Viera reservoirs
-
కేటీఆర్ మార్క్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన తొలి పర్యటనలోనే పాలనాపరమైన మార్క్వేసే ప్రయత్నం చేశారు. జిల్లాలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన సమీక్ష నిర్వహించారు.పలువురు అధికారులకు శాఖాపరమైన అంశాలపై ప్రశ్నలు సంధించారు. ప్రతి అంశంపై కేటీఆర్ సమగ్ర అవగాహనతో వేస్తున్న ప్రశ్నలతో కొందరు జిల్లా అధికారులు కంగుతిన్నారు. సమాధానం చెప్పడానికి ఒకింత తడుముకోవాల్సి వచ్చింది. జిల్లాలో అభివృద్ధి పనులు మరింత శరవేగంగా కొనసాగాలని, శాఖల మధ్య సమన్వయ లోపం తలెత్తరాదని, త్వరలో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్న దృష్ట్యా ప్రగతి నివేదికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అపూర్వ స్వాగతం ఉదయం 11 గంటలకు జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ నాయకులు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఘనస్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ వాహనంలో హైదరాబాద్ నుంచి పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు, ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. తొలిసారిగా ఖమ్మం వచ్చిన మంత్రి కేటీఆర్‌కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నాయకన్‌గూడెంకు చేరుకున్న మంత్రికి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఖమ్మం నగరంలో మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఆహ్వానించారు. నాయకన్‌గూడెం వద్ద కేటీఆర్‌కు స్వాగతం పలకడానికి వచ్చిన నేతల్లో ముఖ్యులను పక్కనే ఉన్న జలగం వెంకటరావు, కేటీఆర్‌కు పరిచయం చేశారు. పాలేరు రిజర్వాయర్ వద్ద వాటర్‌గ్రిడ్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్ పరిశీలించారు. మంత్రి కేటీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం భారీ మోటారు సైకిల్ ర్యాలీతో ఖమ్మం చేరుకున్నారు. వరంగల్క్రాస్ రోడ్డు వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నగరంలో నాలుగు రహదారుల నిర్మాణ పనులకు జిల్లా పరిషత్ వద్ద, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద ఇల్లెందు వైపు నాలుగులైన్ల రహదారి విస్తరణకు శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటాయపాలెంలో టీఆర్ఎస్ పతాకాన్ని కేటీఆర్ ఎగురవేశారు. కొణిజర్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. వైరా ప్రధాన రహదారిలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాకోర్టులో ఓడిపోయి కోర్టులో దావాలా..! వైరాలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాకోర్టులో ఓడిపోయి తమపై కోర్టుల్లో దావాలు వేస్తామనడం హాస్యాస్పదమన్నారు. మంత్రి అక్కడి నుంచి వైరా రిజర్వాయర్‌కు చేరుకుని వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు బయోమెట్రిక్ విధానం ద్వారా డబ్బులను ఏ విధంగా చెల్లిస్తారో డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి ప్రయోగాత్మకంగా వివరించారు. ఉపాధి హామీద్వారా పని చేసిన నేలకొండపల్లికి చెందిన నలుగురు కూలీలకు ఈ బయోమెట్రిక్ విధానం ద్వారా కేటీఆర్ సమక్షంలో డబ్బు చెల్లించారు. వీరికి బ్యాంకుమిత్ర ఏటీఎం కార్డులను కేటీఆర్ అందజేశారు. సమీక్షసమావేశంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ గురువారం నాటి పర్యటనలో ఏర్పాటు చేయకపోవడంపై ఆశాఖ ఎస్ఈని ప్రశ్నించారు. జిల్లాకు వస్తున్న సమయంలో సంబంధిత శాఖా మంత్రిగా మంజూరైన పనులకు శంకుస్థాపన చేస్తే బాగుండేది కదా! అని ఎస్ఈని ప్రశ్నించారు. వాటర్‌గ్రిడ్ పనులకు ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారుల మధ్య పూర్తిస్థాయి సమన్వయం అవసరమని, క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో చేయాల్సిన పనులపై సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, శాసనసభ్యులు కోరం కనకయ్య, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం
కూసుమంచి: జిల్లాలో వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణంలో భాగంగా పాలేరు, వైరా రిజర్వాయర్లు పరిశీలించేందుకు గురువారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుం ట్ల తారక రామారావు(కేటీఆర్)కు నాయకన్‌గూడెంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్‌ను జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ఇలంబరితి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జడ్పీ చైర్పర్సన్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ సాదరంగా స్వాగతించారు. పార్టీ పాలేరు ఇన్చార్జి బత్తుల సోమయ్య గజమాలతో సత్కరించారు. ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, పీఆర్ ఎస్ఈ గంగిరెడ్డి, జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్, కూసుమంచి తహశీల్దారు కిషోర్‌కుమార్, ఎంపీడీఓ తిరుపతయ్య మంత్రికి పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం, ఖమ్మం వర కు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు బత్తుల సోమయ్య (పాలేరు), ఆర్జేసీ కృష్ణ (ఖమ్మం), బమ్మెర రామ్మూర్తి (మధిర) తదితరులు పాల్గొన్నారు. నాలుగు లేన్ల రోడ్డుకు శంకుస్థాపన ఖమ్మం రూరల్: మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి బైపాస్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రోడ్డు పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్), రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు కిలోమీటర్ దూరం ఉండే ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రెండుకోట్ల రూపాయలు మంజూరు చేసింది. కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి, జిల్లాపరిషత్ చైర్పర్స న్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జడ్పీటీసీ సభ్యురాలు ధరావత్ భారతి, ఎంపీపీ మేళ్లచెరువు లలిత, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు ఎం.నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, ఎండి.ముస్తపా, జిల్లేపల్లి సైదులు, బీమనాదుల అశోక్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మద్ది మల్లారెడ్డి, రామసహాయం బాలక్రిష్ణారెడ్డి, బత్తుల సోమయ్య, ధరావత్ రాంమూర్తి, తేజావత్ పంతులు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆటోనగర్ వాసుల వినతి ఏదులాపురం పంచాయతీ పరిధిలోగల ఆటోనగర్‌లోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానికులు ఆటోనగర్ సంక్షేమ కమిటీ అధ్యక్షుడు గరికపాటి వెంకట్రావు ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రమిచ్చారు. విద్యుత్ లోఓల్టేజీ నివారించాలని, తాగునీటి ఎద్దడి తీర్చాలని, రోడ్లు నిర్మించాలని కోరారు. కలెక్టర్‌ను కలవాలని వారికి మంత్రి సూచించారు. ఏదులాపురం, పెదతండా పంచాయతీల్లోని 142 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరుతూ ఎంపీపీ మేళ్లచెరువు లలిత, ఏదులాపురం సర్పంచ్ ధరావత్ సుభద్ర వినతిపత్రమిచ్చారు. -
రూ.4 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌కు ప్రతిపాదనలు
కూసుమంచి : రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న వాటర్‌గ్రిడ్ (జలాజలం) పథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదన లు పంపుతున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పాలేరులో విలేకరులతో మాట్లాడారు. పాలేరు, వైరా రిజర్వాయర్లతో పాటు గోదావరి నీటిని వినియోగించి జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి ప్రణాళిక అందజేసినట్లు పేర్కొన్నారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని కూసుమంచి, నేలకొండపపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్భన్ మండలాలతో పాటు ఖమ్మం నగరానికి, ముదిగొండ మండలంలోని కొన్ని గ్రామాలకు 1.48 టీఎంసీల పాలేరు నీటిని సరఫరా చేస్తామన్నారు. ఖమ్మం నగరానికి మాత్రం శుద్ధిచేయని జలాలను, మిగిలిన మండలాలకు శుద్ధి చేసిన జలాలను సరఫరా చేస్తామన్నారు. వైరా రిజర్వాయర్ సెగ్మెంట్ పరిధిలో వైరా, కొణిజర్ల, బోనక ల్, ఎర్రుపాలెం, మధిర, తల్లాడ, సత్తుపల్లి, కొత్తగూడెం, వేంసూరు,పెనుబల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు, నగర పంచాయతీలకు తాగునీరు సరఫరా చేస్తామని వివరించారు. ఇందుకోసం 1.13 టీఎంసీల నీటిని వినియోగించనున్నట్లు తెలిపారు. మిగిలిన మండలాలకు అశ్వాపురం సమీపంలోని పాములపల్లి నుంచి గోదావరి జలాలను తరలిస్తామని చెప్పారు. పాలేరు గ్రిడ్ ద్వారా 365, వైరా గ్రిడ్ ద్వారా 565 హ్యాబిటేషన్లకు రక్షిత నీరు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీటిని సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వచ్చే వేసవి నాటికి ఆయా రిజర్వాయర్లలో ఇన్‌టెక్ వెల్ (బావులు) నిర్మాణ పనులు 50 శాతం మేర అయినా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. రిజర్వాయర్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు... పాలేరు రిజర్వాయర్‌ను సోమవారం వాటర్‌గ్రిడ్ చీఫ్ టెక్నికల్ కో ఆర్డినేటర్ సత్యపాల్‌రెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎస్ఈలు జగన్మోహన్రెడ్డి, సురేష్‌కుమార్ పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ మ్యాపులను, రిజర్వాయర్‌లో నిర్మించనున్న ఇన్‌టెక్‌వెల్ స్థలాన్ని చూసి, పలు అంశాలపై చర్చించారు. వారివెంట ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మల్లేషం గౌడ్, డీఈఈ మాణిక్యాలరావు, ఏఈ మురళీకృష్ణ ఉన్నారు. -
కనిపించని జలకళ
సాక్షి, ఖమ్మం : ఈ సీజన్లో జల కళతో ఉండాల్సిన సాగు నీటి రిజర్వాయర్లు, పెద్ద చెరువులు వర్షాభావంతో వట్టికుండలా మారుతున్నాయి. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన ఆయకట్టు భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వర్షం లేకపోవ డంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, పెద్ద చెరువుల్లో రోజురోజుకూ నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో 87,850 ఎకరాల ఆయకట్టు సాగుకు నోచుకోలేదు. చిన్న, మధ్య తరహా చెరువుల్లో నీరు లేకపోవడంతో 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో పాలేరు, వైరా రిజర్వాయర్లు, లంకాసాగర్ ప్రాజెక్టు, 200 పైగా చిన్న, మధ్య తరహా చెరువులు ఉన్నాయి. కాలువ నీటితో వీటిని నింపాల్సి ఉంటుంది. అయితే సాగర్‌లో నీరు లేక ప్రధాన రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం తగ్గింది. మిగతా చిన్న చెరువులు కూడా చాలా వరకు ఎండిపోయాయి. ఇక వర్షాధారంగా నిండే కిన్నెరసాని రిజర్వాయర్‌లో కొంతమేర నీరుంది. బేతుపల్లి, గుమ్మడవల్లి పెద్దవాగు, మూకమామిడి ప్రాజెక్టులు, బయ్యారం పెద్ద చెరువులో నీటి నిలువ గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు తగ్గింది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిధిలో మొత్తం 87,850 ఎకరాల ఆయకట్టు, నాగార్జునసాగర్ కాలువ పరిధిలో ఉండే చెరువులు, వర్షాధారంగా నిండే రిజర్వాయర్ల పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ప్రస్తుతం వీటిలో నీరు లేక ఆ భూములన్నీ బీళ్లుగానే మారాయి. పాలేరు, వైరా, కిన్నెరసానిలో ఉన్న నీటిని ప్రస్తుతం తాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నారు. సాగునీటికి సరిపడేంత నీరు ఈ రిజర్వాయర్లలో లేకపోవడంతో ఏ పంటలు సాగు చేయాలో తెలియక ఆయకట్టు రైతులు అయోమయంలో ఉన్నారు. సాగర్ వస్తేనే పాలేరు, వైరా నిండేది.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండితేనే జిల్లాలోని పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్ల పరిధిలో సాగు నీటికి నీరు విడుదల కానుంది. అప్పటి వరకు రైతులు సాగు కోసం ఎదురు చూడాల్సిందే. ఇక్కడ బోరుబావుల కింద వరినార్లు పోసినా నాట్లకు మాత్రం సాగర్ నీరు రావాల్సిందే. పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 14 అడుగుల నీరు మాత్రమే ఉంది. దీని కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో 20 వేల ఎకరాల ఆయకట్టు సాగు కావాలి. ఇక్కడ ప్రధానంగా వరి, చెరుకు పంటలు సాగు చేస్తారు. అయితే వర్షాభావంతో కనీసం రిజర్వాయర్‌లోకి పై నుంచి వరద నీరు కూడా రాలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న నీటిని ఖమ్మం నగరానికి తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. వైరా రిజర్వాయర్ నీటి నిలువ 18.3 అడుగులు కాగా, ప్రస్తుతం 11.10 అడుగుల నీరుంది. ఈ రిజర్వాయర్ పరిధిలో 17,390 ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి నిలువ తక్కువగా ఉండడంతో ఆయకట్టుకు కాకుండా వైరా, తల్లాడ, కొణిజర్ల, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు మండలాల్లోని గ్రామాలకు తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టులో వరినార్లు పోసిన రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 16 అడుగులు కాగా ప్రస్తుతం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. నీటి నిలువ డెడ్ స్టోరేజీకి చేరడంతో 8 వేల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్న నీటిని పెనుబల్లి, వేంసూరు మండలాల్లోని 43 గ్రామాలకు తాగునీటి కోసం సరఫరా చేస్తున్నారు. పరవళ్లు తొక్కని కిన్నెరసాని.. కిన్నెరసాని రిజర్వాయర్ పరిధిలో ఏటా ఈ సీజన్లో 10 వేల ఎకరాాలు సాగవుతుంది. కుడి కాలువ కింద మూడు వేలు, ఎడమ కాలువ కింద 7 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. రిజర్వాయర్ సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 382 అడుగుల నీరుంది. 400 అడుగుల నీరుంటేనే ఈ రెండు కాలువలకు విడుదల చేస్తారు. పై నుంచి వరద నీరు రాకపోవడంతో రిజర్వాయర్ నిండే పరిస్థితి లేదు. ఉన్న నీటిని కేటీపీఎస్, ఎన్ఎండీసీ, నవభారత్ పరిశ్రమలకు, పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు తాగునీరు విడుదల చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని బేతుపల్లి చెరువు నీటి సామర్థ్యం 16 అడుగులు. కేవలం వర్షాధారంగా నిండే ఈ చెరువు ప్రస్తుత నీటి మట్టం 8 అడుగులు. దీంతో ఈ చెరువు పరిధిలో ఉన్న 6 వేల ఎకరాల ఆయకట్టుకు చుక్కనీరు విడుదల చేయలేదు. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామ సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు 16 వేల ఎకరాలు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా ప్రస్తుతం 14 అడుగులు మాత్రమే ఉంది. గతేడాది ఈ సమయానికి 2 సార్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. నీళ్లు తక్కువగా ఉండడంతో ఈ ఖరీఫ్‌లో కనీసం వరినార్లు కూడా పోయలేదు. బయ్యారం పెద్దచెరువు నిండేదెప్పుడు..? గార్ల, బయ్యారం మండలాల్లోని సాగు భూములకు బయ్యారం పెద్దచెరువు నీరే ఆధారం. ఈ చెరువు అలుగు పోస్తేనే నీటిని కిందకు విడుదల చేస్తారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం16.3 అడుగులు కాగా ఇప్పుడు కేవలం 4.1 అడుగులు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే నెలలో చెరువు పూర్తిగా నిండి అలుగుపోసింది. చెరువులోకి నీరు వస్తే పంటలు వేసుకోవచ్చనే ఆశతో గార్ల, బయ్యారం మండలాల్లోని 7,200 ఎకరాల ఆయకట్టును రైతులు దున్ని సిద్ధం చేశారు. ముల్కలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 28 అడుగులు కాగా ప్రస్తుతం 2 అడుగుల మేర నీరుంది. దీని ఆయకట్టు 3,260 ఎకరాలు. ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో వర్షాలు ఎప్పుడు పడతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా రిజర్వాయర్లు, పెద్ద, చిన్న చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో ఈ ఖరీఫ్ సాగు సందిగ్ధంలో పడింది.