HMWS
-
బుక్ చేసిన 48 గంటల్లో వాటర్ ట్యాంకర్
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంకర్ నీళ్లకోసం గ్రేటర్ సిటీజనులు ఇక కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే అవస్థలు తీరనున్నాయి. ఇక నుంచి బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారులకు ట్యాంకర్ నీళ్లు సరఫరా చేయాలని జలమండలి నిర్ణయించింది. గ్రేటర్‌వాసులకు ఈ వేసవిలో క‘న్నీటి’ కష్టాలు తీర్చేందుకు రూ.50 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక–2020 సిద్ధంచేసింది. నగరంలో మంచినీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని, అవసరం మేరకు మంచినీరు సరఫరా చేస్తామని జలమండలి భరోసానిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ వేసవి కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో డిమాండ్‌కు అనుగుణంగా నీటి సరఫరా చేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వెయ్యి ట్యాంకర్లకు తోడు అదనంగా మరో 230 అదనపు ట్యాంకర్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నగరంలో అందుబాటులో ఉన్న 110 ట్యాంకర్ నీటి ఫిల్లింగ్ పాయింట్లకు అదనంగా మరో 23 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. విద్యుత్ కోతలు అధికంగాఉండే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద మినీ జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పర్యవేక్షణకు పదిమంది ప్రత్యేకాధికారులు ఈ వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరా పర్యవేక్షణకు 10 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు ఎండీ తెలిపారు. వీరు ప్రతిరోజూ ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి, మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే అక్కడికక్కడే నల్లాలు, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. సమస్యత్మాక ప్రాంతాల్లో జరుగుతున్న మంచినీటి సరఫరా, లోప్రెజర్, ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడానికి 100 మందితో థర్డ్ పార్టీ తనిఖీలు చేపడతామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నీటి సమస్య అధికంగా ఉండే లోప్రెషర్, టేల్ ఎండ్ ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్ వెల్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదో తనిఖీ చేయాలని సూచించారు. తక్షణం వాటికి రిపేర్లు పూర్తిచేయాలని అదేశించారు. సమస్యత్మాక ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న స్టాటిక్ ట్యాంకులకు మరమ్మతులు చేయాలని, అవసరం ఉన్న చోట నూతనంగా స్టాటిక్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలుషిత జలాల సరఫరా, నీరు వృథాగా పోతున్న ప్రాంతాలను గుర్తించి, సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైన చోట వాల్వులు, జంక్షన్ల పనులు పూర్తి చేయాలని ఎండీ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా బోర్లు, ట్యాంకుల మరమ్మతు పనులు పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, టెక్నికల్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్‌లతో పాటు సంబంధిత సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు. -
అక్రమ నల్లాలపై కదులుతున్న డొంక!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల తీగ లాగితే డొంక కదులుతోంది .నగర పరిధిలో వేలాదిగా ఉన్న ఆక్రమ నల్లాల భరతం పట్టేందుకు జలమండలి చేపట్టిన ఇంటింటి సర్వే సత్ఫలితాన్నిస్తోంది. ఇప్పటి వరకు 6 నిర్వహణ డివిజన్ల పరిధిలో చేపట్టిన సర్వేలో 1600 అక్రమ నల్లాల భాగోతం బయటపడింది. మరో ఆరువేల నల్లా కనెక్షన్ల కేటగిరి మార్పుతో జలమండలికి అదనపు ఆదాయం సమకూరింది. అక్రమ నల్లాలను వీడీఎస్ పథకం కింద క్రమబద్ధీకరించడం, జరిమానాలు, నల్లా కనెక్షన్ ఛార్జీల రూపంలో బోర్డుకు రూ.11.66 కోట్ల ఆదాయం లభించింది. నెలవారీగా మరో రూ.33.30 లక్షల అదనపు ఆదాయం నల్లా బిల్లుల ద్వారా సమకూరుతోంది. ఇంటింటి సర్వే ప్రక్రియను మరో 14 నిర్వహణ డివిజన్ల పరిధిలో కొనసాగించడం ద్వారా జలమండలి రెవెన్యూ ఆదాయాన్ని గణనీయం గా పెంచాలని బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం విశేషం. ఈ సర్వే ద్వారా మహా నగరం పరిధిలో ఉ న్న సుమారు 50 వేల అక్రమ నల్లాల బండారం బయటపడుతుందని బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటి లెక్క తేలితే జలమండలికి ఆర్థిక కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. ఇంటింటి సర్వే ఫలితాలు ఇలా.. జలమండలి రెవెన్యూ సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సిబ్బంది ఇంటింటికి వెళ్లి..ప్రస్తుతం ఆయా భవనాలకున్న నల్లా కనెక్షన్ వివరాలు, బోర్డు రికార్డులో ఉన్న వివరాలతో సరి పోలుతున్నాయో లేదో చెక్ చేస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల ఇంటి నిర్మాణ వైశాల్యం, అంతస్తులు, నెలవారీగా వారు చెల్లిస్తున్న నీటి బిల్లు...నీటి పరిమాణం..తదితర వివరాలను సేకరిస్తున్నారు. ఈ సిబ్బంది సేకరించిన వివరాలను..బోర్డు విజిలెన్స్ సిబ్బంది తిరిగి తనిఖీ చేస్తున్నారు. కనెక్షన్ కేటగిరిలో మార్పులు గుర్తిస్తే..వెంటనే మార్పులు చేర్పులు చేస్తున్నారు. అక్రమ నల్లాలను గుర్తిస్తే..వీడీఎస్ పథకం కింద క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తున్నారు. నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం... రూకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న జలమండలిని గట్టెక్కించేందుకు, రెవెన్యూ ఆదాయం పెంపుపై బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం నెలకు లభిస్తున్న రూ.120 కోట్ల ఆదాయంలో సింహభాగం..సుమారు రూ.75 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లిస్తోంది. మిగతా మొత్తం నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలకు అరకొరగా సరిపోతోంది. ప్రస్తుతం నెలకు సుమారు రూ.30 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఇంటింటి సర్వేతో ఇప్పటి వరకు రూ.11.66 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. నెలవారీగా నల్లా బిల్లుల రూపేణా అదనంగా రూ.33.30 లక్షల ఆదాయం లభిస్తోంది. -
ఫ్రీ ట్యాంకర్ కట్!
సాక్షి,సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటి సరఫరానుజీహెచ్‌ఎంసీ డిసెంబర్ 31 నుంచినిలిపివేయనుంది. శివార్లలోని ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్పల్లి,మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, కాప్రా, పటాన్చెరు తదితర సర్కిళ్ల పరిధిలో జీహెచ్ఎంసీ రోజుకు దాదాపు 350 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. జలమండలి ద్వారా ట్యాంకర్లను పంపిస్తూ వ్యయాన్ని జీహెచ్ఎంసీ భరిస్తోంది. గతంలో శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా లైన్లు లేనప్పుడు అమల్లోకి తెచ్చిన ఈ విధానం.. అక్కడ నీటి సరఫరా లైన్లు వచ్చాక కూడా నీటి సరఫరా సదుపాయం లేని కొన్ని ప్రాంతాలు, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు,మురికివాడల్లోని ప్రజల అవసరాలు తీర్చేందుకు కొనసాగిస్తున్నారు. ఖర్చు జీహెచ్ఎంసీ భరిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అయితే, వీటిలో చాలా వరకు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒకరి పేరు చెప్పి, మరొకరికి విక్రయించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఉచిత సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జీహెచ్ఎంసీ, జలమండలి సెప్టెంబర్‌లోనే నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచే ఉచిత ట్యాంకర్లను నిలిపివేయాలనుకున్నా స్థానిక కార్పొరేటర్ల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో, ముందస్తు సమాచారం లేకుండా వెంటనే ఎలా నిలిపివేస్తారనే ప్రశ్నలతో మూడు నెలలు గడువిచ్చి, ఈ నెలాఖరుకు నిలిపివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ జలమండలి ఎండీ దానకిశోర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం శివారు ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు వరకు జలమండలి నీటిని సరఫరా చేస్తోంది. ఎక్కడైనా సరఫరా జరగని ప్రాంతాలుంటే ట్యాంకర్ల ద్వారా సరఫరా బాధ్యతల్ని సైతం జలమండలే చూసుకుంటుందని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ స్పష్టం చేశారు. ‘‘ఉచిత ట్యాంకర్ల పేరిట నిధులను స్థానిక కార్పొరేటర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉచిత ట్యాంకర్ల నీటిని హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు తదితర వ్యాపార సంస్థలకు విక్రయించుకుంటున్నారని, తిరగని ట్రిప్పులకు కూడా బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జలమండలి దాదాపు రూ.1900 కోట్ల భారీ నిధులతో పూర్తి చేసిన ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటైందని, స్లమ్స్, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, సరఫరా లేని ప్రాంతాల పేరిట నెలనెలా నిధులు కొల్లగొడుతున్నారనే ఆరోపణలతో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.’’ -
బకాయిలు కట్టాల్సిందే!
- ఆర్‌డబ్ల్యూఎస్‌పై హెచ్ఎండబ్ల్యూఎస్ ఒత్తిడి - రూ.20 కోట్లు పేరుకు పోయినట్లు నోటీసులు - తలలుపట్టుకుంటున్న గ్రామీణ నీటి సరఫరా అధికారులు - బిల్లులు కట్టాలని పంచాయతీలకు నోటీసులు యాచారం: నీటి బిల్లుల బకాయిల కథ మళ్లీ మొదటికొచ్చింది. వెంటనే బిల్లులు చెల్లించాలంటూ గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్)పై హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్) ఒత్తిడి తెస్తోంది. కొన్నేళ్లుగా కృష్ణా జలాలు వాడుకుంటున్నందుకు రూ.20 కోట్ల బకాయిల్ని తక్షణమే చెల్లించాలని నోటీసులు పంపించింది. లేకుంటే నీటి సరఫరా కష్టమని తేల్చిచెప్పింది. దీంతో వేసవిలో తాగునీరు ఎలా అందించాలో తెలియక ఆర్డబ్ల్యూఎస్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. యాచారం మం డలం గునుగల్ కృష్ణా జలాల రిజర్వాయర్ నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని 4 మండలాలు, మహేశ్వరం మండలంలోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. హయత్‌నగర్ మండలంలోని ప్రజలు తాగునీటి బిల్లులు ప్రతి నెలా చెల్లిస్తుండడంతో ఆ మండలంలో ఇబ్బంది ఉండడం లేదు. కానీ ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, కందుకూరు మండలాల్లో 134 గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేస్తున్నందుకు గాను పంచాయతీలు బిల్లులు చెల్లించడంలేదు. గునుగల్ రిజర్వాయర్ నుంచి నాలుగు మండలాలకు నిత్యం 70 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటున్నారు. ప్రతి నెల రూ.20 లక్షలు చెల్లిస్తున్నా.. గునుగల్ రిజర్వాయర్లోంచి 2007 నుంచి డివిజన్లోని పలు గ్రామాలకు హెచ్ఎండబ్ల్యూఎస్ కృష్ణా జలాలను సరఫరా చేస్తోంది. ప్రారంభం నుంచే నీటి సరఫరా విషయంలో హెచ్ఎండబ్ల్యూఎస్, ఆర్‌డబ్ల్యూఎస్‌ల మధ్య నీటి సరఫరా విషయమై ఒప్పందం కుదరడంలేదు. నాలుగు మండలాల్లో దాదాపు 2 లక్షల జనాభా ఉంది. ప్రారంభంలో హెచ్ఎండబ్ల్యూఎస్, ఆర్‌డబ్ల్యూఎస్‌తో కేవలం 44 లక్షల లీటర్ల నీటికే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 1,000 లీటర్లకు ఆర్డబ్ల్యూఎస్ కేవలం రూ. 10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా 30 నుంచి 40 లక్షల లీటర్ల నీరు వాడుకుంటున్నందువల్ల హెచ్ఎండబ్ల్యూఎస్ 1,000 లీటర్ల నీటికి రూ.40 లెక్కగడుతోంది. ఆర్డబ్ల్యూఎస్ ప్రతి నెల నీటి బకాయిల కింద హెచ్ఎండబ్ల్యూఎస్కు రూ.20 లక్షలకుపైగా చెల్లిస్తోంది. అయినా హెచ్ఎండబ్ల్యూఎస్ వడ్డీలు, చక్రవడ్డీలు లెక్కకట్టి ఇప్పటికి రూ.20 కోట్ల బకాయిలున్నట్లు నోటీసులు పంపించింది. నీటి ఎద్దడి తీర్చే విషయంలో సరఫరా శాతం పెంచాలని ఆర్డబ్ల్యూఎస్.. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ను అడిగిన ప్రతిసారీ.. ముందు బకాయిలు చెల్లించాలని అంటోంది. నీటి ఎద్దడి ఏర్పడిన ప్రతిసారి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవ తీసుకుని నీటి సరఫరాను పెంచేలా కృషి చేస్తున్నారు. నీటి ఒప్పందం విషయంలో శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంటున్నారు. పంచాయతీలకు నోటీసులు కొద్ది రోజులుగా పట్నం డివిజన్లోని ఆయా మండలాల ప్రజలు నీటి బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నెల రోజుల వ్యవధిలోనే రూ.20 లక్షలకు పైగా బిల్లులు వసూలయ్యాయి. కానీ పంచాయతీలు మాత్రం ఆర్‌డబ్ల్యూఎస్‌కు పైసా బిల్లు చెల్లించడం లేదు. వసూలయ్యే బిల్లులను పంచాయతీలు నేరుగా ఎస్టీఓల్లో జమ చేసి వివిధ ఖర్చుల నిమిత్తం రెండు మూడ్రోజుల్లోనే వాటిని డ్రా చేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పంచాయతీలు నీటి బిల్లులు కచ్చితంగా చెల్లించాలని ఒత్తిడి తెచ్చేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం డివిజన్ డీఈఈ వాటికి నోటీసులు పంపించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్త దృష్ట్యా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి త్వరలో హెచ్ఎండబ్ల్యూఎస్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.