సాక్షి, హైదరాబాద్: గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ(ఆర్‌డబ్ల్యుఎస్)లో కిందిస్థాయి ఇంజనీర్ల పదోన్నతులకు పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారనే అంశం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదోన్నతుల కమిటీ నెలన్నర కిందటే ఆమోదం తెలిపినప్పటికీ.. ఉత్తర్వులు ఇవ్వడానికి ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయ అధికారులు భారీగా దండుకున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. 120 మందికిపైగా సహాయ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ల నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించారు. వీరికి పదోన్నతుల ధ్రువపత్రం అందచేసే సమయంలో ఉన్నతాధికారికి చెందిన ఇద్దరు వ్యక్తులు వసూళ్లకు తెరతీశారని, ఒక్కో ఇంజనీర్ నుంచి రూ. 25 వేల నుంచి 75 వేలు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఇంజినీర్ల అసోసియేషన్ దృష్టికి కూడా వచ్చినట్టు సమాచారం. ఇదిలావుంటే, పదోన్నతుల వ్యవహారంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను సరిగా పాటించలేదని నాలుగో జోన్‌లోని ఎస్‌టీ ఇంజనీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇంజనీర్ ఇన్ చీఫ్ చక్రపాణికి ఫిర్యాదు కూడా చేశారు.
డబ్బు తీసుకుంటే తాట తీస్తా : చక్రపాణి
పదోన్నతులు పొందిన వారి నుంచి ఎవరు డబ్బు తీసుకున్నా తాట తీస్తానని హెచ్చరించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ చక్రపాణి వివరించారు. ఎస్‌ఆర్ రికార్డుల పరిశీలన తర్వాతే పదోన్నతుల కమిటీ ఆమోదం తెలిపిందని, ఎస్సీ, ఎస్టీల్లో పదోన్నతులకు అర్హులు లేని కారణంగా ఆ ఖాళీలను అలాగే వదిలేశామన్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్‌లో పదోన్నతులకు వసూళ్లు!
Published Tue, Oct 22 2013 6:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement