‘‘నటీనటులను ఎప్పుడూ ఒకే కోణంలో చూడకూడదు. అన్ని పాత్రల్లోనూ చూడాలి. ఫలానా పాత్రలే చేయగలుగుతామనే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకూడదు. నటీనటులకు ఇమేజ్ అనేది శాపం అని నా అభిప్రాయం. అందుకే కథ నచ్చితే ఏ పాత్ర అయినా చేస్తా’’ అన్నారు ప్రియదర్శి. ఆయన లీడ్ రోల్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రాజ్.ఆర్ దర్శకత్వంలో రాజ్.ఆర్, శ్రీ అధికారి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా ప్రియదర్శి చెప్పిన విశేషాలు.
► కమెడియన్, విలన్, హీరో... ఇలా ఏదీ నేను ప్లాన్ చేసుకోలేదు. ఇండస్ట్రీలో ఏదో ఒక పని దొరికితే చాలనుకున్నా. తమ్మారెడ్డి భరద్వాజ, యుగంధర్‌గారి సంస్థలో యాడ్ ఫిల్మ్స్‌కి అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా చేశా. ఇండస్ట్రీ అంటే ఏంటి? అనేది అక్కడే నేర్చుకున్నా. ఏడాదిన్నర తర్వాత మానేయాల్సి వచ్చింది.
► నటుడు అవుదామని ఫిక్స్ అయ్యాక పోర్ట్‌ఫోలియో పట్టుకుని స్టూడియోలు తిరగడానికి నేను అంత అందగాణ్ణి కాదు.. అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేశా. ‘అనుకోకుండా’ అనే షార్ట్‌ఫిల్మ్‌కి 10 లక్షల వ్యూస్ వచ్చాయి. నాకు అది ‘బాహుబలి’ రేంజ్ అన్నమాట. ఐదేళ్ల పాటు ఎక్కడ ఆడిషన్స్ ఉంటే అక్కడికి వెళ్లా. దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చా. ‘జున్ను’ షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో కరీంనగర్‌కి చెందిన వాళ్లు ఓ సినిమా అవకాశం ఇచ్చి, రూ. 5000 డబ్బులు కూడా ఇచ్చారు. కానీ, అది విడుదలవలేదు. మూడు నాలుగు సినిమాల తర్వాత ‘బొమ్మల రామారం’ సినిమాలో విలన్‌గా చేశా. ఆడిషన్స్‌కి వెళ్లి ‘పెళ్లిచూపులు, ఘాజీ’ సినిమాలకు ఎంపికయ్యాను. ‘పెళ్లిచూపులు’ సినిమా నన్ను ఓవర్‌నైట్ స్టార్‌ని చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
► ‘అ’ సినిమా చేస్తున్నప్పుడు రాజ్. ఆర్‌గారు చింతకింది మల్లేశం బయోపిక్ ‘మల్లేశం’లో లీడ్ రోల్ చేస్తావా? అని అడిగారు. కథ బాగా నచ్చడంతో ఓకే అన్నా. పైగా ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా చేశాక సీరియస్ పాత్రలు చేయగలం అనే నమ్మకం కుదిరింది.
► మల్లేశం 6వ తరగతి వరకే చదువుకున్నారు. మగ్గం నేసే పనిలో తన తల్లి పడుతున్న కష్టాన్ని చూస్తాడు. మల్లేశం భార్య కూడా కష్టంగా ఉందని మగ్గం పని మానేస్తుంది. దీంతో ఆ పని సులువు కావడానికి 1999లో ‘ఆసు’ యంత్రాన్ని కనుగొన్నారు మల్లేశం. అప్పటికే చాలామంది మగ్గం పనులు మానేసి ఉంటారు. ‘ఆసు’ యంత్రం రావడంతో వారందరూ మళ్లీ మగ్గం పనులు మొదలు పెట్టారు. మగ్గం నేసే ప్రతి ఇంట్లో ‘ఆసు’ యంత్రం ఉండాలన్నది మల్లేశం విజన్. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో ‘పద్మశ్రీ’ అవార్డు ఇచ్చింది.
► ‘మల్లేశం’ ప్రివ్యూ చూసిన వాళ్లంతా తెరపై ప్రియదర్శి కాదు.. మల్లేశం కనిపించాడని అంటుంటే చాలా సంతోషంగా అనిపించింది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు మంత్రి కేటీఆర్‌గారు ఎప్పుడూ ముందుంటారు. మా సినిమాని కూడా ఆయన ఎంతో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా చేశాక చేనేతల కష్టం ఏంటో తెలిసింది. అప్పటి నుంచి నేను కొనే బట్టల్లో 30 శాతం చేనేత వస్త్రాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నా. నా ఫ్రెండ్స్‌కి కూడా చెబుతున్నా.
ఇమేజ్ అన్నది నటులకు శాపం
Published Fri, Jun 21 2019 12:23 AM | Last Updated on Fri, Jun 21 2019 8:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment