చక్రపాణి
‘‘ఎంత మంచి పాత్ర చేసినా, ఆ పాత్ర నిడివి ఎంత ఉన్నా ఆ సినిమా ఆడితేనే ఆర్టిస్టుకి గుర్తింపు వస్తుంది. ‘మల్లేశం’ చిత్రం నాకా గుర్తింపును తీసుకు వచ్చింది. ఈ చిత్రాన్ని నా లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు ఆనంద చక్రపాణి. ఆసు యంత్ర ఆవిష్కర్త, పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’లో టైటిల్ పాత్రధారి ప్రియదర్శికి తండ్రిగా నటించారు చక్రపాణి. అంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేసిన చక్రపాణి తన గురించి పలు విశేషాలు చెప్పారు.
► నటుడిగా ‘దాసి’ నా తొలి చిత్రం. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ‘మల్లేశం’ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేసిన ఆర్టిస్టు కమ్ పెయింటర్ లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది నాకు.
► ఈ సినిమా ప్రివ్యూ చూసి మల్లేశంగారు.. ‘అన్నా ఎంత బాగా చేసిండ్రు. మా నాయన గుర్తొచ్చారు, ఆయనతో ఉన్న అనుబంధం గుర్తొచ్చింది’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా ఈ సినిమాలోని నా నటనను చూసి పలువురు దర్శక–నిర్మాతలు ఇండస్ట్రీకి మంచి నటుడు దొరికాడని కొనియాడారు. నాలో గుమ్మడిని, యస్వీ రంగారావును చూసుకున్నామని కొందరు ఫేస్‌బుక్‌లో కామెంట్స్ పెట్టారు. ఏ పాత్ర అయినా చేయగలనని ఈ చిత్రంలో ప్రియదర్శి నిరూపించుకున్నారు. మంచి సినిమాలు తీయాలనే తపన ఉన్న ఈ చిత్రదర్శకుడు రాజు ‘మల్లేశం’ని అద్భుతంగా తెరకెక్కించారు.
► ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకపోవడం, కాంటాక్ట్ బేస్ సరిగా లేకపోవడానికి తోడు నా ఆర్థిక పరిస్థితులు నన్ను కొంతకాలం ఇండస్ట్రీకి దూరం చేశాయి. అడ్వటైజింగ్ ఫీల్డ్‌కి షిఫ్ట్ అయ్యాను. కాపీరైటర్‌గా, విజువలైజర్‌గా చేశాను. యాడ్‌ఫిల్మ్ చేసేప్పుడు వాటిలో కొన్నింటికి డైరెక్ట్ చేయడం, స్క్రిప్ట్ రాయడం చేశాను. కానీ సినిమాల పట్ల ఉన్న ప్రేమ నాతో పాటే పెరుగుతూనే ఉంది. నాకు తెలిసిన సర్కిల్‌లో ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమా డైరెక్షన్, స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేయడం లాంటివి చేశాను.
► ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నాను. రానా ‘విరాటపర్వం’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వెల్లడిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment