తెలంగాణ నేతల వ్యాఖ్యలను ఖండించిన శశిధర్రెడ్డి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులపై కొంత మంది తెలంగాణ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎన్డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో అక్రమంగా ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తరిమేస్తామనడాన్ని ఆయన తప్పుబట్టారు.
తెలంగాణేతరులు 30 శాతం మంది అక్రమంగా హైదరాబాద్లో ఉద్యోగాలు సంపాదించారని, రాష్ట్రం విడిపోయిన తర్వాత వీరిని వెళ్లగొడతామని కొంత మంది నాయకులు బహిరంగంగా ప్రకటించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి రెచ్చగొట్టేలా ఉన్నాయని, వీటిని ఖండిస్తున్నానని చెప్పారు. ఇటువంటి ప్రకటనలు సీమాంధ్రుల్లో అభద్రతాభావం, గందరగోళం, ఉద్రిక్తతలు కలిగించే అవకాశముందని శశిధర్ రెడ్డి అన్నారు.