తెలుగు ప్రజల ఆత్మగౌరంపై దెబ్బ: రామచంద్రయ్య
తెలుగు ప్రజల ఆత్మగౌరంపై దెబ్బ: రామచంద్రయ్య
Published Fri, Mar 17 2017 6:41 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
అమరావతి: నాడు ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మాభిమానం కొరకు పోరాడితే.. నేడు చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని మండలి కాంగ్రెస్ విపక్ష నేత సి.రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టిన ధన్యవాదల తీర్మానంపై శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పునర్విభజన చట్టంలోని అంశాలనే కేంద్రం ప్యాకేజి పేరుతో అందిస్తుందన్నారు. దీనికి చంద్రబాబు ధన్యవాదాల తీర్మానం పెట్టడం ప్రజలను వంచించడమేనన్నారు. సొంత రాజకీయ బలహీనతలను బయటపడకుండా కప్పిపుచ్చుకోవడానికే సీఎం ప్రత్యేక సహాయం ఎంతో గొప్పది, తన కష్టార్జితమని ప్రగల్భాలు పలుకుతున్నాడని విమర్శించారు.
పోలవరానిక జాతీయ హోదా, తెలంగాణలోని ముంపు మండలాల్ని కలపడం కూడా విభజన చట్టం ప్రకారమే జరిగిందన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశాలు అనేకం ఉన్నాయని తెలిపారు. వాటిని తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. విశాఖకు రైల్వేజోన్ వంటి కీలక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తేకుండా.. కేంద్రం ఇస్తున్న అరకొర సహాయాన్ని ఘనంగా చాటడం, అభినందన తీర్మానం చేయడం.. రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించడమే అని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాకు ప్రత్యేక సహాయనికి ఎంతో తేడా ఉందన్నారు.
అధికారపక్షం ఈ అంశాలను అసెంబ్లీ, మండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తకుండా అడ్డుతగిలి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట ప్రజలను మభ్యపెట్టెందుకు ఈ అభినందన తీర్మాన డ్రామా అని విమర్శించారు. కేంద్రంతో లాలూచీ పడి తెలుగు ప్రజల హక్కులను దెబ్బతీయడం క్షమించరాని నేరమన్నారు. ఎన్డీఏ, తెలుగుదేశం ప్రభుత్వాలు ఉమ్మడిగా చేసిన ఈ కుట్రకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని అభిప్రాయ పడ్డారు.
Advertisement