Gram Panchayat funds
-
పంచాయతీలకు ప్రతినెలా నిధులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లిస్తున్నారంటూ విపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పంచాయ తీలకు ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నా మని తెలిపారు. కేంద్రం దయాదాక్షిణ్యంగా ఏ విధమైన నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్రం హక్కుగానే నిధులు ఇస్తోందని చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులకు సమానంగా రాష్ట్రమూ నిధులిస్తోందన్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై చేతనైతే సుదీర్ఘ చర్చకు రావాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. ఖర్చు చేసే ప్రతి పైసకు లెక్క చెబుతామన్నారు. రాష్ట్రం లో గ్రామ పంచాయతీల పురోగతిని కేంద్రమే ప్రశంసించిందని ఆయన గుర్తుచేశారు. శాసన సభలో కాంగ్రెస్ పక్ష సభ్యులు సీతక్క, డి.శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ప్రభృతులు నిధుల మళ్లింపు అంశాన్ని ప్రస్తావించారు. మంత్రి ఎర్రబెల్లి వారికి సమాధానం చెప్పారు. అనంతరం సీతక్క అనుబంధ ప్రశ్న వేశారు. నిధుల వివరాలు చెప్పండి గ్రామ పంచాయతీలకు కేంద్రం ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, దీనివల్ల అనేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని సీతక్క అన్నారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో మానసిక ఆవేదన చెందిన సర్పంచ్‌లు పలు చోట్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన పనులు చేయలేదని కలెక్టర్లు, డీపీవోలు వారిని అవమానిస్తున్నారని ఆమె సభ దృష్టికి తెచ్చారు. గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులెంతో చెప్పాలని నిలదీశారు. ఈ నిధులు గ్రామాభివృద్ధికి సరిపోతున్నాయో లేదో తెలపాలన్నారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ వల్ల వచ్చే నిధులు సరిగా పంచాయతీలకు అందడం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వ ఉపాధి హామీ పథకం ద్వారా ఏడేళ్ల నుంచి రాష్ట్రానికి రూ. 15 వేల కోట్ల నిధులు వచ్చాయని, వీటిని దారి మళ్ళించింది వాస్తవమా కాదా తెలపాలని భట్టి అన్నారు. సమన్యాయం ప్రభుత్వ విధానం : కేసీఆర్ కొన్ని పంచాయతీల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుందని, మరికొన్ని పంచాయతీలకు ఏమాత్రం ఆదాయం ఉండదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్ హయాంలో తలసరి నిధుల కేటాయింపు కేవలం రూ.4 మాత్రమే ఉంటే, ఇప్పుడు తాము రూ.654 పైచిలుకు ఇస్తు న్నామని తెలిపారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. వాస్త వాలు వక్రీకరించడం కాంగ్రెస్ సభ్యులకు తగదన్నారు. తెలంగాణ గ్రామాలను ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినవారు పులకించి పోతున్నారని, ఇది కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. కరోనా సమయంలోనూ పంచాయతీల నిధులు ఆపొద్దని తాను ఆదేశించినట్టు తెలిపారు. -
గ్రామ నిర్ణయం మేరకే.. పంచాయతీ నిధుల ఖర్చు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల నిధులను అక్కడి ప్రజలు, పంచాయతీల నిర్ణయం మేరకే ఖర్చు చేసుకునేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మొత్తం 142 మున్సిపాలిటీలు, పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్, పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. మహిళలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల మీదుగా ఉన్న విద్యుత్ లైన్లను ప్రభుత్వ ఖర్చుతోనే మార్చాలని ట్రాన్స్‌కో సీఎండీని ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్లో పలువురు ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం మాట్లాడారు. స్థానిక సంస్థల సాధికారతపై దృష్టి పెట్టామని, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచించారు. ట్రాఫిక్, మహిళా పోలీసు విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఆర్అండ్ బీ, ఇరిగేషన్ , హోం, పంచాయతీరాజ్ తదితర శాఖలకు సంబంధించి.. పలు పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులను మంజూరు చేస్తూ సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణం, పలు పట్టణాల్లో రోడ్ల వెడల్పు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు, నదులు, వాగుల మీద అవసరమైన చోట చెక్ డ్యాంల నిర్మాణం వంటివి చేపట్టాలని ఆదేశించారు. యాసంగి పంటలకు నీళ్లు... కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. కొల్లాపూర్, పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలో యాసంగి పంటలకు నీరందించాలని ఆయా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సుంకె రవిశంకర్, హర్షవర్ధన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, గంపా గోవర్దన్, అబ్రహం, సంజయ్ కుమార్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాలె యాదయ్య, హన్మంత్ షిండే, పట్నం నరేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రసమయి బాలకిషన్, జైపాల్ యాదవ్, సండ్ర వెంకటవీరయ్య, కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిధుల ‘పంచాయితీ’
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో గ్రామపంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి. వీటిని ఆర్‌డబ్ల్యుఎస్‌కు మళ్లించాలని గత కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం వివాదస్పదమైంది. ఇది పంచాయతీలకు ఉన్న హక్కులను కాలరాయడమేనని సర్పంచులు విమర్శిస్తున్నారు. జిల్లాలోని 889 గ్రామపంచాయతీలకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 13వ ఆర్థిక కమిషన్ నిధులు రూ.25కోట్లకు పైగా విడుదలయ్యాయి. వీటితో గ్రామంలోని తాగునీటి పథకాల నిర్వహణ, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధిలైట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామపంచాయతీ భవనాల నిర్వహణ, ఈ-పంచాయతీ, అంగన్వాడీ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలల నిర్వహణకు వినియోగించాల్సి ఉంది. ఇదే క్రమంలో జిల్లా పరిషత్‌కు వచ్చే 13వ ఆర్థిక కమిషన్ నిధుల ద్వారా సమగ్ర రక్షిత మంచినీటి పథకం(సీపీడబ్ల్యు)ను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సీపీడబ్ల్యు స్కీమ్ నిర్వహణకు గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను ఇవ్వాలని గత జూన్ 4వ తేదీన అప్పటి కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీపీడబ్ల్యు స్కీమ్‌లు ఉన్న 405 గ్రామ పంచాయతీల నుంచి కర్నూలు డివిజన్లో 122 గ్రామపంచాయతీల నుంచి రూ.1,33,33,632లు, నంద్యాల డివిజన్లో 111 గ్రామపంచాయతీల నుంచి రూ.96,82,937లు, ఆదోని డివిజన్లో 172 గ్రామపంచాయతీల నుంచి రూ.1,74,68,598లు కలిపి మొత్తం రూ.4,48,51,167లను ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇకి డీడీ ద్వారా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీపీడబ్ల్యు నిధులేమయ్యాయి...! సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా పరిషత్లదే. ఈ మేరకు 13వ ఆర్థిక కమిషన్ నిధులను గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులతో సీపీడబ్ల్యు స్కీమ్ కింద ఆయా గ్రామాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే జిల్లా పరిషత్ అధికారులు మాత్రం సీపీడబ్ల్యు స్కీమ్ నిధులను గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తాగునీటి అవసరాలకు గాకుండా రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కప్పి పుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, జిల్లాలో ఎన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీలకు వచ్చిన నిధులను ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈకి డీడీ ద్వారా చెల్లించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం తీవ్రస్థాయి విమర్శలకు తావిస్తోంది. 40 శాతం గ్రామపంచాయతీ నిధులు ఆర్‌డబ్ల్యుఎస్‌కు మళ్లించడం వల్ల గ్రామాల్లో ఇతర కార్యక్రమాల నిర్వహణ కష్టమవుతుందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు, హక్కులను సంరక్షించుకునేందుకు వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.