Congress Party: చర్యల్లో తేడాలెందుకు? కోమటిరెడ్డికి ఓ రూల్‌.. మర్రికి మరో రూల్‌! | No One Knows When What Decisions Will Be Taken In Congress | Sakshi
Sakshi News home page

హస్తం.. చిత్ర విచిత్రం: చర్యల్లో తేడాలెందుకు? కోమటిరెడ్డికి ఓ రూల్‌.. మర్రికి మరో రూల్‌!

Published Fri, Dec 2 2022 6:00 AM | Last Updated on Fri, Dec 2 2022 12:18 PM

No One Knows When What Decisions Will Be Taken In Congress - Sakshi

కాంగ్రెస్ ఒక విచిత్రమైన పార్టీ. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో.. ఎవరి మీద చర్యలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఒక్కొక్కరి మీద ఒక్కోలా చర్యలుంటాయి. బీజేపీ నేతలతో సమావేశమయ్యారనే ఆరోపణతో ఒక నేతను పార్టీ నుంచి బహిష్కరించారు. మరి మునుగోడులో బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలని చెప్పాడంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? 

మా వాడయితే ఓకే.!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని.. తమది ప్రజాస్వామ్య పార్టీ అని చెబుతారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన సీనియర్ నాయకుడు శశిథరూర్‌ను ఘోరంగా అవమానిస్తారు. బీజేపీ నేతలను కలుసుకున్నందుకు సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డిని ఆరేళ్ళ పాటు బహిష్కరించారు. ఆయనకు కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు. టీ.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఘోరంగా విమర్శించిన పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద నో యాక్షన్.

పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నా కనీసం పల్లెత్తు మాట అనలేకపోయింది కాంగ్రెస్ హైకమాండ్. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్రెడ్డికి  మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి చెప్పిన ఆడియో బయటపడినా ఎంపీ వెంకటరెడ్డి మీద నో యాక్షన్. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లేదా క్రమశిక్షణా సంఘం ఒక్కొక్కరి మీద ఒక్కోలా ఎందుకు వ్యవహరిస్తోంది? పార్టీలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల నాయకుడెవరు?

మాదంతా నిబద్ధత, క్రమశిక్షణ
కాంగ్రెస్ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ.. అక్టోబర్ 22న పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ షోకాజ్ నోటీసు పంపారు. కాంగ్రెస్ కార్యకర్త ఒకరికి ఫోన్ చేసి మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని వెంకటరెడ్డికి ఏఐసిసి నోటీసు పంపింది.

ఈ నోటీసుకు వెంకటరెడ్డి చాలా ఆలస్యంగా సమాధానం పంపారు. తాను రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు చెబుతున్న వాయిస్ మెసేజ్ తనది కాదని ఆయన చెప్పినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్పులు తనవి కావని వివరణ ఇచ్చినట్లు ఏఐసిసి వర్గాల సమాచారం. తాను నిబద్దత, క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని ఏఐసిసి క్రమశిక్షణ సంఘానికి చెప్పారట.

అసలు కారణం అదా.?
వెంకటరెడ్డి వివరణతో సంతృప్తి చెందిన ఎఐసిసి క్రమశిక్షణ కమిటీ ఇప్పట్లో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కనిపించడం లేదని ఏఐసిసి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన సిట్టింగ్ ఎంపీ కావడంతో చర్యలు తీసుకోవడానికి అధిష్టానం పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నది అసలు విషయం. ఇప్పటికే లోక్‌సభలో తక్కువ సభ్యులతో అధమ స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ మరో ఎంపీని వదులుకొనే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.

ఆయన మీద చర్యలు తీసుకుంటే ఏమవుతుందో పార్టీ హైకమాండ్‌కు బాగా తెలుసు. అందుకే క్రమశిక్షణ పేరుతో బెత్తం పట్టుకుంటే లోక్ సభలో మరింత పలచబడతామని అర్థం చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని చూసి చూడనట్లు వదిలేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మర్రి శశిధర్ రెడ్డిని ఏకపక్షంగా పార్టీ నుంచి బహిష్కరించారు. కనీస వివరణ తీసుకోకుండా ఆయనపై బహిష్కరణ వేటును కొందరు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సైతం చర్యలు తీసుకుంటే సీనియర్లు రగిలిపోయే అవకాశం ఉందట. 

పార్టీ క్రమశిక్షణను ధిక్కరించినా.. ఆయన ఎంపీ కావడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు సమాచారం. శశిధర్‌రెడ్డి చట్టసభ సభ్యుడు కాదు కనుకే  తేలిగ్గా ఆయన మీద చర్యలు తీసుకున్నారు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకుంటే లోక్సభలో కాంగ్రెస్ కౌంట్ ఒకటి తగ్గుతుంది. అందుకే హైకమాండ్ సైతం ఈయన విషయంలో సైలెంట్ అయింది. 
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement