కొందరి చరిత్ర ఘనంగా ఉంటుంది. వర్తమానం గందరగోళంగా ఉంటుంది. దీంతో భవిష్యత్ శూన్యంగా కనిపిస్తుంది. తెలంగాణలో ఒక యువనేత పరిస్థితి అలాగే తయారైంది. తాత ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి గొప్ప నాయకుడు అనిపించుకున్నారు. తండ్రి కూడా కాంగ్రెస్‌లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తండ్రి పార్టీ మారాడు..మరి కొడుకు హస్తం పార్టీలో ఉంటారా? తండ్రి బాటలో నడుస్తారా?
చరిత్ర ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం
మర్రి ఆదిత్యరెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. తాత మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గానూ పనిచేశారు. తెలంగాణలో ప్రముఖ నేతగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి మర్రి శశిధర్రెడ్డి రాష్ట్ర మంత్రిగా చేశారు. యూపీఏ హయాంలో కేంద్రంలో విపత్తు నిర్వహణ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. మర్రి కుటుంబ చరిత్ర ఎంతో ఘనం. కాని చెన్నారెడ్డి మూడో తరానికి చెందిన ఒక వారసుడి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోందనే చర్చ ఇప్పుడు గాంధీభవన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త తరం .. కొత్త ఛాలెంజ్
మర్రి శశిథర్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి ఢిల్లీ వెళ్ళి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. శశిధర్‌తో పాటు మరో కుమారుడు పురూరవరెడ్డి కూడా తండ్రితో బాటలోనే నడిచి కాషాయ కండువా కప్పుకున్నారు. తన కుటుంబ ఘనమైన చరిత్ర చూసైనా తనకు పార్టీలో విలువ ఇవ్వడంలేదని కినుక వహించిన శశిధర్‌రెడ్డి గాంధీభవన్ నుంచి బయటపడ్డారు. ఇప్పుడు శశిధర్ మరో కుమారుడు ఆదిత్య రెడ్డి వంతు వచ్చింది.
ఆదిత్య తన తండ్రి, సోదరుడి బాటలో నడుస్తారా? లేక తాత వారసత్వాన్ని కొనసాగిస్తారా? అంటూ చర్చ సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి టీజేఎస్‌లో చేరిన ఆదిత్యరెడ్డి తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు పూర్తవ్వగానే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. పునరాగమనం తర్వాత ఆదిత్యరెడ్డి కాంగ్రెస్‌లోన యాక్టివ్‌గానే ఉంటున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్న కుటుంబమే అయినా.. శశిధర్రెడ్డి హస్తానికి హ్యాండిచ్చారు. ఇప్పుడు తండ్రి, సోదరుడు పార్టీ మారడంతో తాను కూడా వారి బాటలో నడవాలా లేక కాంగ్రెస్‌లో కొనసాగాలా అనే విషయాన్ని తేల్చుకోలేక మీమాంసలో పడ్డారు ఆదిత్య రెడ్డి.
ఢిల్లీ సరే, గల్లీలో సంగతేంటీ?
మర్రి చెన్నారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మంచి పేరే ఉంది. తాతకు ఉన్న పేరు ప్రతిష్టలను ఉపయోగించుకుని కాంగ్రెస్‌లోనే రాజకీయంగా ఎదగాలని ఆదిత్య రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గతంలో తండ్రి పోటీ చేసి గెలిచిన సనత్ నగర్ లేదంటే తాండూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్ ఎలా రూపొందించుకోవాలో అనే విషయంపై కొద్ది రోజుల్లోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. మరి తాత..తండ్రి దారుల్లో ఏ దారి ఎంచుకుంటారో ? ఎలా నడుస్తారో చూడాలి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment