సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో సైతం డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా విభాగానికే (ఆర్‌డబ్ల్యూఎస్) అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రిడ్ నిర్మాణ బాధ్యతల నుంచి ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగాన్ని తప్పించాలని కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సొంత నియోజకవర్గ కేంద్రమైన ‘గజ్వేల్’ పట్టణంలో గ్రిడ్ నిర్మాణ పనులను ఆర్‌డబ్ల్యూఎస్‌కే అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం చర్చకు దారితీసింది. వాటర్ గ్రిడ్ పనులపై ఆయన సోమవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి కె.తారకరామారావు, ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్ రెడ్డితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తోంది. ప్రపంచ బ్యాంక్ రుణం రూ.60 కోట్లతో గజ్వేల్‌లో పథకం పనులను ఆర్‌డబ్ల్యూఎస్ నిర్వహిస్తుండగా.. వాటర్ గ్రిడ్ పనుల్నీ అదే విభాగానికి అప్పగించాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆర్‌డబ్ల్యూఎస్‌తో పోల్చితే ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ముందుంది. కానీ దాన్ని శివార్లలోని ఆర్‌డబ్ల్యూఎస్ పైప్‌లైన్‌ల నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి ఇంటింటికి సరఫరా చేయడం వరకే పరిమితం చేశారు. తాజా సమాచారంతో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వా(ట)ర్ గ్రిడ్
Published Wed, Jul 1 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM
Advertisement