కేటీఆర్ మార్క్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన తొలి పర్యటనలోనే పాలనాపరమైన మార్క్‌వేసే ప్రయత్నం చేశారు. జిల్లాలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన సమీక్ష నిర్వహించారు.పలువురు అధికారులకు శాఖాపరమైన అంశాలపై ప్రశ్నలు సంధించారు.
ప్రతి అంశంపై కేటీఆర్ సమగ్ర అవగాహనతో వేస్తున్న ప్రశ్నలతో కొందరు జిల్లా అధికారులు కంగుతిన్నారు. సమాధానం చెప్పడానికి ఒకింత తడుముకోవాల్సి వచ్చింది. జిల్లాలో అభివృద్ధి పనులు మరింత శరవేగంగా కొనసాగాలని, శాఖల మధ్య సమన్వయ లోపం తలెత్తరాదని, త్వరలో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్న దృష్ట్యా ప్రగతి నివేదికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
అపూర్వ స్వాగతం
ఉదయం 11 గంటలకు జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ నాయకులు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఘనస్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ వాహనంలో హైదరాబాద్ నుంచి పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు, ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
తొలిసారిగా ఖమ్మం వచ్చిన మంత్రి కేటీఆర్‌కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నాయకన్‌గూడెంకు చేరుకున్న మంత్రికి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఖమ్మం నగరంలో మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఆహ్వానించారు. నాయకన్‌గూడెం వద్ద కేటీఆర్‌కు స్వాగతం పలకడానికి వచ్చిన నేతల్లో ముఖ్యులను పక్కనే ఉన్న జలగం వెంకటరావు, కేటీఆర్‌కు పరిచయం చేశారు. పాలేరు రిజర్వాయర్ వద్ద వాటర్‌గ్రిడ్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్ పరిశీలించారు. మంత్రి కేటీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అనంతరం భారీ మోటారు సైకిల్ ర్యాలీతో ఖమ్మం చేరుకున్నారు. వరంగల్‌క్రాస్ రోడ్డు వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నగరంలో నాలుగు రహదారుల నిర్మాణ పనులకు జిల్లా పరిషత్ వద్ద, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద ఇల్లెందు వైపు నాలుగులైన్ల రహదారి విస్తరణకు శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటాయపాలెంలో టీఆర్‌ఎస్ పతాకాన్ని కేటీఆర్ ఎగురవేశారు. కొణిజర్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. వైరా ప్రధాన రహదారిలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ప్రజాకోర్టులో ఓడిపోయి కోర్టులో దావాలా..!
వైరాలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాకోర్టులో ఓడిపోయి తమపై కోర్టుల్లో దావాలు వేస్తామనడం హాస్యాస్పదమన్నారు. మంత్రి అక్కడి నుంచి వైరా రిజర్వాయర్‌కు చేరుకుని వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు బయోమెట్రిక్ విధానం ద్వారా డబ్బులను ఏ విధంగా చెల్లిస్తారో డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి ప్రయోగాత్మకంగా వివరించారు. ఉపాధి హామీద్వారా పని చేసిన నేలకొండపల్లికి చెందిన నలుగురు కూలీలకు ఈ బయోమెట్రిక్ విధానం ద్వారా కేటీఆర్ సమక్షంలో డబ్బు చెల్లించారు.
వీరికి బ్యాంకుమిత్ర ఏటీఎం కార్డులను కేటీఆర్ అందజేశారు. సమీక్షసమావేశంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ గురువారం నాటి పర్యటనలో ఏర్పాటు చేయకపోవడంపై ఆశాఖ ఎస్‌ఈని ప్రశ్నించారు. జిల్లాకు వస్తున్న సమయంలో సంబంధిత శాఖా మంత్రిగా మంజూరైన పనులకు శంకుస్థాపన చేస్తే బాగుండేది కదా! అని ఎస్‌ఈని ప్రశ్నించారు.
వాటర్‌గ్రిడ్ పనులకు ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారుల మధ్య పూర్తిస్థాయి సమన్వయం అవసరమని, క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో చేయాల్సిన పనులపై సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, ఖమ్మం నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, శాసనసభ్యులు కోరం కనకయ్య, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి తదితరులు పాల్గొన్నారు.