బకాయిలు కట్టాల్సిందే! | Notices bills call for panchayats | Sakshi
Sakshi News home page

బకాయిలు కట్టాల్సిందే!

Published Mon, Feb 9 2015 11:37 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

బకాయిలు కట్టాల్సిందే! - Sakshi

బకాయిలు కట్టాల్సిందే!

- ఆర్‌డబ్ల్యూఎస్‌పై హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఒత్తిడి
- రూ.20 కోట్లు పేరుకు పోయినట్లు నోటీసులు
- తలలుపట్టుకుంటున్న గ్రామీణ నీటి సరఫరా అధికారులు  
- బిల్లులు కట్టాలని పంచాయతీలకు నోటీసులు

యాచారం: నీటి బిల్లుల బకాయిల కథ మళ్లీ మొదటికొచ్చింది. వెంటనే బిల్లులు చెల్లించాలంటూ గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్)పై హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్) ఒత్తిడి తెస్తోంది. కొన్నేళ్లుగా కృష్ణా జలాలు వాడుకుంటున్నందుకు రూ.20 కోట్ల బకాయిల్ని తక్షణమే చెల్లించాలని నోటీసులు పంపించింది. లేకుంటే నీటి సరఫరా కష్టమని తేల్చిచెప్పింది. దీంతో వేసవిలో తాగునీరు ఎలా అందించాలో తెలియక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల్లో ఆందోళన మొదలైంది.

యాచారం మం డలం గునుగల్ కృష్ణా జలాల రిజర్వాయర్ నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని 4 మండలాలు, మహేశ్వరం మండలంలోని గ్రామాలకు తాగునీరు  సరఫరా చేస్తున్నారు. హయత్‌నగర్ మండలంలోని ప్రజలు తాగునీటి బిల్లులు ప్రతి నెలా చెల్లిస్తుండడంతో ఆ మండలంలో ఇబ్బంది ఉండడం లేదు. కానీ ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, కందుకూరు మండలాల్లో 134 గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేస్తున్నందుకు గాను పంచాయతీలు బిల్లులు చెల్లించడంలేదు. గునుగల్ రిజర్వాయర్ నుంచి నాలుగు మండలాలకు నిత్యం 70 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటున్నారు.
 
ప్రతి నెల  రూ.20 లక్షలు చెల్లిస్తున్నా..
గునుగల్ రిజర్వాయర్‌లోంచి 2007 నుంచి డివిజన్‌లోని పలు గ్రామాలకు హెచ్‌ఎండబ్ల్యూఎస్ కృష్ణా జలాలను సరఫరా చేస్తోంది. ప్రారంభం నుంచే నీటి సరఫరా విషయంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్, ఆర్‌డబ్ల్యూఎస్‌ల మధ్య నీటి సరఫరా విషయమై ఒప్పందం కుదరడంలేదు. నాలుగు మండలాల్లో దాదాపు 2 లక్షల జనాభా ఉంది. ప్రారంభంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్, ఆర్‌డబ్ల్యూఎస్‌తో కేవలం 44 లక్షల లీటర్ల నీటికే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 1,000 లీటర్లకు ఆర్‌డబ్ల్యూఎస్ కేవలం రూ. 10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా 30 నుంచి 40 లక్షల లీటర్ల నీరు వాడుకుంటున్నందువల్ల హెచ్‌ఎండబ్ల్యూఎస్ 1,000 లీటర్ల నీటికి రూ.40 లెక్కగడుతోంది.

ఆర్‌డబ్ల్యూఎస్ ప్రతి నెల నీటి బకాయిల కింద హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు రూ.20 లక్షలకుపైగా చెల్లిస్తోంది. అయినా  హెచ్‌ఎండబ్ల్యూఎస్ వడ్డీలు, చక్రవడ్డీలు లెక్కకట్టి ఇప్పటికి రూ.20 కోట్ల బకాయిలున్నట్లు నోటీసులు పంపించింది.  నీటి ఎద్దడి తీర్చే విషయంలో సరఫరా శాతం పెంచాలని ఆర్‌డబ్ల్యూఎస్.. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ను అడిగిన ప్రతిసారీ.. ముందు బకాయిలు చెల్లించాలని అంటోంది. నీటి ఎద్దడి ఏర్పడిన ప్రతిసారి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవ తీసుకుని నీటి సరఫరాను పెంచేలా కృషి చేస్తున్నారు. నీటి ఒప్పందం విషయంలో శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అంటున్నారు.  
 
పంచాయతీలకు నోటీసులు
కొద్ది రోజులుగా పట్నం డివిజన్‌లోని ఆయా మండలాల ప్రజలు నీటి బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నెల రోజుల వ్యవధిలోనే రూ.20 లక్షలకు పైగా బిల్లులు వసూలయ్యాయి. కానీ పంచాయతీలు మాత్రం ఆర్‌డబ్ల్యూఎస్‌కు పైసా బిల్లు చెల్లించడం లేదు. వసూలయ్యే బిల్లులను పంచాయతీలు నేరుగా ఎస్‌టీఓల్లో జమ చేసి వివిధ ఖర్చుల నిమిత్తం రెండు మూడ్రోజుల్లోనే వాటిని డ్రా చేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పంచాయతీలు నీటి బిల్లులు కచ్చితంగా చెల్లించాలని ఒత్తిడి తెచ్చేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం డివిజన్ డీఈఈ వాటికి నోటీసులు పంపించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్త దృష్ట్యా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి త్వరలో హెచ్‌ఎండబ్ల్యూఎస్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement