కూసుమంచి : రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న వాటర్‌గ్రిడ్ (జలాజలం) పథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదన లు పంపుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పాలేరులో విలేకరులతో మాట్లాడారు. పాలేరు, వైరా రిజర్వాయర్‌లతో పాటు గోదావరి నీటిని వినియోగించి జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి ప్రణాళిక అందజేసినట్లు పేర్కొన్నారు.
పాలేరు రిజర్వాయర్ పరిధిలోని కూసుమంచి, నేలకొండపపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్భన్ మండలాలతో పాటు ఖమ్మం నగరానికి, ముదిగొండ మండలంలోని కొన్ని గ్రామాలకు 1.48 టీఎంసీల పాలేరు నీటిని సరఫరా చేస్తామన్నారు. ఖమ్మం నగరానికి మాత్రం శుద్ధిచేయని జలాలను, మిగిలిన మండలాలకు శుద్ధి చేసిన జలాలను సరఫరా చేస్తామన్నారు.
వైరా రిజర్వాయర్ సెగ్మెంట్ పరిధిలో వైరా, కొణిజర్ల, బోనక ల్, ఎర్రుపాలెం, మధిర, తల్లాడ, సత్తుపల్లి, కొత్తగూడెం, వేంసూరు,పెనుబల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు, నగర పంచాయతీలకు తాగునీరు సరఫరా చేస్తామని వివరించారు. ఇందుకోసం 1.13 టీఎంసీల నీటిని వినియోగించనున్నట్లు తెలిపారు. మిగిలిన మండలాలకు అశ్వాపురం సమీపంలోని పాములపల్లి నుంచి గోదావరి జలాలను తరలిస్తామని చెప్పారు.
పాలేరు గ్రిడ్ ద్వారా 365, వైరా గ్రిడ్ ద్వారా 565 హ్యాబిటేషన్లకు రక్షిత నీరు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీటిని సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వచ్చే వేసవి నాటికి ఆయా రిజర్వాయర్‌లలో ఇన్‌టెక్ వెల్ (బావులు) నిర్మాణ పనులు 50 శాతం మేర అయినా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
రిజర్వాయర్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు...
పాలేరు రిజర్వాయర్‌ను సోమవారం వాటర్‌గ్రిడ్ చీఫ్ టెక్నికల్ కో ఆర్డినేటర్ సత్యపాల్‌రెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎస్‌ఈలు జగన్మోహన్‌రెడ్డి, సురేష్‌కుమార్ పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ మ్యాపులను, రిజర్వాయర్‌లో నిర్మించనున్న ఇన్‌టెక్‌వెల్ స్థలాన్ని చూసి, పలు అంశాలపై చర్చించారు. వారివెంట ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మల్లేషం గౌడ్, డీఈఈ మాణిక్యాలరావు, ఏఈ మురళీకృష్ణ ఉన్నారు.
రూ.4 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌కు ప్రతిపాదనలు
Published Tue, Jan 6 2015 4:56 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement