆర్థిక కమిషన్ నిధులను గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులతో సీపీడబ్ల్యు స్కీమ్ కింద ఆయా గ్రామాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే జిల్లా పరిషత్ అధికారులు మాత్రం సీపీడబ్ల్యు స్కీమ్ నిధులను గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తాగునీటి అవసరాలకు గాకుండా రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కప్పి పుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, జిల్లాలో ఎన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీలకు వచ్చిన నిధులను ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈకి డీడీ ద్వారా చెల్లించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం తీవ్రస్థాయి విమర్శలకు తావిస్తోంది. 40 శాతం గ్రామపంచాయతీ నిధులు ఆర్‌డబ్ల్యుఎస్‌కు మళ్లించడం వల్ల గ్రామాల్లో ఇతర కార్యక్రమాల నిర్వహణ కష్టమవుతుందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు, హక్కులను సంరక్షించుకునేందుకు వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
నిధుల ‘పంచాయితీ’
Published Mon, Aug 25 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
Advertisement
Advertisement