ఎందుకు శోకాలు పెడుతున్నారు?
పదే పదే రాష్ట్రం వెనకబడిపోయిందని, ఆర్థికంగా కుదేలైందని, తీవ్ర ఆర్థికలోటులో కూరుకుపోయిందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పడాన్ని శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్య తీవ్రంగా తప్పుబట్టారు. ఒక్క హైదరాబాద్ నగరం తప్ప మనకేమీ పోలేదని, బంగారం లాంటి సాగుభూమి ఉందని, బ్రహ్మాండమైన ఓడ రేవులున్నాయని, అభివృద్ధికి కావల్సిన అన్ని వనరులూ ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయని ఆయన అన్నారు.
ఒకవేళ ఈ ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి సాధించలేకపోతే, అందుకు ఒక సాకు చెప్పడానికి ముందుగా తెలుగుదేశం పార్టీ ఒక ప్లాట్ఫాం సిద్ధం చేసుకుంటోందా అని రామచంద్రయ్య నిలదీశారు. రాష్ట్ర విభజన తప్పనిసరని అందరికీ తెలిసినప్పుడు మాకు ఇది కావాలి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలానా వసతులు, నిధులు కావాలని ముందుగా అడగాల్సింది పోయి, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎందుకని ఆయన మండిపడ్డారు.