ఆ నోటీసును తిరస్కరించండి: దామోదర రాజనర్సింహ
మండలి చైర్మన్‌కు డిప్యూటీ సీఎం వినతి
విడిగా వినతిపత్రం సమర్పించిన టీ ఎమ్మెల్సీలు
సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పిపంపే తీర్మానం కోసం మంత్రి రామచంద్రయ్య 76వ నిబంధన కింద ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండలి చైర్మన్ చక్రపాణిని కోరారు. సోమవారం సభ ప్రారంభానికి ముందే మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, పలువురు ఎమ్మెల్సీలతో కలిసి చైర్మన్ కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ఈ బిల్లును కేవలం అభిప్రాయాల కోసం మాత్రమే శాసనసభ, మండలికి పంపించారని పేర్కొన్నారు.
మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసును బిజినెస్ రూల్స్ 80 ప్రకారం తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున రామచంద్రయ్య అందజేసిన నోటీసును తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు విడిగా మరొక వినతిపత్రం చైర్మన్‌కు అందజేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి నేతృత్వంలో అందజేసిన వినతిపత్రంపై కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ సభ్యులు పలువురు సంతకాలు చేశారు. మరోవైపు సీఎం కిరణ్ సభాహక్కులు ఉల్లంఘించారంటూ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మండలి చైర్మన్‌కు నోటీసు అందజేశారు. సీఎంతో పాటు మంత్రి రామచంద్రయ్య, సీఎస్ పి.కె.మహంతిలకు వ్యతిరేకంగా మండలి నిబంధనావళి 173 ప్రకారం ఆయన నోటీసు ఇచ్చారు.