chakrapani
-
Chakrapani Nagari: పాటల తుపాకీ...
దేశ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్. వేదికల మీద పాటలు పాడుతూ తనలో ఉన్న కళకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు. ‘డ్యూటీలో ఉంటూ గాన సాధన కూడా చేయడంతో ఈ పాట నాకు బాగా వంటపట్టింది’ అంటూ ఇటీవల హైదరాబాద్ వచ్చిన చక్రపాణి నగరి తన గురించి వివరించారు. ‘‘మాది శ్రీకాకుళం జిల్లా, పలాస. టెన్త్‌క్లాస్ వరకు హైదరాబాద్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఆ సమయంలో బీఎస్ఎఫ్కు సంబంధించిన ఒక ప్రకటన చూసి, అప్లై చేశాను. ఆ పరీక్షల్లో సెలక్ట్ అయ్యి 2013లో బీఎస్ఎఫ్లో చేరాను. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో పని చేశాను. ఇప్పుడు సెలవు మీద హైదరాబాద్‌కు వచ్చాను. సెలవు పూర్తవగానే జమ్ములో విధులు నిర్వర్తించాలి. డ్యూటీలో ఉంటూ.. ఏదో ఒకటి పాడుకుంటూ ఉండటం అనేది స్కూల్ టైమ్ నుంచే ఉండేది. కానీ, ఎప్పుడూ దానిని నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోలేదు. బీఎస్ఎఫ్లో చేరిన తర్వాత అక్కడ మా టీమ్, క్యాంపుల్లో సరదాగా పాడుతుండేవాడిని. నెలకు ఒకసారి ఏదో ఒక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఆ సమయంలో అన్నీ హిందీ పాటలు పాడేవాడిని. అక్కడున్నవారందరికీ హిందీ తెలుసు కాబట్టి, అవే పాటలు పాడేవాడిని. మా తోటి జవాన్లే కాదు ఆఫీసర్స్ కూడా చాలా ప్రోత్సహించేవారు. డ్యూటీలో ఉన్నా లేకున్నా పాటలు పాడటం మాత్రం ఆగేది కాదు. ఇక మా ఊరికి వచ్చినప్పడు పెళ్లిళ్లు వంటి వేడుకల సందర్భాల్లోనూ నా గాన కచేరీ ఉండేది. ఖాళీ సమయంలో డిజిటల్ మీడియాని ఫాలో అవుతుంటాను. అలా, హైదరాబాద్‌లోని ఓ టీవీ పాటల కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని ప్రకటన చూసి, అప్లై చేసుకున్నాను. వేల మందిలో నాకు అవకాశం రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయాన్ని మా అధికారులకు చెబితే వాళ్లూ వెంటనే ఓకే చేశారు. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు, గాన గంధర్వుడు బాలుగారి మైక్‌ను కానుకగా అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. కష్టపడుతూ.. మా అమ్మానాన్నలకు మేం ముగ్గురం. నా చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో మా అమ్మ చాలా కష్టాలు పడింది. మమ్మల్ని హాస్టల్లో ఉంచి, తెలిసినవారి ద్వారా ఢిల్లీ వెళ్లి, పనులు చేసి, మాకు డబ్బు పంపేది. ఇప్పుడు అమ్మ ఊళ్లో వ్యవసాయం పనులు చేస్తుంది. అన్నయ్య సొంతగా బేకరీ నడిపిస్తున్నాడు. అక్క గ్రామవాలంటీర్గా చేస్తోంది. మాకు కష్టం విలువ తెలుసు, స్వయంగా ఎదగడానికి మా వంతుగా కృషి చేస్తూనే వచ్చాం. ఆ కష్టంలో నుంచే ఈ పాట పుట్టుకు వచ్చిందనుకుంటాను. ఎక్కడ ఉన్నా కళ రాణిస్తుందనడానికి నేనే ఉదాహరణ అనిపిస్తుంటుంది. మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని సింగర్‌గా రాణించాలనుకుంటున్నాను’’ అని తెలియజేశాడు ఈ జవాన్. – నిర్మలారెడ్డి -
ఆంధ్రప్రదేశ్ తరహాలో ఇంటి వద్దకే రేషన్
తిరువళ్లూరు (తమిళనాడు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని తమిళనాడులో అమలు చేసే అంశంపై త్వరలో తమ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి చక్రపాణి తెలిపారు. ఆయన గురువారం మంత్రి నాసర్, కలెక్టర్ అల్బీజాన్ వర్గీష్‌తో కలిసి తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పంపిణీ, వరి ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి చక్రపాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల వద్దే రేషన్ వస్తువులు అందజేస్తోందన్నారు. తిరువళ్లూరు ఆంధ్రాకు సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి నుంచి కొందరు రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ఇక్కడికి తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల్లో భద్రపరిచి విక్రయిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. -
ఎంత బాగా చేసిండ్రు అన్నారు
‘‘ఎంత మంచి పాత్ర చేసినా, ఆ పాత్ర నిడివి ఎంత ఉన్నా ఆ సినిమా ఆడితేనే ఆర్టిస్టుకి గుర్తింపు వస్తుంది. ‘మల్లేశం’ చిత్రం నాకా గుర్తింపును తీసుకు వచ్చింది. ఈ చిత్రాన్ని నా లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు ఆనంద చక్రపాణి. ఆసు యంత్ర ఆవిష్కర్త, పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’లో టైటిల్ పాత్రధారి ప్రియదర్శికి తండ్రిగా నటించారు చక్రపాణి. అంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేసిన చక్రపాణి తన గురించి పలు విశేషాలు చెప్పారు. ► నటుడిగా ‘దాసి’ నా తొలి చిత్రం. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ‘మల్లేశం’ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేసిన ఆర్టిస్టు కమ్ పెయింటర్ లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది నాకు. ► ఈ సినిమా ప్రివ్యూ చూసి మల్లేశంగారు.. ‘అన్నా ఎంత బాగా చేసిండ్రు. మా నాయన గుర్తొచ్చారు, ఆయనతో ఉన్న అనుబంధం గుర్తొచ్చింది’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా ఈ సినిమాలోని నా నటనను చూసి పలువురు దర్శక–నిర్మాతలు ఇండస్ట్రీకి మంచి నటుడు దొరికాడని కొనియాడారు. నాలో గుమ్మడిని, యస్వీ రంగారావును చూసుకున్నామని కొందరు ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టారు. ఏ పాత్ర అయినా చేయగలనని ఈ చిత్రంలో ప్రియదర్శి నిరూపించుకున్నారు. మంచి సినిమాలు తీయాలనే తపన ఉన్న ఈ చిత్రదర్శకుడు రాజు ‘మల్లేశం’ని అద్భుతంగా తెరకెక్కించారు. ► ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకపోవడం, కాంటాక్ట్ బేస్ సరిగా లేకపోవడానికి తోడు నా ఆర్థిక పరిస్థితులు నన్ను కొంతకాలం ఇండస్ట్రీకి దూరం చేశాయి. అడ్వటైజింగ్ ఫీల్డ్కి షిఫ్ట్ అయ్యాను. కాపీరైటర్‌గా, విజువలైజర్‌గా చేశాను. యాడ్‌ఫిల్మ్ చేసేప్పుడు వాటిలో కొన్నింటికి డైరెక్ట్ చేయడం, స్క్రిప్ట్ రాయడం చేశాను. కానీ సినిమాల పట్ల ఉన్న ప్రేమ నాతో పాటే పెరుగుతూనే ఉంది. నాకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమా డైరెక్షన్, స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేయడం లాంటివి చేశాను. ► ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నాను. రానా ‘విరాటపర్వం’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వెల్లడిస్తాను. -
సంఘటిత శక్తితోనే బలోపేతం
‘యాదవుల అలయ్– బలయ్’లో ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి సాక్షి, హైదరాబాద్: సమాజానికి యాదవ సంఘం దిక్సూచీలాగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ ఎ.చక్రపాణి అన్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో యాదవుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘యాదవుల అలయ్-బలయ్’కార్యక్రమం జరిగింది. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్య క్షుడు మేకల రాములు యాదవ్ అధ్యక్షత న జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన చక్రపాణి..కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. సంఘటిత శక్తితోనే సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యాదవుల్లో ఎవరైనా ఎదుగు తున్నారంటే వారి ని గౌరవించాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సమాచార హక్కు చట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. ఆర్టీఐ-2005 యాక్ట్ సామాన్యులకు ఎంతో బలాన్ని, అధికారాన్ని ఇచ్చిందని, పాలనలో పారదర్శ కతకు ఇది దోహదపడుతుందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేష న్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. యాదవులందరం కలసికట్టుగా ముందుకుసాగి రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్, తమిళనాడు రాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి.ఆర్.దామోదరన్ యాదవ్, సినీ నటి కరాటే కళ్యాణి యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, యాదవ్ సంఘం ఏపీ నాయకులు రామయ్య యాదవ్, ఎంఎం కొండయ్య యాదవ్, తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు బడుగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న శాసనమండలి చైర్మన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని మంగళవారం ఉదయం శాసనమండలి చైర్మన్ చక్రపాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిగా అలంకృతురాలైన దుర్గకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి మండలి సమావేశాలు వెలగపూడిలో శాసనమండలిలోనే జరుగుతాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టసభలు పూర్తిగా సహకరిస్తాయని తెలిపారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని ఆకాంక్షించారు. -
ప్రజల ఆకాంక్షలు నెరవేరిన రోజు
సనత్‌నగర్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను విముక్తులను చేయడంలో స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమ చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఏ.చక్రపాణి అన్నారు. స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీ, స్వామి రామానందతీర్థ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 29 మంది స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. అంతకముందు ఆయనజాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ స్వామిరామానందతీర్థ, పీవీ నర్సింహ్మారావు తదితరులు నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థాన ప్రజలకు విముక్తి కల్పించేందుకు పోరాడారన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం విలీనం తరువాత కూడా నిజాం రాజు ఐక్యరాజ్యసమితిలో వేసిన కేసు ఇంకా సజీవంగానే ఉందని గుర్తుచేశారు. పీవీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ విమోచన దినమా...లేక విలీన దినమా? అనే విషయాలను పక్కనపెడితే నిజాం సంస్థాన ప్రజల ఆకాంక్షలు నెరవేరిన రోజుగా సెప్టెంబర్ 17ను అభివర్ణించారు. తెలంగాణ సమరయోధులు నిజాం కాలం నాటి సంఘటలను గుర్తు చేసుకున్నారు. తమను సన్మానించిన కమిటీ కార్యదర్శి వాణిదేవికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నారాయణరావు, వాణిదేవి, చంద్రశేఖర్‌రావు, నరసింహారెడ్డి, శేఖర్ మారంరాజు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు వ్యవసాయ రంగంలో రాణించాలి
జగదేవ్‌పూర్: మహిళలు ఇంటి పనలకే పరిమితం కాకుండా వ్యవసాయ రంగంలో రాణించాలని, ముఖ్యంగా కూరగాయాల పంటలపై సాగు చేయాలని ఉద్యానశాఖ గజ్వేల్ డివిజన్ అధికారి చక్రపాణి అన్నారు. గురువారం జగదేవ్‌పూర్‌లో వెలుగు కార్యాలయంలో మహిళ గ్రామైఖ్య సంఘం సభ్యులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. మండల సమైఖ్య ఆధ్వర్యంలో సంతోష, ప్రొడ్యూసర్ కంపెనీ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ మహిళలు ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు. గ్రామాల్లో కూరగాయాల పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. అలాగే వచ్చే ఏడాది వరకు యాక్షన్‌ప్లాన్‌ను తయారు చేసుకోవాలని సూచించారు. మండలంలోని పండించే కూరగాయాలను కొనుగోలు చేసి విక్రయించడం వల్ల ఆటు రైతులు, ఇటు సంఘం లాభపడుతారని వివరించారు. 10 గ్రామాలకు కలిసి ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేసుకొవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం వాసుదేవ్, ఎంపీఎంలు అనంద్, సత్తయ్య, చంద్రయ్య, నర్సింలు, మహిళలు పాల్గొన్నారు. -
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని శనివారానికి వాయిదా వేశారు. శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. ఈ నెల 29, 30 తేదీల్లో సభకు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని పేర్కొంటూ విప్ జారీ చేశారు. మండలిలో మంగళవారం ఇసుక మాఫియాపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మధ్య వాగ్వాదం జరిగింది.ఇసుక పేరుతో దోచుకుంది మీరంటే మీరేనంటూ ఇరువులు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కాసేపు సభలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చైర్మన్ ఘంగా చక్రపాణి ఇరువురు నేతలకు సర్దిచెప్పి చర్చను ముగించారు. అనంతరం మండలిని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. -
సమాచారంలో జాప్యం సరికాదు
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులు కోరిన సమాచారాన్ని సభలో అందించటంలో వివిధ శాఖలు విఫలం కావటం పట్ల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు అవసరమైన సమాచారాన్ని అధికారులు సమకూర్చకపోతే దాని ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ఈ నెల ఐదో తేదీ నుంచి ఏపీ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణితో కలసి కోడెల వివిధ శాఖల అధిపతులు, పోలీసు అధికారులు, శాసనసభ సచివాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. 5న మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభ, మండలిలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. 10న బడ్జెట్ ప్రవేశ పెడతారన్నారు. 19న బాబా రాందేవ్ ఎమ్మెల్యేలకు యోగాలో శిక్షణ ఇస్తారని వివరించారు. -
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 4, 5వ తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. చిలుకూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో నిర్వహించనున్న ఈ 18వ జాతీయ సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సదస్సు సందర్భంగా సిలబస్, పరీక్ష విధానం, నూతన సాంకేతిక పద్దతులపై చర్చతో పాటు టీ హబ్‌లో ఐటీ కంపెనీలతో సర్వీస్ కమిషన్ చైర్మన్ల సమీక్ష ఉంటుందని చక్రపాణి వెల్లడించారు. యూపీఎస్సీ చైర్మన్‌తో పాటు అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు హాజరవుతున్న ఈ సదస్సు గవర్నర్ ప్రసంగంతో ముగియనున్నట్లు తెలిపారు. -
కోటికి చేరిన ‘టీఎస్పీఎస్సీ’ విజిటర్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించిన వారి సంఖ్య కోటికి చేరింది. ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌ను కేవలం ఐదు నెలల్లోనే ఇంతమంది సందర్శించడం గమనార్హం. అభ్యర్థులు ఉద్యోగ నోటిఫికేషన్లకు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా చైర్మన్ ఘంటా చక్రపాణి ‘వన్‌టైమ్ రిజిస్ట్రేషన్’ను ప్రారంభించడం, కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కావడమే దీనికి కారణం. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. ఆ సమాచారాన్నే అన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తుగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల మందికిపైగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. -
విలువలకు కట్టబడ్డ నేత చక్రపాణి: రోశయ్య
నాంపల్లి (హైదరాబాద్): రాజకీయాల్లో విలువలకు కట్టుబడి పనిచేసిన నాయకుల్లో డాక్టర్ ఎ.చక్రపాణి ఒకరని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ చక్రపాణి కుమార్తె రేగుల సునీత రచించిన ‘మై డాడ్’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం నాంపల్లిలోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తమిళనాడు గవర్నర్ రోశయ్య హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చక్రపాణి నిగర్వి అని అన్నారు. ప్రతి పక్షాల నేతలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు. రేగుల సునిత రచించిన 'మై డాడ్' అందరూ చదవాల్సిన పుస్తకమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఈ పుస్తకాన్ని చదివితే తండ్రి గొప్పదనం తెలుస్తుందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. -
సీఎం, మండలి చైర్మన్ హోలీ శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసన మండలి చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాలు సప్తవర్ణ శోభితం కావాలని గవర్నర్, ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రజల జీవితాలు ఆనందమయం కావాలని మండలి చైర్మన్ చక్రపాణి అన్నారు. హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం నింపాలని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. -
వీళ్లకేం మేసే రోగం!
వాళ్లంతా ప్రభుత్వోద్యోగులు. నెల తిరిగే సరికి వేలాది రూపాయల వేతనం చేతికందుతుంది. ఏ చీకూ చింతా లేకుండా హాయిగా బతికేయొచ్చు. తాము చే సిన పనికి లభించిన వేతనంతో తృప్తిపడదామని అనుకోవడం లేదు. కానీ ఎందుకో ప్రజల సొమ్మును కూడా భోంచేయాలనే దుర్బుద్ధి పుడుతోంది. ఇంకేముంది అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల జరుగుతున్న పలు సంఘటనలు ప్రభుత్వ ఉద్యోగుల తీరుతెన్నులకు అద్దం పడుతున్నాయి. కడప అర్బన్: కడప ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి 18.60 లక్షల రూపాయలను స్వాహా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చక్రపాణి రూ. 5 లక్షలు మాయం చేసేశాడు. ఇక కడప డీసీసీ బ్యాంకు సిబ్బంది ఏకంగా తాకట్టు పెట్టిన బంగారు నగలనే మార్చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఐదు లక్షలు మాయం.. ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చక్రపాణి గతనెల 28వ తేదీన రూ.13లక్షలు ట్రెజరీ నుంచి నగదు రూపంలో కార్యాలయానికి తీసుకొచ్చాడు. రూ.5లక్షలను ఉద్యోగులకు వేతనాలుగా పంపిణీ చేశాడు. మిగిలిన రూ.8లక్షలను బీరువాలో ఉంచి సెలవుపై వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత కార్యాలయానికి తిరిగి వచ్చి బీరువా తెరిచి చూస్తే రూ.3లక్షలు మొత్తం మాత్రమే ఉంది. మిగిలిన రూ.5లక్షలు కనిపించలేదు. బీరువాకు వేసిన తాళం వేసినట్లే ఉంటే ఈ ఐదు లక్షలు ఎలా మాయమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ ప్రశ్నకు సమాధానం సదరు ఉద్యోగి అయినా చెప్పాలి.. లేదంటే కార్యాలయ ఉన్నతాధికారులైనా చెప్పాలి. ఇవేమీ లేకుండా జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే, డబ్బు గురించి పూర్తిగా విచారించకుండానే సంజాయిషీ ఇవ్వాలని నోటీసు ఇవ్వడం.. అదేరోజు అకౌంటెంట్ రూ.5లక్షలు ఠంచన్‌గా జమ చేసేయడాన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయం ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఇక్కడి డీటీసీపై సీరియస్ అయ్యారు. రికార్డులు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అకౌంటెంట్ చక్రపాణిని సస్పెండ్ చేశారు. డీసీసీ బ్యాంక్‌లో బంగారు మాయ... చెన్నూరుకు చెందిన సాదక్ అలీ 2012 మే 4న తన అవసరం కోసం 9.5 తులాల బంగారు ఆభరణాలను జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.1.36లక్షలను రుణంగా తీసుకున్నాడు. రుణం తీసుకునే సమయంలో బ్యాంకు అప్రైజర్ వీరబ్రహ్మాచారి నగలను పరిశీలించి వాటి నాణ్యత, విలువను నిర్ధారించాకే రుణం మంజూరైంది. మరలా 2013 జులై 25న రెన్యువల్ చేసేటప్పుడు కూడా అదే అప్రైజర్ బంగారు ఆభరణాలను సరిచూశారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారుల ఆదేశాల మేరకు గత నెల 27వ తేదీన వీరబ్రహ్మాచారి, మరో అప్రైజర్ పి.గిరి 520 ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాలను రెండు రోజుల్లో సరి చూశారు. ఈ క్రమంలో సాదక్ అలీ రెండు రోజుల క్రితం రెన్యువల్ కోసం డబ్బు కట్టేందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన నగలు నకిలీవని బ్యాంక్ అధికారులు తె లపడంతో అవాక్కైన సాదక్ అలీ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు డీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్కె వలీచాంద్ కూడా తమ సిబ్బందితో వచ్చి సాదక్ అలీ ఇచ్చిన నగలు నకిలీవని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విచారించి ఆ నగలను తీసుకురావాలని చెప్పినప్పటికీ బ్యాంకు అధికారులు నగలను అప్పజెప్పకుండానే కేసు నమోదు చేయాలని కోరడం గమనార్హం. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇటీవల ఎర్రగుంట్ల ఎంపీడీఓ జయసింహ సాక్షరభారత్ నిధులను స్వాహా చేశారనే కారణంగా అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో కడపలో ఓ స్టేట్‌బ్యాంక్ అధికారి కూడా ఇదే రీతిలో మోసాలకు పాల్పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్ట్స్ కళాశాలలో ఏం జరిగిందంటే.. ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి 2013లో తమ కళాశాలలో డిగ్రీ చదివి వెళ్లిన మారుతీనగర్‌కు చెందిన కృపాకర్ అనే విద్యార్థి పేరు మీద సెంట్రల్ బ్యాంక్‌లో ఖాతా ఉండటంతో తన దగ్గరున్న చెక్కు బుక్కుతో అక్షరాలా రూ.4.30 లక్షలను రాయించి ఇచ్చాడు. ఆంధ్రాబ్యాంక్‌కు చెక్కు వెళ్లి సెంట్రల్ బ్యాంక్‌లో కృపాకర్ ఖాతాలో రూ.4.30లక్షలు జమ అయింది. కృపాకర్‌ను అడ్డుపెట్టుకొని రఘురామిరెడ్డి, అతని స్నేహితుడు ఎంఎం బాషా, వారి సహచరులు చిన్ని, మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కవిత అనే వారు ఎంచక్కా రూ.4.25లక్షలను డ్రా చేసుకున్నారు. సెంట్రల్ బ్యాంక్ మేనేజర్‌కు అనుమానం వచ్చి ఆర్ట్స్ కళాశాల ఖాతా నుంచి ఒకే విద్యార్థికి రూ.4.30లక్షలు ఎందుకు జమ అయిందో సంజాయిషీ అడిగారు. సదరు విద్యార్థిని పిలిపించి అథారిటీ లెటర్ తీసుకురావాలని కోరారు. కృపాకర్ రఘురామిరెడ్డిని సంప్రదించగా కవిత ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటలక్షుమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి అథారిటీ లెటర్ తయారుచేసి ఇచ్చింది. ఆ సంతకాలలో ఒకటి నకిలీదని బ్యాంక్ మేనేజర్ గుర్తించి నిలదీశారు. ప్రిన్సిపల్‌ను పిలిపించి వ్యవహారాన్ని తేల్చమని చెప్పారు. దీంతో ఆమె రఘురామిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో రఘురామిరెడ్డి అండ్ పార్టీ వ్యవహారం బయటపడింది. కడప నగరంలో ఆర్ట్స్ కళాశాలకు సంబంధించిన ఖాతాలు బోలెడున్నాయి. ఇదే అదనుగా భావించిన రఘురామిరెడ్డి మొదట తన స్నేహితుడు ఎంఎంబాషా పేరుతో రూ.4600 చెక్కును రాయించి ఎస్బీఐ బ్యాంక్‌కు పంపించాడు. వెంటనే ఆ మొత్తం ఎంఎంబాషా పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత మారుతీనగర్‌కు చెందిన కృపాకర్ పేరు మీద రూ.4.30 లక్షలు, రామిరెడ్డి అనే వ్యక్తి పేరు మీద రూ.4,84,500, రూ.4,74,500 అనే రెండు చెక్కులు రాయించాడు. ఇతను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరిచి ఈ మొత్తం ఖాతాలో పడగానే డబ్బును డ్రా చేసుకొని వెంటనే ఖాతా కూడా రద్దు చేసుకున్నాడు. రఘురామిరెడ్డి బంధువు మనోరంజన్‌రెడ్డి అనంతపురంలో వ్యాపారం చేస్తున్నాడు. అతని స్నేహితుడు సర్దార్ ఖాతాలో రూ.4.70లక్షల మొత్తాన్ని జమచేసి వెంటనే డ్రా చేసుకున్నాడు. ఇలా మొత్తం రూ.18.60లక్షలను స్వాహా చేసిన రఘురామిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇన్ని లక్షల రూపాయలను స్వాహా చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనేది అర్థంకాని ప్రశ్న. -
ఏపీ కౌన్సిల్ సమావేశాలకు స్వామిగౌడ్
హైదరాబాద్ : తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్.. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం మండలిలో ఏపీ బడ్జెట్‌పై చర్చ జరుగుతుండటంతో ఆసక్తిగా గమనించారు. వచ్చే నెల్లో తెలంగాణలోనూ బడ్జెట్ సమావేశాలు ఉండటంతో సెషన్స్ ఎలా జరుగుతాయో చూశారు. అతిథిగా హాజరైన స్వామిగౌడ్‌కు వీఐపీ గ్యాలరీలో ప్రత్యేక మర్యాదలు చేశారు. స్వామిగౌడ్ రాకను ఏపీ మండలి చైర్మన్ చక్రపాణితో సహా మిగిలిన మంత్రులు కూడా స్వాగతించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. కలిసి అభివృద్ధి సాధించడంలో భాగంగానే ఆయన ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రతిరోజూ టీవీలో ఏపీ మండలి వ్యవహారాలను చూసే స్వామిగౌడ్.. ఇవాళ ప్రత్యక్షంగా మండలికి హాజరయ్యారు. సమావేశాలే బాగా జరుగుతున్నాయని అభినందించారు. -
శాసనమండలిలో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో గురువారం హైడ్రామా చోటు చేసుకుంది. సభ్యులు ఎవరేమంటున్నారో తెలియని గందరగోళ వాతావరణంలోనే.. రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013పై చర్చ ముగిసిందని, సభ్యుల అభిప్రాయాలను రాష్ట్రపతికి నివేదిస్తామని చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. ఈ బిల్లును తిరస్కరించాలంటూ సభా నాయకుడు సి.రామచంద్రయ్య ఇచ్చిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు తెలిపారు. కీలకమైన ఈ రెండు అంశాలకు సంబంధించిన ప్రకటన రెండే నిమిషాల్లో పూర్తికావడం గమనార్హం. ఉదయం సభ ప్రారంభం కాగానే ఇరుప్రాంతాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో వారుుదాల పర్వం కొనసాగింది. రెండుసార్లు వాయిదా అనంతరం 12.40కి మరోమారు సభ ఆరంభం కాగానే ‘రాష్ట్రపతి పంపిన బిల్లుపై గడువు నేటితో ముగుస్తుంది. అందువల్ల చర్చకు ముగింపు పలకాల్సిన అవసరముంది. చర్చలో 54 మంది సభ్యులు పాల్గొన్నారు. 33.19 గంటలు చర్చ సాగింది. సభ్యులంతా వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా అందజేశారు. అవన్నీ అధికారిక రికార్డుల్లో భాగమే. బిల్లులోని క్లాజులపై సభ్యులిచ్చిన 1,157 సవరణలను కూడా అధికారిక రికార్డుల్లో భాగంగా చేర్చాం. వీటిని సభ అభిప్రాయాలుగా రాష్ట్రపతికి నివేదిస్తాం’ అని చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. ‘సభా నాయకుడు సి.రామచంద్రయ్య ఇచ్చిన ప్రభుత్వ తీర్మానంతోపాటు మరో అనధికారిక తీర్మానం అందింది. వాటి ప్రతులను సభ్యులకు అందజేశాం. రామచంద్రయ్య ఇచ్చిన తీర్మానం ప్రస్తుతం సభ ముందు ఉంది..’ అంటూ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత సభ్యుల అరుపులు, కేకల మధ్య ప్రభుత్వ తీర్మానం మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందినట్లు చక్రపాణి ప్రకటిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అంతకుముందు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శాసనమండలి నివాళులర్పించింది. -
ఇలా సభ.. అలా వాయిదా
జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు.. బిల్లుపై ఓటింగ్‌కు వైఎస్సార్ సీపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: శాసనసభ, మండలిలో మంగళవారం సైతం సభా కార్యక్రమాలు సాగలేదు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సభ్యులు పోడియాలను చుట్టుముట్టడంతో ఉభయసభలూ బుధవారానికి వాయిదాపడ్డాయి. ఉదయం సభలు ప్రారంభం కాగానే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపాలంటూ ఇచ్చిన నోటీసులను తిరస్కరించాలంటూ తెలంగాణ సభ్యులు, నోటీసులకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు పోడియంలలోకి వెళ్లారు. పోటాపోటీగా జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు చేశారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లుపై ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. శాసనసభలో చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వెళ్లారు. డిప్యూటీ సీఎం రాజనర్సింహ, ఆ ప్రాంత మంత్రులు తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. సీమాంధ్ర టీడీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. గందరగోళ వాతావరణంలో ప్రారంభమై రెండు నిమిషాలు కూడా గడవక ముందే స్పీకర్ మనోహర్ సభను గంట వాయిదా వేశారు. తర్వాత కూడా ఇదే పరిస్థితుల నేపథ్యంలో రెండోసారి వారుుదా పడి మధ్యాహ్నం 2.10కి తిరిగి సమావేశమైన సభ వెంటనే బుధవారానికి వాయిదా పడింది. మండలిలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లుపై ఓటింగ్ కోసం వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రాంతాలవారీ డిమాండ్ల నేపథ్యంలో మధ్యాహ్నం 1.30 సమయంలో చైర్మన్ చక్రపాణి మండలిని బుధవారానికి వారుుదా వేశారు. -
ఆ నోటీసును తిరస్కరించండి: దామోదర రాజనర్సింహ
మండలి చైర్మన్‌కు డిప్యూటీ సీఎం వినతి విడిగా వినతిపత్రం సమర్పించిన టీ ఎమ్మెల్సీలు సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పిపంపే తీర్మానం కోసం మంత్రి రామచంద్రయ్య 76వ నిబంధన కింద ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండలి చైర్మన్ చక్రపాణిని కోరారు. సోమవారం సభ ప్రారంభానికి ముందే మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, పలువురు ఎమ్మెల్సీలతో కలిసి చైర్మన్ కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ఈ బిల్లును కేవలం అభిప్రాయాల కోసం మాత్రమే శాసనసభ, మండలికి పంపించారని పేర్కొన్నారు. మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసును బిజినెస్ రూల్స్ 80 ప్రకారం తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున రామచంద్రయ్య అందజేసిన నోటీసును తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు విడిగా మరొక వినతిపత్రం చైర్మన్‌కు అందజేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి నేతృత్వంలో అందజేసిన వినతిపత్రంపై కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ సభ్యులు పలువురు సంతకాలు చేశారు. మరోవైపు సీఎం కిరణ్ సభాహక్కులు ఉల్లంఘించారంటూ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మండలి చైర్మన్‌కు నోటీసు అందజేశారు. సీఎంతో పాటు మంత్రి రామచంద్రయ్య, సీఎస్ పి.కె.మహంతిలకు వ్యతిరేకంగా మండలి నిబంధనావళి 173 ప్రకారం ఆయన నోటీసు ఇచ్చారు. -
శాసన మండలిలో అత్తారింటికి దారేది?
హైదరాబాద్ : శాసనమండలిలో మంగళవారం అత్తారింటికి దారేదీ.. అంటూ ఆసక్తికర చర్చ జరిగింది. వినేందుకు విడ్డూరంగా ఉన్నా.. పెద్దల సభలో.. కాసేపు.. నన్నపనేని రాజకుమారి సందడి చేశారు. దీంతో.. సభలో కాసేపు నవ్వులు పూసాయి. రాష్ట్ర విభజన బిల్లుపై జరిగిన ఆ సరదా సంభాషణను అందరూ నవ్వుతూ ఆస్వాదించారు. రాజకుమారి మాట్లాడుతూ తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల్లో బంధుత్వాలు కొనసాగుతున్నాయని... బంధాలు బంధుత్వాల్లో భేదం చూపించలేదని.... మరి ఇప్పుడు రాష్ట్ర విభజన ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ సందర్బంగా ఆమె నేతల బంధుత్వాలను గుర్తు చేశారు. -
ఆర్‌డబ్ల్యూఎస్‌లో పదోన్నతులకు వసూళ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ(ఆర్‌డబ్ల్యుఎస్)లో కిందిస్థాయి ఇంజనీర్ల పదోన్నతులకు పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారనే అంశం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదోన్నతుల కమిటీ నెలన్నర కిందటే ఆమోదం తెలిపినప్పటికీ.. ఉత్తర్వులు ఇవ్వడానికి ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయ అధికారులు భారీగా దండుకున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. 120 మందికిపైగా సహాయ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించారు. వీరికి పదోన్నతుల ధ్రువపత్రం అందచేసే సమయంలో ఉన్నతాధికారికి చెందిన ఇద్దరు వ్యక్తులు వసూళ్లకు తెరతీశారని, ఒక్కో ఇంజనీర్ నుంచి రూ. 25 వేల నుంచి 75 వేలు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఇంజినీర్ల అసోసియేషన్ దృష్టికి కూడా వచ్చినట్టు సమాచారం. ఇదిలావుంటే, పదోన్నతుల వ్యవహారంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను సరిగా పాటించలేదని నాలుగో జోన్‌లోని ఎస్టీ ఇంజనీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇంజనీర్ ఇన్ చీఫ్ చక్రపాణికి ఫిర్యాదు కూడా చేశారు. డబ్బు తీసుకుంటే తాట తీస్తా : చక్రపాణి పదోన్నతులు పొందిన వారి నుంచి ఎవరు డబ్బు తీసుకున్నా తాట తీస్తానని హెచ్చరించినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ చక్రపాణి వివరించారు. ఎస్ఆర్ రికార్డుల పరిశీలన తర్వాతే పదోన్నతుల కమిటీ ఆమోదం తెలిపిందని, ఎస్సీ, ఎస్టీల్లో పదోన్నతులకు అర్హులు లేని కారణంగా ఆ ఖాళీలను అలాగే వదిలేశామన్నారు. -
సీమాంధ్ర పెట్టుబడిదారులారా.. గో బ్యాక్
జులైవాడ, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటనతో భౌగోళిక తె లంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైందని... అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. పౌరసమాజం స్వేచ్ఛగా బతికేలా రాజ్యహింసలేని రాజ్యం... సామాజికవర్గాలు, పీడిత వర్గాలు తల ఎత్తుకుని సమన్యాయంగా జీవించే ప్రజాస్వామిక తెలంగాణ కోసం పౌరహక్కుల సంఘం, ప్రజాస్వామిక వాదులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హన్మకొండలోని జిల్లా పరిషత్ హాల్లో ఆదివారం జరిగిన పౌరహక్కుల సంఘం జిల్లా మహాసభలో ‘తెలంగాణ అవరోధాలు.. కర్తవ్యాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. హై దరాబాద్ స్టేట్ నిజాం రాజు పాలనలో ఉన్న ఒకప్పటి స్వ తంత్ర దేశమన్నారు. నిజాం రాజుతో అప్పటి ప్రధాని జవహర్లాల్ చేసుకున్న ఒప్పంద చరిత్రను వెలుగులోకి రాకుండా అప్పటి భారత ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. నెహ్రూ తన బంధువైన కాశ్మీర్ రాజుతో ఒప్పందం చేసుకుని దాన్ని భారతదేశంలో కలుపుకున్నారన్నారు. అయితే నిజాంరాజుపై మాత్రమే సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారా సైనిక దాడి జరిపించి ఎలాంటి షరతులు లేకుండా నెహ్రూ నిజాం రాజ్యాన్ని లొంగదీసుకున్నారని చెప్పారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ర్టమని... అ క్కడ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఒక ఎకరం భూమి కూడా కొ నలేరని... ఆ హక్కు కాశ్మీర్లో ఉండదన్నారు. అలాంటి స్వ యం ప్రతిపత్తి తెలంగాణకు ఉండి ఉంటే... సీమాంధ్రులు ఇక్క డ పెట్టుబడులు పెట్టేవారు కాదని.. నిజాం సర్పేఖాస్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే వారు కాదన్నారు. ఇలా భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమైనప్పుడు అప్పటి ప్రభుత్వం తీరని అన్యాయానికి ఒడిగట్టిందన్నారు. తెలంగాణ ప్రాం త ప్రజలు విడిపోదామని నిర్ణయించుకున్నాక... కలిసి ఉండాలని కోరుకోవడం సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆస్తుల పరిరక్షణ ఉద్యమంలో భాగమేనన్నారు. సీమాంధ్ర ఎంపీల్లో ఎక్కువ మంది కాంట్రాక్టర్లేనని.. చివరకు తెలంగాణలోని మన ఊళ్లకు వెళ్లాలన్న ఆంధ్రోళ్ల టోల్‌గేట్‌కు డబ్బులు కట్టాల్సిన దౌర్భాగ్య ప రిస్థితి దాపురించిందన్నారు. సుబ్బిరామిరెడ్డి, లగ డపాటి రాజ గోపాల్, కావూరి, రాయపాటి సాంబశివరావు లాంటి కాంట్రాక్టర్లు సమైక్యాంధ్ర ఉద్యమానికి పెట్టుబడి పెట్టి నడిపిస్తున్నారన్నారు. తెలంగాణ భూములను కారుచవకగా తీసుకోవడమే కా కుండా వాటిపై అప్పులు పొందిన సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును వారి వ్యాపార, ఆర్థిక ప్రయోజనాల కోసమే అడ్డుకుంటున్నారని విమర్శించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులను గోబ్యాక్ అనకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారు అడ్డం పడుతూనే ఉంటారన్నారు. పదేళ్లలో రెండు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను సీమాంధ్ర పెట్టుబడిదారులు దక్కించుకున్నారని తెలిపారు. తెలంగాణ వనరులను అన్నివిధాలా దోచుకున్న మూర్ఖులకు తెలంగాణ ప్రజలతో కలిసి ఉంటామనే హక్కు లేదన్నారు. ఆర్టికల్-3 ప్రకారం కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పౌరహక్కుల సంఘం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోనూ పేద ప్రజల పక్షాన నిలబడి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్రజాస్వామిక వాదులను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మించాలి : సురేష్‌కుమార్ తెలంగాణ తరహాలో పౌరహక్కుల రక్షణ కోసం ప్రజాఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, హైకోర్టు న్యాయవాది దర్బ సురేష్‌కుమార్ అన్నారు. ‘పౌరహక్కుల ఉద్యమం... కోర్టులు... కర్తవ్యాలు’ అంశంపై ఆయన మాట్లాడుతూ ఎన్కౌంటర్ పేరిట రాజ్యం చేస్తున్న హత్యలను కోర్టుల్లోనే గాక పౌరసమాజం ద్వారా ఉద్యమం రూపంలో ఒత్తిడి తెచ్చి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. నూతన ఆర్థిక విధానాలతో ప్రభుత్వ పాలసీలను రక్షించేలా కోర్టులు తయారయ్యాయన్నారు. కేసులు... న్యాయవాదులకు ఇచ్చే ఫీజు, న్యాయవాది కమిట్మెంట్ మీద ఆధారపడి ఉన్నాయని చెప్పారు. 2009లో హైకోర్టు ధర్మాసనం ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసు అధికారులు పేర్లు వెల్లడించాలని, ఎన్కౌంటర్ మృతులకు శవపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినా... అనేక సందర్భాల్లో అవి అమలు కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం దిగిరావడానికి పౌరసమాజంలో వచ్చిన ప్రజా ఉద్యమాలే కీలకపాత్ర పోషించాయన్నారు. ప్రజా ఉద్యమాలు... రాజ్యం అణచివేత’పై పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ మాట్లాడుతూ అణచివేతలో భాగంగా పౌరహక్కుల నాయకులైన రామనాథం, నర్రా ప్రభాకర్‌రెడ్డి, పురుషోత్తం, ఆజం అలీ, గోపు రాజన్న వంటి నాయకులను కోల్పోయూమన్నారు. నల్లావసంత్ ఎన్ కౌంటర్... సాంబశివుడు, బెల్లి లలిత హత్యలు తెలంగాణ ఉద్యమంపై అణచివేతలో భాగంగా జరిగాయన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుమలరావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు. సీఎల్సీ జిల్లా క న్వీనర్ అనంతుల సురేష్ అధ్యక్షత వహించిన సభలో పౌరహక్కుల సంఘం జిల్లా బాధ్యులు పి.రమేష్ చందర్ ఆహ్వానం పలకగా... రాజేశ్వర్‌రావు సభను ముగించారు. సభలో సౌహర్ద్ర ప్రతినిధులుగా తెలంగాణ ప్రజాఫ్రంట్ నుంచి రమాదేవి, మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు కందాళ శోభారాణి, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు శాంత, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు సుధాకర్, తెలంగాణ ట్రైబల్ జేఏసీ కన్వీనర్ పోరిక ఉదయసింగ్ మాట్లాడారు. బహుజన సాంస్కృతిక సమాఖ్య బృందం పాడిన పాటలు సభికుల్లో ఉద్యమస్ఫూర్తిని నింపాయి. పౌరహక్కుల సంఘం జిల్లా కన్వీనర్‌గా సురేష్ పౌరహక్కుల సంఘం వరంగల్ జిల్లా కన్వీనర్‌గా అనంతుల సురేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో కన్వీనర్‌గా పి.రమేష్‌చందర్, కమిటీ కార్యవర్గసభ్యులుగా న్యాయవాది ఆర్.రాజేశ్వర్‌రావు, రాజారం ఎన్నికయ్యూరు. కాగా... వరంగల్ జిల్లా సభలు 12 ఏళ్ల తర్వాత ఉద్యమ స్ఫూర్తితో జరిగాయి. ప్రాణాలు కోల్పోయిన హక్కుల నేతలు, తెలంగాణ ఉద్యమకారులకు సభలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అంతేకాకుండా పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని, నల్లచట్టాలను రద్దు చేయాలని, ఓపెస్కాస్ట్లను ఎత్తివేయాలని, తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తీర్మానించారు.