సాక్షి, సిటీబ్యూరో: ట్యాంకర్ నీళ్లకోసం గ్రేటర్ సిటీజనులు ఇక కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే అవస్థలు తీరనున్నాయి. ఇక నుంచి బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారులకు ట్యాంకర్ నీళ్లు సరఫరా చేయాలని జలమండలి నిర్ణయించింది. గ్రేటర్‌వాసులకు ఈ వేసవిలో క‘న్నీటి’ కష్టాలు తీర్చేందుకు రూ.50 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక–2020 సిద్ధంచేసింది. నగరంలో మంచినీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని, అవసరం మేరకు మంచినీరు సరఫరా చేస్తామని జలమండలి భరోసానిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ వేసవి కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో డిమాండ్‌కు అనుగుణంగా నీటి సరఫరా చేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వెయ్యి ట్యాంకర్లకు తోడు అదనంగా మరో 230 అదనపు ట్యాంకర్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నగరంలో అందుబాటులో ఉన్న 110 ట్యాంకర్ నీటి ఫిల్లింగ్ పాయింట్లకు అదనంగా మరో 23 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. విద్యుత్ కోతలు అధికంగాఉండే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద మినీ జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
పర్యవేక్షణకు పదిమంది ప్రత్యేకాధికారులు
ఈ వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరా పర్యవేక్షణకు 10 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు ఎండీ తెలిపారు. వీరు ప్రతిరోజూ ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి, మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే అక్కడికక్కడే నల్లాలు, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. సమస్యత్మాక ప్రాంతాల్లో జరుగుతున్న మంచినీటి సరఫరా, లోప్రెజర్, ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడానికి 100 మందితో థర్డ్ పార్టీ తనిఖీలు చేపడతామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నీటి సమస్య అధికంగా ఉండే లోప్రెషర్, టేల్ ఎండ్ ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్ వెల్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదో తనిఖీ చేయాలని సూచించారు. తక్షణం వాటికి రిపేర్లు పూర్తిచేయాలని అదేశించారు. సమస్యత్మాక ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న స్టాటిక్ ట్యాంకులకు మరమ్మతులు చేయాలని, అవసరం ఉన్న చోట నూతనంగా స్టాటిక్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలుషిత జలాల సరఫరా, నీరు వృథాగా పోతున్న ప్రాంతాలను గుర్తించి, సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైన చోట వాల్వులు, జంక్షన్ల పనులు పూర్తి చేయాలని ఎండీ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా బోర్లు, ట్యాంకుల మరమ్మతు పనులు పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, టెక్నికల్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్‌లతో పాటు సంబంధిత సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment