తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోగలుగుతుందా? లేదా? అన్న చర్చ సాగుతోంది. తాజాగా పార్టీకి చెందిన మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరడం విశేషం. గత కొంతకాలంగా ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధోరణి నచ్చనివారిలో ఆయన కూడా ఒకరు. ఆయన పార్టీని వీడటం వల్ల పోయేదేమీ లేదని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నా, సీనియర్ నేతలు పార్టీని వదలిపోతున్నారన్న ప్రచారం పార్టీ క్యాడర్‌లో నైరాశ్యానికి దారి తీస్తుంది. అసలే గత మూడు ఉప ఎన్నికలలో పార్టీకి డిపాజిట్ దక్కలేదన్న బాధ పార్టీ కార్యకర్తలలో ఉంటే, కొద్దో, గొప్పో పేరున్న నేతలు ఇలా వెళ్లిపోతుంటే కాంగ్రెస్ మునిగిపోయే పడవ అన్న భావన సర్వత్రా ఏర్పడుతుంది.
నాలుగేళ్లుగా చేయికి బేజారే!
కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని తమవైపు ఆకర్షించడానికి భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్‌లు పోటీపడుతున్నాయి. ఆ పార్టీల ఆకర్షణ శక్తి ముందు కాంగ్రెస్ నిలవలేకపోతోంది. మునుగోడు నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా, ఉప ఎన్నికలో బీజేపీ పక్షాన పోటీచేశారు. ఆయన టీఆర్ఎస్‌పై ఓడిపోయారు. అంతేకాదు కాంగ్రెస్‌ను మూడో స్థానానికి పంపించారు.
అంతకుముందు పెద్దగా ఉనికి లేని బీజేపీకి అక్కడ తొంభైవేల ఓట్లు వస్తే, కాంగ్రెస్ 23 వేల ఓట్లే సంపాదించుకుని డిపాజిట్ కోల్పోయింది. అంతకుముందు జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో పార్టీ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. ఇలాంటి సమయంలో పార్టీకి అండగా ఉండవలసిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. దానికి కారణం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకపోవడం, పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు, రేవంత్‌పై అవిశ్వాసం, అసమ్మతి అని చెప్పాలి.
రేవంత్ Vs సీనియర్స్..
రేవంత్ ఏకపక్షంగా పార్టీని నడిపిస్తున్నారని, సీనియర్లను సంప్రదించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవం ఉండవచ్చు. ఉండకపోవచ్చు. కానీ, పార్టీ బాగుండాలని చిత్తశుద్దితో ఉన్నవారు ఎవరైనా ఈ అంశాల ఆధారంగా అల్లరి చేస్తారా? కాంగ్రెస్‌లో మాత్రం యధేచ్చగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్‌పై దృష్టి పెట్టి చర్చలు జరుపుతున్నారు. రేవంత్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయనకు క్లాస్ పీకారట. పార్టీ నుంచి ఎవరూ వెళ్లకుండా అంతా కలిసి కృషి చేయాలని, టీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పార్టీ ఇప్పటికే రకరకాల కారణాలతో బలహీనపడింది.
కనుమరుగు అవుతోన్న హస్త వైభవం
ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో పట్టు ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చేసిన వ్యూహాత్మక తప్పిదాలు కాంగ్రెస్ కొంప ముంచాయి. చివరికి గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలలో మెజార్టీ టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. గత ఎన్నికలలో హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 24 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మాత్రమే గెలిచారు. వారు కూడా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లోకి చేరిపోయారు. టీఆర్ఎస్‌ను ఎలాగోలా ఎదుర్కొందామంటే, ఇప్పుడు బీజేపీ పెద్ద తలనొప్పిగా మారింది.
కేవలం ఒక సీటు మాత్రమే ఉన్న బీజేపీ ఆ తర్వాత రెండు ఉప ఎన్నికలలో గెలిచి తన సంఖ్యాబలాన్ని మూడుకు చేర్చుకుంది. అనేక నియోజకవర్గాలలో ఇంకా పార్టీ పుంజుకోవలసి ఉంది. అందుకే ఆయా చోట్ల ఇతర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నేతలను లాగే పనిలో పడింది. తద్వారా టీఆర్ఎస్‌కు సవాలు విసరాలని చూస్తోంది. అందుకు మునుగోడు వేదిక అయింది. తానే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడం వరకు బీజేపీ కొంతమేర సఫలం అయిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే శశిధర్ రెడ్డి కూడా పార్టీని వీడారు.
మర్రికి పదవుల నీడ
మర్రి శశిధర్ రెడ్డి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. నిజానికి ఆయనకు పార్టీ ఎంతో గుర్తింపు ఇచ్చినట్లు లెక్క. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కుమారుడు కావడం ఆయనకు కలిసి వచ్చిన అంశం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శశిధర్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేసి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. చెన్నారెడ్డి సీఎం పదవి పోయిన తర్వాత ఆయనను గవర్నర్‌గా నియమించింది కాంగ్రెస్. ఖాళీ అయిన సనత్ నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో శశిధర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికతో పాటు మరో మూడుసార్లు ఆయన విజయం సాధించారు.
2004లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆయనకు బాగా ఉపయోగపడింది. సోనియాగాంధీ ఈయనకు మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. నక్సలిజంపై టాస్క్ ఫోర్స్ కమిటీలో ఆయనను తొలుత కన్వీనర్‌గా పనిచేశారు. తదుపరి ఆయనను ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య సంస్థ ఉపాధ్యక్షుడిగా నియమించారు. పదేళ్లపాటు పదవులు అనుభవించిన ఆయన ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్దం అని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని కూడా ఆయన అంటున్నారు. తెలంగాణ ఫస్ట్ అన్న నినాదం కూడా ఇచ్చారు.
లీడర్లు కాదు, లీడర్‌షిప్ కావాలి!
ఒకప్పుడు కాంగ్రెస్ విధేయులం అంటూ దివంగత నేత పీజేఆర్‌తో కలిసి పనిచేశారు. గోదావరి జలాల వినియోగంపై కూడా కొంత ప్రచారం చేశారు. కాంగ్రెస్‌లో ఆయనకు మంచి గుర్తింపే వచ్చింది. కుమారుడిని రాజకీయంగా పైకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్న ఆయనకు పరిస్థితులు కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం విశేషం. కాంగ్రెస్‌కు ఆయన ఎంత చేశారో కానీ, కాంగ్రెస్ వల్ల ఆయన బాగా లబ్దిపొందారన్నది వాస్తవం. గతంలో చెన్నారెడ్డి కూడా రెండు, మూడుసార్లు కాంగ్రెస్‌ను వీడి, తిరిగి కాంగ్రెస్‌లోనే చేరారు. అప్పటి పరిస్థితులు వేరు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీనే ప్రధానపక్షంగా ఉండేది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కుదేలైంది. జిల్లాలలో కాంగ్రెస్‌కు క్యాడర్ ఉన్నా, వారందరిని కదలించి, ముందుకు నడిపే నాయకత్వం అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి.
హస్తం.. కిం కర్తవ్యం?
పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి మొదట కొంత జోష్ వచ్చినా, వరుస ఓటములు, సీనియర్ల అలకలు, పార్టీ వీడటాలు వంటివాటితో నైతికంగా దెబ్బతిన్నారు. శశిధర్ రెడ్డి లేదా ఇతర సీనియర్ నేతలను కోల్పోవడానికి గల కారణాలపై పార్టీ ఎంతవరకు దృష్టి పెడుతోందన్నది చర్చగానే ఉంది. భవిష్యత్తులో మరికొందరు నేతలు కూడా ఇదే బాట పట్టవచ్చని చెబుతున్నారు. బీజేపీ ఒక వైపు పాదయాత్రలనో, మరొకటనో హడావుడి చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ పాదయాత్ర చేయాలా? బస్సు యాత్ర చేయాలా? అన్న మీమాంసలో ఉంటున్నారు.
డెబ్బైమూడేళ్ల వయసులో శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందన్నది చెప్పలేం కానీ, కాంగ్రెస్‌లో నైతికంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. అంతేకాక సామాజికవర్గం రీత్యా రెడ్డి కమ్యూనిటీని ఆకర్షించడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. దీనివల్ల కూడా కాంగ్రెస్‌కు నష్టం కలిగించవచ్చు. వచ్చే 2023 ఎన్నికలు కాంగ్రెస్ భవిష్యత్తుకు గీటురాయి అవుతాయి. అధికారంలోకి రావడమో, లేక కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలగడమో చేయలేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మరీ అగమ్య గోచరం అయ్యే ప్రమాదం ఉంటుంది.
హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment