మాట్లాడుతున్న చక్రపాణి, చిత్రంలో మర్రి శశిధర్‌రెడ్డి
స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమ చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఏ.చక్రపాణి అన్నారు.
సనత్‌నగర్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను విముక్తులను చేయడంలో స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమ చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఏ.చక్రపాణి అన్నారు. స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీ, స్వామి రామానందతీర్థ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 29 మంది స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.
అంతకముందు ఆయనజాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ స్వామిరామానందతీర్థ, పీవీ నర్సింహ్మారావు తదితరులు నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థాన ప్రజలకు విముక్తి కల్పించేందుకు పోరాడారన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం విలీనం తరువాత కూడా నిజాం రాజు ఐక్యరాజ్యసమితిలో వేసిన కేసు ఇంకా సజీవంగానే ఉందని గుర్తుచేశారు.
పీవీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ విమోచన దినమా...లేక విలీన దినమా? అనే విషయాలను పక్కనపెడితే నిజాం సంస్థాన ప్రజల ఆకాంక్షలు నెరవేరిన రోజుగా సెప్టెంబర్ 17ను అభివర్ణించారు. తెలంగాణ సమరయోధులు నిజాం కాలం నాటి సంఘటలను గుర్తు చేసుకున్నారు. తమను సన్మానించిన కమిటీ కార్యదర్శి వాణిదేవికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నారాయణరావు, వాణిదేవి, చంద్రశేఖర్‌రావు, నరసింహారెడ్డి, శేఖర్ మారంరాజు తదితరులు పాల్గొన్నారు.